చిట్యాల, వెలుగు : నల్గొండ జిల్లా చిట్యాల మండలం ఆరేగూడెం గ్రామంలో పాఠశాలకు సమీపంలో ఉన్న రసాయన వ్యర్థాల పరిశ్రమ నుంచి వస్తున్న తీవ్రమైన దుర్వాసన వల్ల చదువుకోలేకపోతున్నామని, అన్నం కూడా తినలేక తలనొప్పి, జ్వరంతో ఇబ్బంది పడుతున్నామని చిన్నారులు ఆవేదన వ్యక్తం చేశారు. తమ చదువుకు, ఆరోగ్యానికి ఇబ్బందిగా మారిన ఈ కంపెనీని తొలగించాలని కోరుతూ విద్యార్థులంతా ఆదివారం రాష్ట్ర గవర్నర్‌కు లేఖలు రాశారు. పాఠశాల దగ్గరి నుంచి పరిశ్రమను తొలగించి, ప్రశాంత వాతావరణంలో చదువుకునే అవకాశం కల్పించేలా ప్రభుత్వం, అధికారులు స్పందించి సమస్యను వెంటనే పరిష్కరించాలని వారు విజ్ఞప్తి చేశారు.
