ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా AI, మెషిన్ లెర్నింగ్ రంగాలు వేగంగా విస్తరిస్తున్నాయి. కంపెనీలు ఏఐ ఆధారిత టెక్నాలజీలపై భారీగా పెట్టుబడులు పెడుతున్నాయి. కొత్త ప్రాజెక్టులు, కొత్త ఉత్పత్తులు, ఆటోమేషన్ కోసం ప్రత్యేక ఇంజనీరింగ్ టీమ్స్ ఏర్పడుతున్నాయి. అయినప్పటికీ అదే ఏఐ రంగంలో పనిచేస్తున్న ఉద్యోగులను ఇప్పుడు లేఆఫ్స్ భయం వెంటాడుతోంది. తమ టీమ్‌లో రానున్న రోజుల్లో ఉద్యోగాల కోతలు ఉంటాయని పలువురు ఏఐ, ఎంఎల్ ఇంజనీర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
66 శాతం మందిలో భయం..
వర్క్‌ప్లేస్ కమ్యూనిటీ ప్లాట్‌ఫామ్ బ్లైండ్ నిర్వహించిన తాజా సర్వే ఈ ఆందోళనలను బయటపెట్టింది. జూలై 2026లో భారత్‌లోని 1,552 మంది ప్రొఫెషనల్స్‌ను ఈ సర్వేలో భాగం చేశారు. ఇందులో ఏఐ, ఎంఎల్ రంగాల్లో పనిచేస్తున్న 66 శాతం మంది తమ టీమ్‌లో వచ్చే 3 నుంచి 6 నెలల్లో లేఆఫ్‌లతో హెడ్‌కౌంట్ తగ్గింపు జరిగే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. అంటే ఏఐలో పనిచేస్తున్నామనే కారణంతో ఇక జాబ్ సెక్యూరిటీ లేదన్నమాట.
సేల్స్, మార్కెటింగ్‌లో మరింత భయం..
లేఆఫ్స్‌పై ఆందోళన ఏఐ రంగానికే పరిమితం కాలేదు. సేల్స్, మార్కెటింగ్ విభాగాల్లో 68 శాతం మంది ఉద్యోగులు తమ టీమ్‌లో ఉద్యోగాల కోతలు ఉండొచ్చని భావించారు. ఆ తర్వాత ఏఐ, ఎంఎల్ విభాగం 66 శాతంతో 2వ స్థానంలో నిలిచింది. ప్రొడక్ట్, డిజైన్ విభాగాల్లో 65 శాతం మంది ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. దీంతో కంపెనీలు ఖర్చులను తగ్గించుకోవడం, ఉత్పాదకతను పెంచుకోవడంపై దృష్టి పెడుతున్న నేపథ్యంలో ఏఐ నిపుణులు కూడా ఒత్తిడిని ఎదుర్కొంటున్నారని స్పష్టమవుతోంది.
ఇంజనీర్లలో మాత్రం కొంత ధైర్యం..
మరోవైపు ఇంజనీర్లు ఇతర విభాగాలతో పోలిస్తే కొంత తక్కువ ఆందోళనలో ఉన్నారు. ఉద్యోగ కోతలు “చాలా అవకాశముంది” అని కేవలం 24 శాతం మంది ఇంజనీర్లు మాత్రమే చెప్పారు. అయినప్పటికీ మొత్తం మీద 58 శాతం ఇంజనీర్లు తమ ఉద్యోగాలు ఏదో ఒక స్థాయిలో ప్రమాదంలో ఉన్నాయని భావిస్తున్నారు. డేటా, అనలిటిక్స్ విభాగంలో ఈ సంఖ్య 51 శాతంగా ఉంది.
ఏఐ పెరుగుతుంటే.. ఉద్యోగాలు ఎందుకు తగ్గాలి?
ఇక్కడే అసలు ప్రశ్న మొదలవుతోంది. ఏఐ వినియోగం పెరుగుతున్న కొద్దీ ఏఐ నైపుణ్యాలున్న ఉద్యోగులకు డిమాండ్ పెరగాలి. కానీ కంపెనీలు ఏఐని కేవలం కొత్త అవకాశాల కోసం కాకుండా పనిని ఆటోమేట్ చేయడానికి, తక్కువ సిబ్బందితో ఎక్కువ ఉత్పాదకత సాధించడానికి కూడా ఉపయోగిస్తున్నాయి. ఫలితంగా ఏఐ రంగంలో అవకాశాలు పెరుగుతున్నప్పటికీ, అదే సమయంలో కొన్ని ఉద్యోగాల స్వరూపం మారడం లేదా కొన్ని టీమ్‌ల పరిమాణం తగ్గడం జరుగుతోంది.
ఈ పరిస్థితి ఏఐ ఇంజనీర్లకు ఒక కీలక సందేశాన్ని ఇస్తోంది. కేవలం ఏఐ రంగంలో పనిచేస్తున్నామనే భరోసాతో ఉండకుండా, నిరంతరం కొత్త టెక్నాలజీలు, టూల్స్, డొమైన్ నైపుణ్యాలను నేర్చుకోవాల్సిన అవసరం పెరుగుతోంది. ఏఐ ఉద్యోగాలను మాయం చేస్తుందా అనే ప్రశ్న కంటే.. ఏఐతో కలిసి పనిచేయగల ఉద్యోగిగా ఎవరు మారతారన్నదే భవిష్యత్తులో కీలకం కానుంది.
