న్యూఢిల్లీ: కాక్రోచ్ జనతా పార్టీ ఫౌండర్ అభిజిత్ దీప్కేకు భారీ ఊరట దక్కింది. ఢిల్లీలోని మందిర్ మార్గ్ స్పెషల్ ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ కోర్టు దీప్కేకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. రూ.50 వేల వ్యక్తిగత పూచీకత్తుతో పాటు బాండ్ సమర్పించాలని కోర్టు ఆదేశించింది.
సీజేపీ ప్రతినిధులు సౌరవ్ దాస్, ఆశుతోష్ రాంకా అనుమతి లేకుండా జంతర్ మంతర్ దగ్గర నిరసన చేశారని ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో సౌరవ్ దాస్, ఆశుతోష్ రాంకాకు న్యాయస్థానం ఐదు రోజుల జ్యుడిషియల్ కస్టడీ విధించింది. సౌరవ్ దాస్, ఆశుతోష్లపై కేసు, అరెస్ట్ను నిరసిస్తూ అక్టోబర్ 16న ఢిల్లీలోని కన్నాట్ ప్లేస్లో సీజేపీ లెహ్రా దో తిరంగా మార్చ్కు పిలుపునిచ్చింది.
శాంతి భద్రతల కారణాలతో సీజేపీ ప్రొటెస్ట్కు పోలీసులు అనుమతి నిరాకరించారు. ఇందులో భాగంగానే కన్నాట్ ప్లేసులో లెహ్రా దో తిరంగా ర్యాలీ చేపట్టకుండా సీజేపీ ఫౌండర్ అభిజిత్ దీప్కేను శుక్రవారం (అక్టోబర్ 16) ఢిల్లీ పోలీసులు ముందస్తు అరెస్ట్ చేశారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నాడనే ఆరోపణలతో దీప్కేపై బీఎన్ఎస్లోని సెక్షన్ 126, 170 కింద పోలీసులు కేసు నమోదు చేశారు.
దీప్కేను శనివారం (అక్టోబర్ 17) మందిర్ మార్గ్ స్పెషల్ ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ కోర్టులో పోలీసులు ప్రవేశపెట్టారు. స్పెషల్ ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ కోర్టు దీప్కేకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. కోర్టు నిర్దేశించిన షరతులతో కూడిన శాంతి ఒప్పందంపై సంతకం చేసిన తర్వాత దీప్కే విడుదల అవుతారని ఢిల్లీ పోలీసులు తెలిపారు.
