గన్మెన్ల అంశంపై రాజకీయం తగదు.. మావోయిస్టుల సమస్య తగ్గినందుకే భద్రత తగ్గించాం:డీజీపీ సీవీ ఆనంద్

గన్మెన్ల అంశంపై రాజకీయం తగదు.. మావోయిస్టుల సమస్య తగ్గినందుకే భద్రత తగ్గించాం:డీజీపీ సీవీ ఆనంద్

వరంగల్: గన్మెన్ లను తగ్గించడంపై కొందరు రాజకీయం చేస్తున్నారని అన్నారు డీజీపీ సీవీ ఆనంద్. మావోయిస్టుల సమస్య తగ్గడంతో అన్ని రాష్ట్రాల్లో మాదిరిగానే రాజకీయ నాయకులకు  భద్రత తగ్గించామని తెలిపారు. పూర్తిగా తొలగించకుండా కొంతమేరకు తగ్గించామని చెప్పారు. సెక్యూరిటీ కమిటీ ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా భద్రత తగ్గించామని తెలిపారు. 

జిల్లాల పర్యటనలో డీజీపీ.. 2026 ఆగస్టు 9న వరంగల్ లో ప్రెస్ మీట్ నిర్వహించారు.  తెలంగాణలో  మావోయిజం, నక్సలిజం పూర్తిగా అంతమైందని అన్నారు. కర్రెగుట్టల్లో, కొన్ని ప్రాంతాల్లో ఇంకా మావోయిస్టులు ఉన్నారని.. ప్రధాన కేడర్ అంతా లొంగిపోయిందని చెప్పారు. లొంగిపోయిన వారికి పునరావాసం కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. 

ఆగస్టు 10న ములుగులో లొంగిపోయిన మావోయిస్టులతో ఇంటరాక్ట్ అవుతమని తెలిపారు. మావోయిస్టు కుటుంబాలను ఆదుకునే ప్రయత్నం చేస్తున్నట్లు చెప్పారు. తన  ఐపీఎస్ ప్రస్థానం వరంగల్ నుంచే ప్రారంభమైందని అన్నారు. కానీ ఒకప్పటి పరిస్థితి ఇప్పుడు లేదన్నారు.  ఇప్పుడు ప్రధాన సమస్య మాదకద్రవ్యాలు అని అన్నారు. డ్రగ్స్  నివారణకు కొత్త వ్యూహాలు అమలు చేస్తామని చెప్పారు. 

ఇప్పుడున్న పరిస్థితులకు అనుగుణంగా పోలీసు వింగ్ లో మార్పులు చేస్తున్నట్లు తెలిపారు. గ్రేహౌండ్స్, కొన్ని ఇతర విభాగాలను మారుస్తామన్నారు. డిపార్ట్‌మెంట్ మొత్తాన్నే సంస్కరిస్తున్నట్లు చెప్పారు. పోలీస్ స్టేషన్ లో రొటీన్ గా  జరిగే పనులు జరుగుతాయన్నారు. 

మెరుగైన సంస్కరణలు తీసుకొస్తున్నట్లు తెలిపారు. 1992-96 మధ్య చనిపోయిన వారికి ఎక్స్ గ్రేషియా కొంత తక్కువ వచ్చిందని మా దృష్టికి వచ్చిందన్నారు. వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని తెలిపారు. డ్రగ్స్ సమస్య ఇప్పుడు ప్రధాన సమస్యగా మారిందని.. నార్కొటిక్ బ్యూరో, ట్రాఫిక్, సీఐడీకి చెందిన వారితో కలసి ఒక బృందంగా ఏర్పడి జిల్లాల పర్యటనలు చేస్తున్నట్లు ఈ సందర్భంగా తెలిపారు.