సూరవీడు సర్పంచ్, ఉపసర్పంచ్ సస్పెన్షన్

సూరవీడు సర్పంచ్, ఉపసర్పంచ్ సస్పెన్షన్

వెంకటాపురం, వెలుగు: ములుగు జిల్లా వెంకటాపురం మండలం సూరవీడు గ్రామ సర్పంచ్ ఇర్ప మురళి, ఉపసర్పంచ్ కోర్స మురళీకృష్ణను సస్పెండ్ చేస్తూ ములుగు కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. గ్రామపంచాయతీ నిధుల వినియోగం, రికార్డుల నిర్వహణలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారన్న ఆరోపణలపై ఆరు నెలల పాటు వారిని బాధ్యతల నుంచి తొలగించారు. విచారణలో పంచాయతీ పాలకవర్గం అనుమతి, తీర్మానం లేకుండానే నిధులను ఖర్చు చేసినట్లు ఆఫీసర్లు గుర్తించారు.

కార్యాలయ నిర్వహణ, సీసీ డ్రెయిన్ డీసిల్టింగ్ పనుల పేరుతో ఖర్చులు చూపినట్లు తెలిపారు. ఆర్‌‌‌‌డబ్ల్యూఎస్ ఆఫీసర్ల అనుమతి లేకుండా రూ.2.30 లక్షల విలువైన హ్యాండ్‌‌‌‌పంప్ సామగ్రి కొనుగోలు చేసినట్లు గుర్తించారు. పలు చెల్లింపులు సంస్థలు, సరఫరాదారుల పేర్లకు బదులుగా వ్యక్తుల పేర్లతో జరిగినట్లు, డీజిల్ ఖర్చుల లాగ్‌‌‌‌బుక్‌‌‌‌లోనూ వ్యత్యాసాలు ఉన్నట్లు విచారణలో తేలింది. నిబంధనల ఉల్లంఘనలపై సమగ్ర విచారణ అనంతరం సర్పంచ్, ఉపసర్పంచ్‌‌‌‌లపై సస్పెన్షన్ వేటు పడింది.