మంగపేట, వెలుగు: హేమాచల క్షేత్ర సహజత్వాన్ని కాపాడుతూనే ఆలయాన్ని సమగ్రంగా అభివృద్ధి చేస్తామని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ధనసరి సీతక్క అన్నారు. ములుగు జిల్లా మంగపేట మండలం మల్లూరు హేమాచల లక్ష్మీనృసింహస్వామి ఆలయాన్ని గురువారం కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావుతో కలిసి మంత్రి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అనంతరం ఆలయ ప్రాంగణంలో నూతనంగా నిర్మించనున్న గోశాలకు భూమిపూజ చేసి శంకుస్థాపన చేశారు. ఆలయ అభివృద్ధి పనులపై దేవాదాయ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించిన మంత్రి, ఆలయ చరిత్ర, విశిష్టత ప్రతిబింబించేలా మాస్టర్‌ప్లాన్ రూపొందించి ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని సూచించారు. దట్టమైన అడవులు, పురాతన వృక్షాలు, సహజ జలవనరులతో కూడిన ప్రాంత సహజత్వానికి ఎలాంటి విఘాతం కలగకుండా అభివృద్ధి పనులు చేపట్టాలని ఆదేశించారు. భక్తుల సౌకర్యార్థం తాగునీరు, పారిశుద్ధ్యం, విశ్రాంతి ప్రదేశాలు, పార్కింగ్, రహదారులు, వసతి గదులు, కల్యాణ మండపం వంటి మౌలిక సదుపాయాలకు మాస్టర్‌ప్లాన్‌లో ప్రాధాన్యం ఇవ్వాలని తెలిపారు. 2027లో జరిగే గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని ఆలయ మండపం విస్తరణ పనులను వేగవంతం చేయాలని సూచించారు.
23 మందికి కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ..
మంగపేట మండలం గంపోనిగూడెం రైతువేదికలో వివిధ గ్రామాలకు చెందిన 23 మంది లబ్ధిదారులకు మంత్రి సీతక్క కల్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక సాయాన్ని లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని ఆమె సూచించారు. కార్యక్రమంలో జిల్లా అటవీ శాఖ అధికారి వికాస్ మీనా, అడిషనల్ కలెక్టర్ సంపత్ రావు, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ రేగ కల్యాణి, ఆలయ ఈవో వీరస్వామి, డీపీవో కొండ వెంకయ్య తదితరులు పాల్గొన్నారు.
