- శివసత్తుల పూనకాలు, పోతరాజుల
- విన్యాసాలు, యువత డ్యాన్సులతో సందడి
కోల్బెల్ట్, వెలుగు: ఆషాఢమాసం బోనాలను పురస్కరించుకొని మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి మున్సిపాలిటీలోని గాంధారీ మైసమ్మ ఆలయం భక్తులతో కిక్కిరిసిపోయింది. డప్పు చప్పుళ్లు, పోతురాజుల విన్యాసాలు, యువకుల నృత్యాలు, శివసత్తుల పూనకాలు, వేలాది మంది భక్తుల అమ్మవారి నామస్మరణతో ఆలయ పరిసరాలు మార్మోగాయి. ముందుగా బొక్కలగుట్ట గ్రామశివారు రాళ్లవాగు ఒడ్డుకు శివసత్తులు, మహిళలు బోనాలతో వచ్చి సంప్రదాయబద్దంగా చెట్టుకు పూజలు చేశారు. అనంతరం జాతర జరిగే గాంధారి మైసమ్మ ఆలయానికి బయలుదేరగా.. వీరికి భక్తులు ఎదురొచ్చి స్వాగతం పలికారు.
మంచిర్యాల, ఆసిఫాబాద్, పెద్దపల్లి జిల్లాలతోపాటు మహారాష్ట్ర, కోల్బెల్ట్ప్రాంతానికి చెందిన వేలాది కుటుంబాలు తరలివచ్చి బోనాలు సమర్పించి అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. పెద్దఎత్తున జంతుబలులు ఇచ్చి విందులు, వినోదాలతో సందడి చేశారు. బెల్లంపల్లి ఏసీపీ కిరణ్కుమార్, మందమర్రి సీఐ రమేశ్ నేతృత్వంలో పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు. క్యాతనపల్లి మున్సిపల్ చైర్ పర్సన్ సంధ్యారాణి, కమిషనర్ మురళీకృష్ణ, డీసీపీ ప్రెసిడెంట్రఘునాథ్ రెడ్డి, బీజేపీ స్టేట్వైస్ ప్రెసిడెంట్ రఘునాథ్ వెరబెల్లి, కాంగ్రెస్ టౌన్ ప్రెసిడెంట్వోడ్నాల శ్రీనివాస్, ప్రజాప్రతినిధులు పాల్గొని పూజలు చేశారు.
