మానవత్వం... అనేది ఒకటుండేదని నెక్స్ట్ జనరేషన్ పుస్తకాల్లో చదవాల్సి వస్తుందేమో. మానవత్వం గురించి మాట్లాడినా పిచ్చోళ్ల లాగా చూస్తారేమో జనం పోనుపోనూ. మంచిర్యాల జిల్లాలో జరిగిన ఈ ఘటనకు చూస్తే అలాగే అనిపిస్తుంది. అప్పుడే పుట్టిన ఓ శిశువును చెత్తకుప్పలో పడేసారు నరరూప రాక్షసులు..పసికందు ఏడుపు, ఆర్తనాదం వినిపిస్తున్నా చుట్టూ ఉన్న జనం చోద్యం చూస్తూ నిలబడ్డారు జనం. ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి...
మంచిర్యాల జిల్లా నస్పూర్ మండలం లక్ష్మీనగర్–కృష్ణ కాలనీ వెళ్లే దారిలో అప్పుడే పుట్టిన ఓ శిశువును చెత్తకుప్పలో పడేసిన ఘటన కలకలం రేపింది. పసికందు ఏడుపు, ఆర్తనాదం వినిపిస్తున్నా చుట్టూ ఉన్న కొందరు జనం చోద్యం చూస్తూ నిలబడటం ప్రతి ఒక్కరి మనసును కలచివేస్తోంది.అయితే అదే సమయంలో మానవత్వం ఇంకా బతికే ఉందని నిరూపిస్తూ కృష్ణ కాలనీకి చెందిన లేడీ జిమ్ ట్రైనర్ వెంటనే స్పందించి శిశువును తన చేతుల్లోకి తీసుకుని కాపాడారు.
అనంతరం 108 అంబులెన్స్‌కు సమాచారం అందించి మంచిర్యాల ఆసుపత్రికి తరలించేలా చర్యలు చేపట్టారు."ఒక తల్లి గర్భంలో తొమ్మిది నెలలు పెరిగి ఈ లోకంలోకి వచ్చిన ఆ చిన్నారి… జీవితం మొదలైన క్షణాల్లోనే చెత్తకుప్పలో కనిపించడం హృదయ విదారకం. కన్నీళ్లు పెట్టే ఆ పసికందుకు తప్పు ఏముంది? పుట్టడం తప్పా..? మన చుట్టూ జరుగుతున్న ఇలాంటి ఘటనలు సమాజం తన మనవత్వాన్ని మరోసారి ప్రశ్నించుకునేలా చేస్తున్నాయి.
శిశువును కాపాడిన లేడీ జిమ్ ట్రైనర్ చూపిన ధైర్యం, దయకు స్థానికులు అభినందనలు తెలుపుతున్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు, పసికందుల రక్షణపై సమాజంలో మరింత అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది.
ఈ ఘటన ప్రతి ఒక్కరికీ ఒక గట్టి హెచ్చరిక. పుట్టిన వెంటనే రక్షణ కోసం ఎదురుచూస్తున్న పసికందును నిర్లక్ష్యం చేయడం సమాజానికి తీరని మచ్చ. ఎవరైనా ఇలాంటి పరిస్థితిలో శిశువును గుర్తిస్తే వెంటనే 108కు సమాచారం అందించి, సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రి లేదా పోలీసులకు తెలియజేయాలి.శిశువుల ప్రాణ రక్షణలో ప్రతి క్షణం ఎంతో విలువైనది.
