గాజా పీస్ ప్లాన్కు నో.. బలగాలను వెనక్కి తీసుకోబోనన్న నెతన్యాహు

 గాజా పీస్ ప్లాన్కు నో.. బలగాలను వెనక్కి తీసుకోబోనన్న నెతన్యాహు
  • తేల్చిచెప్పిన ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు
  • ప్రధానిగా తాను ఉన్నంత వరకు పాలస్తీనా ఏర్పాటు కాదని వెల్లడి

గాజా: పశ్చిమాసియాలో శాంతి స్థాపనే లక్ష్యంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేపట్టిన ప్రయత్నాలకు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు షాకిచ్చారు. గాజా లేదా వెస్ట్ బ్యాంక్‌‌‌‌‌‌‌‌లో పాలస్తీనా దేశం ఏర్పాటు అనే ప్రశ్నే లేదని ఆయన కుండబద్దలు కొట్టారు.  ట్రంప్ ఇటీవల ప్రతిపాదించిన 15-పాయింట్ల గాజా శాంతి ప్రణాళికను పూర్తిగా తిరస్కరిస్తున్నట్టు ప్రకటించారు.

 యుద్ధాన్ని ముగించే దిశగా ఈ రోడ్‌‌‌‌‌‌‌‌మ్యాప్ ఒక పెద్ద మైలురాయి అని ట్రంప్ ప్రకటించిన వారం రోజులకే నెతన్యాహు ఈ వ్యాఖ్యలు చేయడం తీవ్ర చర్చనీయాంశమైంది. ‘‘నేను ఇజ్రాయెల్ ప్రధానిగా ఉన్నంతకాలం గాజా లేదా వెస్ట్‌‌‌‌‌‌‌‌బ్యాంక్‌‌‌‌‌‌‌‌లో ఏ రూపంలోనూ పాలస్తీనా దేశం ఏర్పాటు కాదు. హమాస్ 
పూర్తిగా నిరాయుధులుగా మారే వరకు గాజా నుంచి ఇజ్రాయెల్ సైన్యం ఒక్క అడుగు కూడా వెనక్కి వేయబోదు” అని బెంజమిన్ నెతన్యాహు తేల్చిచెప్పారు.

అమెరికా, ఇజ్రాయెల్ మధ్య భిన్నాభిప్రాయాలు

ఇజ్రాయెల్ తమకు బాగా సహకరిస్తోందని, ఈ ఒప్పందంతో ఆ దేశం చాలా సంతోషంగా ఉందని ఇటీవల ట్రంప్ వ్యాఖ్యానించారు. అయితే, పరిస్థితి ఎంత క్లిష్టంగా ఉన్నప్పటికీ దీన్ని ముందుకు తీసుకెళ్తామని ఆయన తెలిపారు. 

మరోవైపు, వాషింగ్టన్‌‌‌‌‌‌‌‌లో నెతన్యాహుతో జరిగిన భేటీలో గాజా భవిష్యత్తు గురించి చర్చించలేదని ఇజ్రాయెల్ వర్గాలు పేర్కొనడం గమనార్హం. దీంతో అమెరికా, ఇజ్రాయెల్ అగ్రనేతల మధ్య శాంతి ప్రణాళిక అమలు విషయంలో భిన్నాభిప్రాయాలు ఉన్నట్లు స్పష్టమవుతోంది.

ఇజ్రాయెల్ వైఖరిపై ముస్లిం దేశాల ఆందోళన 

ఈ రోడ్‌‌‌‌‌‌‌‌మ్యాప్‌‌‌‌‌‌‌‌కు తాము కట్టుబడి ఉన్నామని హమాస్ ప్రకటించింది. అయితే, ముందుగా ఇజ్రాయెల్ తన దాడులను ఆపి, కాల్పుల విరమణ ఒప్పందాన్ని అమలు చేయాలని షరతు విధించింది. ఇజ్రాయెల్ వైఖరిపై యూఏఈ, ఖతార్, జోర్డాన్, ఇండోనేసియా, పాకిస్తాన్, తుర్కియే, సౌదీ అరేబియా, ఈజిప్ట్ దేశాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాయి. గాజాలో ఇజ్రాయెల్ సైనిక చర్యలు శాంతి ప్రక్రియను దెబ్బతీస్తాయని, మానవతా సంక్షోభాన్ని మరింత తీవ్రం చేస్తాయని ఆ దేశాల విదేశాంగ మంత్రులు సంయుక్త ప్రకటనలో హెచ్చరించారు.