కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు ఆర్థిక మంత్రిత్వ శాఖ తీపి కబురు చెప్పింది. సాధారణంగా ప్రతినెలా ఆఖరి తేదీల్లో అందే జీతభత్యాలు, పెన్షన్లు ఈసారి సెప్టెంబర్ 25, 2026 శుక్రవారమే ముందస్తుగా జమ కానున్నాయి. సెప్టెంబర్ 28 నుంచి 30 వరకు దేశవ్యాప్తంగా జరగనున్న 3 రోజుల బ్యాంకు సమ్మె కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారికంగా ప్రకటించింది.
ఆర్థిక మంత్రిత్వ శాఖ వ్యయ విభాగం కింద పనిచేసే కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్ సెప్టెంబర్ 23న జారీ చేసిన ఆదేశాల ప్రకారం ఈ ప్రయోజనం ఎవరెవరికి వర్తిస్తుందనే స్పష్టత ఇచ్చారు. రక్షణ, పోస్టల్, టెలికమ్యూనికేషన్స్ విభాగాలతో సహా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులందరికీ, కేంద్ర ప్రభుత్వ పారిశ్రామిక ఉద్యోగులకు, బ్యాంకు లు, పే అండ్ అకౌంట్స్ ఆఫీసుల ద్వారా పెన్షన్ అందుకునే కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లందరికీ ఈ ముందస్తు చెల్లింపు వర్తిస్తుంది.
యూనైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్(UFBU) తలపెట్టిన సమ్మె వల్ల నెలాఖరులో బ్యాంకింగ్ లావాదేవీలకు తీవ్ర అంతరాయం ఏర్పడే అవకాశం ఉందని ఫైనాన్షియల్ సర్వీసెస్ డిపార్ట్‌మెంట్ హెచ్చరించడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అయితే సెప్టెంబర్ 25న ఖాతాల్లో జమయ్యే మొత్తం కేవలం ముందస్తు చెల్లింపు మాత్రమేనని ప్రభుత్వం స్పష్టం చేసింది. పూర్తిస్థాయి జీతం, పెన్షన్ లెక్కించిన తర్వాత ఏదైనా తేడాలు ఉంటే.. దానిని అక్టోబర్ 2026 జీతంలో సర్దుబాటు చేస్తారు.
బ్యాంకులు మూతపడటం వల్ల ఉద్యోగులు, పెన్షనర్లు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతోనే ఈ ముందస్తు ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో అన్ని మంత్రిత్వ శాఖలు, విభాగాలు తమ ఉద్యోగుల జీతాల బిల్లులను సెప్టెంబర్ 25 నాటికి బ్యాంకులకు సమర్పించాలని ఆర్థిక మంత్రిత్వ శాఖ సూచించింది. దీనివల్ల సమ్మె ప్రారంభం కావడానికి ముందే అందరి ఖాతాల్లో డబ్బులు జమ కానున్నాయి.
