వాషింగ్టన్: సీఎన్ఎన్, ఎంఎస్ నౌ, పొలిటికో మీడియా సంస్థలపై నిషేధం విషయంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు భారీ ఎదురు దెబ్బ తగిలింది. సీఎన్ఎన్, ఎంఎస్ నౌ, పొలిటికో వార్తా సంస్థలపై ట్రంప్ విధించిన నిషేధం ఎత్తివేయాలని యూఎస్ డిస్ట్రిక్ట్ కోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. వైట్‌హౌస్‌లోకి ప్రవేశించకుండా నిషేధానికి గురైన సీఎన్ఎన్, ఎంఎస్ నౌ, పొలిటికో వార్తా సంస్థల జర్నలిస్టుల ప్రెస్ పాస్‌లను తక్షణమే పునరుద్ధరించాలని యూఎస్ డిస్ట్రిక్ట్ జడ్జి తీమోతీ కెల్లీ ప్రభుత్వాన్ని ఆదేశించారు.
నిషేధం ఎందుకంటే..?
తమ ప్రభుత్వంపై అసత్యాలు, కల్పిత వార్తలు ప్రసారం చేస్తున్నారనే ఆరోపణలతో సీఎన్ఎన్, ఎంఎస్ నౌ, పొలిటికో మీడియా సంస్థలపై ట్రంప్ నిషేధం విధించారు. సదరు వార్తా సంస్థల ప్రతినిధులను అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌస్‌లోకి ప్రవేశించకుండా వారి ప్రెస్ పాస్‌లను ప్రభుత్వం రద్దు చేసింది.
ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ మీడియా సంస్థలు న్యాయస్థానాన్ని ఆశ్రయించాయి. ప్రభుత్వ నిర్ణయం ప్రాథమిక హక్కులు, పత్రికా స్వేచ్ఛను ఉల్లంఘించేలా ఉన్నాయని.. ఆ నిర్ణయంపై స్టే విధించాలని కోరాయి. ఈ పిటిషన్లపై యూఎస్ డిస్ట్రిక్ట్ జడ్జి తీమోతీ కెల్లీ విచారణ జరిపారు. జాతీయ భద్రతా కారణాల దృష్ట్యానే సదరు వార్త సంస్థలపై నిషేధం విధించినట్లు ప్రభుత్వ తరుఫు లాయర్ వాదించారు.
వైట్‌హౌస్ ప్రవేశం అనేది ఒక ప్రత్యేక అధికారమే తప్ప హక్కు కాదని పేర్కొన్నారు. పిటిషనర్ల వాదనతో ఏకీభవించిన న్యాయస్థానం.. ప్రభుత్వ వాదనలను తోసిపుచ్చింది. ట్రంప్ విధించిన ఈ నిషేధం అమెరికా రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులు, పత్రికా స్వేచ్ఛను ఉల్లంఘించేలా ఉందని న్యాయస్థానం పేర్కొంది. ముందస్తు నోటీసు ఇవ్వకుండా జర్నలిస్టుల గుర్తింపు కార్డులను రద్దు చేయడం రాజ్యాంగ విరుద్ధమని స్పష్టం చేసింది.
సీఎన్ఎన్, ఎంఎస్ నౌ, పొలిటికో మీడియా సంస్థలపై ప్రభుత్వం విధించిన నిషేధంపై 14 రోజుల పాటు తాత్కాలికంగా స్టే విధించింది. సదరు వార్తా సంస్థల జర్నలిస్టులకు వైట్ హౌస్ ప్రెస్ పాస్ లను పునరుద్ధరించాలని ప్రభుత్వాన్ని న్యాయస్థానం ఆదేశించింది.
