వాషింగ్టన్: మూడు రోజుల పర్యటనలో భాగంగా చైనా అధ్యక్షుడు షీ జిన్ పింగ్ అమెరికా పర్యటనకు వెళ్లారు. మేరీలాండ్‌లోని వైమానిక స్థావరం జాయింట్ బేస్ ఆండ్రూస్ (Joint Base Andrews)కు చేరుకున్న జిన్‌పింగ్ దంపతులకు డొనాల్డ్ ట్రంప్, అమెరికా ప్రథమ మహిళ మెలానియా ట్రంప్ స్వయంగా విమానాశ్రయానికి వెళ్లి గ్రాండ్ వెల్కమ్ పలికారు. అమెరికాతో ఉప్పు నిప్పులా వ్యవహారించే చైనా అధ్యక్షుడికి ప్రోటోకాల్ పక్కనబెట్టి ట్రంప్ స్వయంగా ఎయిర్ పోర్టుకు వెళ్లి వెల్కమ్ చెప్పడం హాట్ టాపిక్‌గా మారింది.
సాధారణంగా అమెరికా అధ్యక్షులు విదేశీ నేతలకు ఎయిర్ పోర్టుకు వెళ్లి స్వాగతం పలకరు. అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌస్‌లోనే ఆతిథ్యం ఇస్తారు. ఒక అమెరికా అధ్యక్షుడు విమానాశ్రయానికి వెళ్లి విదేశీ నేతకు స్వాగతం పలకడం గడిచిన 60 ఏళ్లలో (1962 తర్వాత) ఇదే ఫస్ట్ టైమ్. చివరగా 1962లో అప్పటి ప్రెసిడెంట్ జాన్ ఎఫ్. కెన్నెడీ బ్రిటన్ ప్రధాని హెరాల్డ్ మాక్‌మిలన్‌కు ఇలా ఎయిర్‌పోర్ట్‌లో స్వాగతం పలికారు.
60 ఏండ్ల తర్వాత తాజాగా ట్రంప్ ఎయిర్ పోర్టుకు వెళ్లి జిన్ పింగ్‌కు వెల్కమ్ చెప్పడం విశేషం. ఈ సందర్భంగా జిన్ పింగ్‌కు ఎయిర్ పోర్టులో ఘన స్వాగతం లభించింది. చైనా అధ్యక్షుడి కోసం రన్‌వేపై దాదాపు 100 అడుగుల రెడ్ కార్పెట్ పరిచారు. 21 గన్ సెల్యూట్, సైనిక బ్యాండ్ వాయిద్యాల మధ్య అధికారులు స్వాగతం పలికారు.
జిన్ పింగ్, ట్రంప్ మధ్య కీలక అంశాలపై చర్చ
ఈ పర్యటనలో భాగంగా జిన్ పింగ్, ట్రంప్ మధ్య ఉన్నత స్థాయి ద్వైపాక్షిక చర్చలు జరగనున్నాయి. వాణిజ్యం, తైవాన్ సంక్షోభం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), అంతర్జాతీయ భద్రతపై ఇరుదేశాధి నేతలు చర్చించనున్నారు. రష్యా విషయంలో అమెరికా, చైనా మధ్య విభేదాల నేపథ్యంలో ట్రంప్, జిన్ పింగ్ భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది.
