పండుగల వేళ సామాన్యులకు శుభవార్త: పామాయిల్, సోయా, సన్‌ఫ్లవర్ ఆయిల్ రేట్లు తగ్గనున్నాయ్‌!

పండుగల వేళ సామాన్యులకు శుభవార్త: పామాయిల్, సోయా, సన్‌ఫ్లవర్ ఆయిల్ రేట్లు తగ్గనున్నాయ్‌!

దేశంలో రానున్న పండుగ సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని సామాన్యులకు ఊరటనిచ్చేలా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వంటనూనెల ధరలు విపరీతంగా పెరుగుతున్న వేళ పామాయిల్, సోయా ఆయిల్, సన్‌ఫ్లవర్ ఆయిల్ వంటి ముడి, రిఫైండ్ వంటనూనెలపై ఇంపోర్ట్ డ్యూటీని భారీగా తగ్గిస్తూ బుధవారం రాత్రి కీలక నోటిఫికేషన్ విడుదల చేసింది. గత సంవత్సర కాలంగా వంటనూనెల ధరలు దాదాపు 20 శాతం మేర పెరగడంతో సామాన్యుల బడ్జెట్ తలకిందులవుతోంది. సెప్టెంబర్ నుండి నవంబర్ మధ్య వచ్చే పండుగల వేళ పిండివంటలు, స్వీట్ల తయారీకి నూనెల వినియోగం భారీగా పెరుగుతుంది. ప్రజలకు పండుగ కానుకగా ఈ తగ్గింపును ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది.

ప్రభుత్వ నిర్ణయంతో వివిధ రకాల వంటనూనెలపై దిగుమతి సుంకాలు భారీగా పడిపోయాయి. ముడి పామాయిల్, ముడి సోయా ఆయిళ్లపై బేసిక్ దిగుమతి సుంకాన్ని 10 శాతం నుండి 5 శాతానికి తగ్గించారు. అలాగే రిఫైండ్ పామాయిల్, సోయా ఆయిల్ సుంకాన్ని గతంలో ఉన్న 32.5 శాతం నుండి 27.5 శాతానికి కుదించారు. ఇక అన్నింటికంటే ఎక్కువగా ముడి సన్‌ఫ్లవర్ ఆయిల్ పై సుంకాన్ని 10 శాతం నుండి ఏకంగా సున్నా శాతానికి తగ్గించడం విశేషం. అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్‌మెంట్సెస్, సోషల్ వెల్ఫేర్ సర్ఛార్జ్‌లను కలుపుకుని చూస్తే.. ముడి పామాయిల్, సోయా ఆయిల్ పై పన్ను భారం 16.5 శాతం నుండి 11 శాతానికి తగ్గగా, ముడి సన్‌ఫ్లవర్ ఆయిల్ పై మొత్తం సుంకం కేవలం 5.5 శాతానికి మాత్రమే పరిమితం కానుంది.

దిగుమతి సుంకాలు తగ్గుతాయనే అంచనాలతో గత కొద్ది రోజులుగా రిఫైనర్లు కొనుగోళ్లను కొంతమేర నిలిపివేశారు. అయితే ఇప్పుడు సుంకాలు అధికారికంగా తగ్గడంతో పండుగ సీజన్ డిమాండ్‌ను తట్టుకునేందుకు వారు మళ్లీ పెద్ద ఎత్తున దిగుమతులు చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు. సన్‌ఫ్లవర్ ఆయిల్‌కు అత్యధికంగా సుంకం తగ్గడంతో.. ఇది మార్కెట్లో ప్రధాన ఆకర్షణగా మారనుంది. ఇది సోయా ఆయిల్, పామాయిల్ డిమాండ్‌ను కొంతమేర సన్‌ఫ్లవర్ వైపు మళ్లించే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. భారత్ తన అవసరాల కోసం దాదాపు మూడింట రెండు వంతుల వంటనూనెలను విదేశాల నుంచే దిగుమతి చేసుకుంటున్న వేళ కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం అంతర్జాతీయంగా మలేషియా పామాయిల్, యూఎస్ సోయా ఆయిల్ ఫ్యూచర్స్‌కు కూడా ఊతమిస్తుంది.

ప్రస్తుత సుంకాల తగ్గింపు ప్రభావం చివరకు రిటైల్ మార్కెట్లో వినియోగదారులకు ఏ స్థాయిలో అందుతుందనేది సరఫరా గొలుసులోని వివిధ దశల తీరుపై ఆధారపడి ఉంటుంది. అయితే పండుగ వేళ వంటనూనెల ధరలు దిగివచ్చి, సామాన్యుల వంటింట్లో సంతోషాలు నిండాలని ప్రజలు ఆశిస్తున్నారు. ప్రభుత్వం తీసుకున్న ఈ సకాల నిర్ణయం వంటనూనెల వ్యాపార వర్గాల్లోనూ, సాధారణ ప్రజల్లోనూ సంతోషాన్ని నింపింది.