ప్రపంచ గ్రీన్‌హౌస్ వాయు ఉద్గారాలలో నేపాల్ వాటా కేవలం 0.1% మాత్రమే. అయినా హిమాలయాలు వేడెక్కడం, హిమానీనదాలు అస్థిరంగా మారడం వల్ల అత్యంత తీవ్రమైన వాతావరణ విపత్తులను ఎదుర్కొంటున్న దేశంగా నేపాల్ మారింది.
హిమాలయాల్లో గ్లోబల్ సగటు కంటే రెట్టింపు వేగంతో ఉష్ణోగ్రత పెరుగుతోంది. దీనివల్ల హిమానీనదాలు వేగంగా కరుగుతున్నాయి. గ్లేసియర్స్ ( భారీ మంచు కొండలు) కూడా వేగవంతంగా కరిగిపోతున్నాయి.
గ్లేసియల్ లేక్ అవుట్‌బరస్ట్ ఫ్లడ్ (జీఎల్‌ఓఎఫ్) అంటే హిమనదీయ కట్ట తెగిపోయి ఒక్కసారిగా భారీనీరు దిగువ ప్రాంతాలను ముంచెత్తడం వల్ల ఆకస్మిక వరదలు, కొండచరియలు విరిగిపడటం సర్వసాధారణం అయ్యాయి.
2024లోనే వరదలు, ల్యాండ్ స్లైడ్స్ వల్ల నేపాల్‌కు 3 బిలియన్ డాలర్లకు పైగా నష్టం వాటిల్లింది. జలవిద్యుత్ కేంద్రాలు, రోడ్లు, పంటలు, ఇళ్లు కొట్టుకుపోయాయి. హిమాలయాలపై ఆధారపడిన కోట్లాదిమంది జీవనోపాధి ప్రమాదంలో పడింది.
ఒక వాతావరణ విపత్తు బిలియన్ల నష్టం కలిగించినప్పుడు బాధ్యత ఎవరిది? అమెరికా చారిత్రాత్మకంగా అత్యధిక ఉద్గారాలు చేసింది (25%), చైనా ప్రస్తుతం అత్యధిక ఉద్గారాలు చేస్తోంది (32%), భారత్ 7% వాటాతో మూడో స్థానంలో ఉంది. కానీ నష్టం మాత్రం ఏమీ చేయని నేపాల్ లాంటి దేశాలు భరిస్తున్నాయి. ఇదే క్లైమేట్ ఇన్‌జస్టిస్.
నేపాల్ చట్టపరంగా పరిహారం డిమాండ్ చేయగలదా?
ఇక్కడే లాస్ అండ్ డ్యామేజ్, క్లైమేట్ లయబిలిటీ చర్చ వస్తుంది. యూఎన్‌ఎఫ్‌సీసీసీ సూత్రం.. 1992లో కుదిరిన ఒప్పందంలో సీబీడీఆర్ ( కామన్ బట్ డిఫరెన్షియేటెడ్ రెస్పాన్సిబిలిటీస్) ఉంది. అంటే ఉమ్మడి బాధ్యత ఉన్నా, ఎక్కువ కాలుష్యం చేసిన అభివృద్ధి చెందిన దేశాలకు ఎక్కువ బాధ్యత ఉంది.
లాస్ అండ్ డామేజ్ ఫండ్ కోసం 30 ఏళ్ల పోరాడగా ఆ తర్వాత 2022లో ఈజిప్టులో జరిగిన కాప్ 27లో చారిత్రాత్మక లాస్ అండ్ డామేజ్ ఫండ్ ఏర్పాటుకు అంగీకరించారు. 2023
కాప్28లో దీనికి 700 మిలియన్ డాలర్లు ప్రకటించారు. కానీ ఇది స్వచ్ఛంద సహాయం మాత్రమే. చట్టపరమైన పరిహారం కాదు.
నేపాల్‌కు పరిహారం అడిగే నైతిక హక్కు
అమెరికా, ఈయూ దేశాలు ‘లయబిలిటీ’, ‘కాంపెన్సేషన్’ అనే పదాలను ఒప్పందంలో చేర్చడానికి నిరాకరించాయి. అయితే, నేపాల్ నేరుగా అమెరికాపై ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ (ఐసీజే)లో కేసు వేయలేదు. కారణం వాతావరణ మార్పువల్లే ఈ నిర్దిష్ట విపత్తు జరిగిందని శాస్త్రీయంగా 100% నిరూపించడం కష్టం. కానీ ఇప్పుడు ‘అట్రిబ్యూషన్ సైన్స్’ బలపడుతోంది.
వనాటు దేశం ఐసీజే నుంచి అడ్వైజరీ ఒపీనియన్ తెచ్చుకుంది. 2024లో ఐసీజే వాతావరణ బాధ్యతపై విచారణ ప్రారంభించింది. నైతికంగా నేపాల్‌కు పరిహారం అడిగే పూర్తి హక్కు ఉంది. కానీ అంతర్జాతీయ చట్టంలో ఇంకా బలవంతంగా వసూలు చేసే యంత్రాంగం లేదు. లాస్ అండ్ డామేజ్ ఫండ్‌ను పెద్ద మొత్తంలో నింపడం, గ్రాంట్‌గా ఇవ్వడమే ప్రస్తుతం ఉన్న ఏకైక ఆచరణాత్మక పరిష్కారం.
- ఇరికి మహేష్ ,అడ్వకేట్
గమనిక: ఓపెన్ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్ ఐడీ [email protected]
రచయితలు ‘వెలుగు’ కు మాత్రమే పంపుతున్నామని హామీ తప్పనిసరి రాయాలి. స్వీయ రచన అయి ఉండాలి.రచన 700 పదాలకు మించరాదు.
