THE PARADISE Review: నాని ‘ది ప్యారడైజ్’ రివ్యూ.. ప్రీమియర్ షోల తర్వాత ఆడియన్స్ టాక్ ఇదే!

THE PARADISE Review: నాని ‘ది ప్యారడైజ్’ రివ్యూ.. ప్రీమియర్ షోల తర్వాత ఆడియన్స్ టాక్ ఇదే!

నాని నటించిన ‘ది ప్యారడైజ్’ థియేటర్లోకి వచ్చింది. భారీ అంచనాల మధ్య రిలీజైన మూవీ బుధవారం రాత్రి ప్రీమియర్స్ ద్వారా ఆడియన్స్ ముందుకు వచ్చింది. ఇవాళ సెప్టెంబర్ 24న సినిమా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి వచ్చింది. టీజర్, సాంగ్స్తో భారీ హైప్ క్రియేట్ చేసిన నాని–శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్ అంచనాలను అందుకుందా? జడల్‌గా నాని మాస్ మేనరిజమ్స్ ఎలా ఉన్నాయి? ప్రీమియర్స్ చూసిన ఆడియన్స్ సోషల్ మీడియాలో ఎలాంటి రివ్యూలు ఇస్తున్నారు? అనేది చూద్దాం..

ఆడియన్స్ టాక్ ఎలా ఉందంటే?

ప్రీమియర్ షోలు చూసిన ఆడియన్స్ నుంచి ‘ది ప్యారడైజ్’కు ప్రస్తుతం మిక్స్‌డ్ టాక్ వినిపిస్తోంది. నాని ఎంట్రీ, ఇంట్రో ఫైట్ ఆడియన్స్ దృష్టిని ఆకర్షించినట్లు సోషల్ మీడియాలో పోస్టులు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా.. ఇంటర్వెల్ ఎపిసోడ్ ప్రేక్షకులను మెంటల్ ఎక్కించేలా ఉందని అంటున్నారు.ఇక సెకండ్ హాఫ్‌లో తల్లి సెంటిమెంట్, నాని తాండవం, దానికి అనిరుధ్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, ‘యేశనగుల’ పాట, ఎన్టీఆర్, కేసీఆర్ రిఫరెన్సులు, క్లైమాక్స్ ఫైట్ స్పెషల్ అట్రాక్షన్స్గా నిలిచాయని ఆడియన్స్ అంటున్నారు.

మరోవైపు సినిమాకు మిక్సెడ్ టాక్ కూడా వస్తుంది. కథలో బలమైన పాయింట్ ఉన్నప్పటికీ.. దాన్ని చూపించడంలో శ్రీకాంత్ ఫెయిల్ అయ్యాడని అంటున్నారు. అలాగే, డైలాగ్స్ లో క్లారిటీ లేకపోవడం, ఓవర్ యాక్షన్ సీన్స్ ఎక్కువ అవ్వడం సినిమాకు మెయిన్ మైనస్ గా నిలిచాయని మరికొందరి రివ్యూలు చెబుతున్నాయి.

ఓవర్సీస్‌లోనూ ఇదే పరిస్థితి..

ఓవర్సీస్ ప్రీమియర్స్ తర్వాత వచ్చిన రియాక్షన్స్‌ను గమనిస్తే, అక్కడ కూడా టాక్ మిక్స్‌డ్‌గానే కనిపిస్తోంది. నాని పెర్ఫార్మెన్స్, అతడి మాస్ మూమెంట్స్, యాక్షన్ సీన్స్‌ను కొందరు ప్రేక్షకులు ప్రత్యేకంగా ప్రశంసిస్తుండగా.. కథనం, ట్రీట్‌మెంట్ విషయంలో మరికొందరు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా నాని పాత్రను దర్శకుడు శ్రీకాంత్ ఓదెల డిజైన్ చేసిన విధానం, పాత్రకు ఇచ్చిన మాస్ ఎలివేషన్స్‌పై ప్రశంసలు వస్తున్నాయి. అదే సమయంలో కొన్ని సన్నివేశాల ఎగ్జిక్యూషన్ మరింత బలంగా ఉండాల్సిందనే అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి. అయితే, ఇప్పటివరకు వచ్చినవి ప్రీమియర్ షోల తర్వాత వచ్చిన టాక్ మాత్రమే. పూర్తి స్థాయి ఆడియన్స్ టాక్ బయటకు వచ్చిన తర్వాత సినిమాపై మరింత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

‘ది ప్యారడైజ్’ కథ:

‘ది ప్యారడైజ్’ కథ 1980ల నాటి నేపథ్యానికి తీసుకెళ్తుంది. సమాజానికి దూరంగా, గుర్తింపు లేకుండా జీవిస్తున్న ఓ సమూహం.. తరతరాలుగా ఎదుర్కొంటున్న అణచివేత.. తమ ఉనికికి గుర్తింపు కోసం చేసే పోరాటం చుట్టూనే కథ తిరుగుతుంది. ప్యారడైజ్ అనే ప్రాంతంలో సవారీలు అనే సమూహం నివసిస్తుంటుంది. దేశానికి స్వాతంత్ర్యం వచ్చినా.. వారి జీవితాల్లో మాత్రం ఆ స్వేచ్ఛకు చోటుండదు. సమాజంలో తమకంటూ ఓ గుర్తింపు లేకపోవడంతో.. తమపై జరుగుతున్న అన్యాయాలను ప్రశ్నించే పరిస్థితి కూడా వారికి ఉండదు. తమ జీవితాలను తామే నిర్ణయించుకోవాలని, తమ ఉనికికి గుర్తింపు రావాలని సవారీలు పోరాటం మొదలుపెడతారు. ఈ పోరాటంలోకి అనుకోకుండా అడుగుపెట్టే వ్యక్తే జడల్.

సాధారణ వ్యక్తి నుంచి తిరుగుబాటుదారుడిగా..

జడల్ పాత్రలో నాని మొదట్లో ఓ సాధారణ వ్యక్తిగా కనిపిస్తాడు. తన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని పెద్దగా ప్రశ్నించని వ్యక్తి అతడు. కానీ పరిస్థితులు అతడిని ఒక్కో మెట్టు పైకి తీసుకెళ్తాయి. తన తల్లి గురించి, తన కుటుంబం గురించి, తన గతం గురించి ఒక్కొక్క నిజం జడల్‌కు తెలుస్తుంటుంది. ఆ నిజాలు అతడి ఆలోచనలను మార్చేస్తాయి. తనకే కాదు.. తన చుట్టూ ఉన్న మనుషులకు జరుగుతున్న అన్యాయాలను కూడా జడల్ ప్రశ్నించడం మొదలుపెడతాడు. ఇక్కడి నుంచే జడల్ ప్రయాణం మరో మలుపు తిరుగుతుంది. ఓ వ్యక్తి తన కోసం చేసే పోరాటం.. క్రమంగా ఓ సమూహం కోసం చేసే పోరాటంగా మారుతుంది.

మాలిక్ కుటుంబంతో ఢీ..

ప్యారడైజ్‌లోని ప్రజలపై ఆధిపత్యం చెలాయించే శిఖంజా మాలిక్ (మోహన్ బాబు) కుటుంబం కథలో కీలకమైన శక్తిగా నిలుస్తుంది. అధికారాన్ని అడ్డుపెట్టుకుని అక్కడి ప్రజల జీవితాలను తమ నియంత్రణలో ఉంచే ఈ కుటుంబంతో జడల్‌కు ఏర్పడే సంఘర్షణ కథకు మెయిన్ పాయింట్గా మారుతుంది. ఇది కేవలం హీరో–విలన్ మధ్య జరిగే సాధారణ పోరాటం కాదు. జడల్ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన సమస్యలు.. సవారీలు ఎదుర్కొంటున్న సామాజిక సమస్యలతో కలిసిపోతాయి. దీంతో కథ క్రమంగా పెద్ద కాన్వాస్‌లోకి వెళ్తుంది.

యాక్షన్ కంటే ఎమోషనే కీలకం..

‘ది ప్యారడైజ్’లో భారీ యాక్షన్ సన్నివేశాలు ఉన్నప్పటికీ.. కథకు అసలు బలం తల్లి–కొడుకు ఎమోషన్‌లోనే కనిపిస్తుంది. జడల్‌కు తన తల్లితో ఉన్న అనుబంధం కథలో చాలా కీలకం. ఆమె గతం గురించి అతడికి తెలిసే విషయాలు.. జడల్ జీవితాన్ని మాత్రమే కాదు, అతడి నిర్ణయాలను కూడా ప్రభావితం చేస్తాయి. దీంతో భారీ యాక్షన్ మధ్యలో తల్లి–కొడుకు బంధం కథకు భావోద్వేగాన్ని తీసుకొస్తుంది. మరోవైపు జడల్ జీవితంలోకి వచ్చే సుబ్బు (కయాదు లోహర్) పాత్ర అతడి ప్రయాణానికి మరో కోణాన్ని జోడిస్తుంది. ప్రేమ, కుటుంబం, గతం, గుర్తింపు, సమాజం కోసం పోరాటం.. ఇలా జడల్ చుట్టూ అనేక అంశాలు ఒకదానితో ఒకటి ముడిపడతాయి.

అసలు జడల్ ఎందుకు మారాడు?

సినిమా ముందుకు వెళ్లే కొద్దీ ప్రేక్షకుల్లో కొన్ని కీలక ప్రశ్నలు మొదలవుతాయి. జడల్‌ను ఇంతలా మార్చిన అసలు సంఘటన ఏంటి? అతడి తల్లి గతంలో దాగి ఉన్న నిజం ఏమిటి? సవారీల గుర్తింపు కోసం మొదలైన పోరాటం ఎక్కడికి దారితీస్తుంది? మాలిక్ కుటుంబంతో జడల్‌కు ఏర్పడిన వైరానికి ఎలాంటి ముగింపు ఉంటుంది? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలియాలంటే ‘ది ప్యారడైజ్’ను తెరపై చూడాల్సిందే.

మొత్తంగా చూస్తే.. ‘ది ప్యారడైజ్’ ఒక మాస్ యాక్షన్ కథలా కనిపించినప్పటికీ దాని లోపల సామాజిక అణచివేత, గుర్తింపు కోసం పోరాటం, కుటుంబ బంధాలు, వ్యక్తిగత తిరుగుబాటు వంటి అంశాలను ముడిపెట్టిన కథగా నిలుస్తుంది. ఇక ఈ అంశాలన్నింటినీ శ్రీకాంత్ ఓదెల ఎంత బలంగా తెరపై ఆవిష్కరించారనేది.. మరికొన్ని గంటల్లో పూర్తి టాక్ లో తెలుస్తుంది.