మార్పులను తిరస్కరిస్తే ప్రెజర్ తప్పదు..ఇరాన్ కు అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ హెచ్చరిక

మార్పులను తిరస్కరిస్తే ప్రెజర్ తప్పదు..ఇరాన్ కు అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ హెచ్చరిక

వాషింగ్టన్: అమెరికాతో మెరుగైన సంబంధాల దిశగా దీర్ఘఈకాలిక మార్పులు చేపట్టేందుకు ఇరాన్ సిద్ధంగా ఉందో లేదో అనేది తెలుసుకునేందుకు తాము వేచి వేస్తున్నామని యూఎస్ వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ తెలిపారు. ఇరాన్‌‌‌‌‌‌‌‌ దీనిని తిరస్కరిస్తే ఆ దేశంపై అమెరికా ఒత్తిడిని కొనసాగిస్తుందని ఆయన హెచ్చరించారు. 

ఫాక్స్ న్యూస్‌‌‌‌‌‌‌‌ మీడియా సంస్థతో ఆయన మాట్లాడుతూ.. ‘‘మేం వారి అణు కార్యక్రమాన్ని ధ్వంసం చేశాం. వారి సాంప్రదాయ సైనిక బలగాలను అంతం చేశాం. వారి సైనిక సామర్థ్యాలను తీవ్రంగా తగ్గించాం’’ అని చెప్పారు. 

‘‘అమెరికాతో మెరుగైన సంబంధాల కోసం అవసరమైన మార్పులు చేయడానికి ఇరాన్ సిద్ధంగా ఉందో లేదో తెలుసుకునేందుకు అమెరికా ఇప్పుడు వేచి చూస్తోంది. ఒకవేళ కుదరకపోతే, అది కూడా సరే’’ అని వాన్స్ పేర్కొన్నారు. అమెరికన్లకు ఇంధన ధరలను తగ్గించడంలో సహాయపడటానికి పశ్చిమాసియా నుంచి చమురు, గ్యాస్ సరఫరాలను పెంచడానికి కృషి చేస్తూనే, ఇరాన్ మీద ఒత్తిడిని కొనసాగిస్తుందని చెప్పారు. 

హార్మూజ్ జలసంధి గుండా సురక్షిత నౌకాయానాన్ని పునరుద్ధరించే ప్రయత్నాలలో భాగంగా వాణిజ్య నౌకలను లక్ష్యంగా చేసుకోబోమని ఇరాన్ నుంచి హామీని కోరుతున్నట్లు తెలిపారు. వాణిజ్య నౌకల రాకపోకలు సాధారణ స్థితికి రావడానికి ముందు జలసంధిలో మైన్‌‌‌‌‌‌‌‌లను తొలగించాలని, సురక్షిత మార్గాలను ఏర్పాటు చేయాలని వాన్స్ చెప్పారు. ఇందుకోసం గల్ఫ్ దేశాలు, ముఖ్యంగా ఒమన్, 
ఇరాన్ చర్చలు జరుపుతున్నాయని తెలిపారు.

అమెరికాతో ప్రత్యక్ష చర్చలు జరపట్లేదు: ఇరాన్  

ఇరాన్ ప్రస్తుతం అమెరికాతో ప్రత్యక్ష చర్చలు జరపడంలేదని, మధ్యవర్తుల ద్వారా మాత్రమే వాషింగ్టన్‌‌‌‌‌‌‌‌తో చర్చలు కొనసాగుతున్నాయని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ తెలిపారు. ఇరుపక్షాల మధ్య కుదిరిన అవగాహన ఒప్పందాన్ని అమెరికా ఉల్లంఘనల అంశాలను పరిష్కరించే వరకు చర్చలు పునఃప్రారంభం కావని ఆయన స్పష్టం చేశారు. 

ఇరాన్‌‌‌‌‌‌‌‌కు చెందిన మెహర్ వార్తా సంస్థతో ఆయన శనివారం మాట్లాడారు. చర్చల పునరుద్ధరణకు అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించడానికి మధ్యవర్తులు ప్రయత్నాలు కొనసాగిస్తున్నారని, అయినా, అమెరికా ఉల్లంఘనలను సరిదిద్దితే తప్ప చర్చలను తిరిగి ప్రారంభించే అవకాశం లేదన్నారు. 

కాగా, ఇరాన్‌‌‌‌‌‌‌‌లో ‘యుద్ధం లేదు, శాంతి లేదు’ అనే పరిస్థితి కొనసాగుతోందని ఆ దేశ అధ్యక్షుడు పెజెష్కియాన్ అన్నారు. సుదీర్ఘంగా కొనసాగుతున్న ఈ పరిస్థితికి ముగింపు పలకడం కోసం ఒప్పందానికి చేరుకోవడానికి ఇదే మంచి టైమని చెప్పారు.