తెలుగు సాహిత్యంలో చిట్టి పొట్టి కథలకు/ కథానికలకు మంచి స్థానమే ఉంది. వీటిలోనూ చమత్కారం, వ్యంగ్యం, హాస్యం, ఉత్సుకత కలగలసి చివర్లో మెరుపులాంటి ముగింపుతో నీతి/సందేశం ఉండే వాటికి ఆదరణ ఎక్కువ. ఇలాంటి చిన్న కథల రచనలో ముళ్లపూడి, భమిడిపాటి, శ్రీరమణ, మునిమాణిక్యం తదితరులు ప్రసిద్ధులు. ఈ కోవలోకి వచ్చే ఆధునిక రచయితల్లో ఆర్.సి.కృష్ణస్వామి రాజు ఒకరు. ఈయన రాసిన మినీ కథల ‘పకోడీ పొట్లం’, ‘మిక్చర్ పొట్లం’ పుస్తకాలు ఇప్పటికే పాఠకామోదం పొందాయి. తాజాగా ఆయన నుంచి వచ్చిన కథల సంకలనమే ‘గరం గరం చాయ్’. ఈ పుస్తకం 50 చిన్న కథల సమాహారం.
పేరుకు తగ్గట్టే ఈ పుస్తకంలోని కథలన్నీ గరం గరంగా ఉంటాయి. ఒక్కొక్కటీ పేజీన్నర, రెండు పేజీలే.. చాయ్ తాగినంత సేపట్లో చదివింపచేస్తాయి. ఈ పుస్తకం కేవలం హాస్య కథలకు మాత్రమే పరిమితం కాలేదు. ఇందులో ఆలోచింపచేసేవీ, సందేశాలనిచ్చేవీ, చైతన్యపరిచేవీ ఉన్నాయి. సమకాలీన అంశాల చుట్టూ తిరగడం ఈ కథల ప్రధాన బలం.
ఇరుగుపొరుగు అసూయను ‘చైనా చదువు’, విదేశాల్లో పిల్లలున్న తల్లిదండ్రుల యాతనను ‘టింగ్.. టంగ్.. ట్రంగ్’, కార్పొరేట్ దోపిడీని ‘ష్.. గప్.. చిప్’ కథలు సరదాగా, నవ్వుకునేలా చెప్తాయి. దాంపత్య జీవితం సుఖంగా సాగడానికి కావలసిన కిటుకులు చెప్పే ‘ఇష్టాయిష్టాలు’, ‘టూత్ బ్రష్’, ‘పుట్టినరోజు జేజేలు!’, ‘ఊరగాయ’ కథలదీ ఇదే తీరు.
ఇక, నేటి రాజకీయాల తీరును ‘కాకుల కొండ’, ‘శిలాఫలకం’, ‘చేను మేసిపోతే..’ వ్యంగ్యంగా వివరిస్తాయి. రైతు జీవితాన్ని, వ్యవసాయం గొప్పతనాన్ని చెప్పే ‘భూమిభక్తి’, ‘రైతే రాజు’, ‘రైతు హృదయం’, ‘రైతు కాగలడా రాజు?’ కథలు మనసును తాకుతాయి.
ఇవే కాదు, వృద్ధాశ్రమాల దుస్థితిని తెలిపే ‘ఉప్పు– బియ్యం’, అపోహలతో పెళ్లికి దూరంగా ఉంటున్న కూతురిని ఓ ఇంటిదాన్ని చేసేందుకు తల్లి పడే తపనను చెప్పే ‘గులాబీ ముళ్లు’, అడగకముందే చేసే సాయం తెచ్చే తిప్పలేంటో చెప్పే ‘స్వాతి ముత్యాలు’.. ఇలా ఒక్కటేమిటి పుస్తకంలోని అన్ని కథలూ ఆసక్తిగా చదివించేవే. మానవత్వం, దానగుణం, నిజాయితీ, మానవ సంబంధాలు, సంతృప్తి, ఆనందం వంటి అంశాల చుట్టూ తిరిగే ఈ కథలన్నీ ప్రస్తుతం సమాజంలో జరుగుతున్నవే.
పుస్తకంలోని ప్రతి కథ అర్థవంతంగా ముగుస్తుంది. భాష సులభంగా, అందరికీ అర్థమయ్యేలా ఉంది. రచయిత రాయలసీమ ప్రాంతానికి చెందిన వ్యక్తి కావడం వల్ల అక్కడి మాండలికంలోని ‘బీగాలు’ వంటి కొన్ని పదాలు కనిపిస్తాయి. కథలన్నీ చక్కని శైలితో సాగుతాయి. సందర్భోచితంగా జాతీయాలు, సామెతలు కనిపిస్తాయి.
కొన్ని ఉదాహరణలు.. ‘పైన పటారం, లోన లొటారం’, ‘దాసుడి తప్పు దండంతో సరి’,‘ఇంట్లో ఈగల మోత– బయట పల్లకీ మోత’ వంటివి. అలాగే, పాత్రలకు గ్రహీత్, వాక్య, కాగిత, జితవతి, ప్రణవ కృష్ణ, పూర్ణ తిలక వంటి పేర్లు పెట్టడం బాగుంది. ఆర్టిస్ట్ గోపాలకృష్ణ బొమ్మలు కథలకు, పుస్తకానికి అదనపు అందం తెచ్చాయి.
సామాజిక స్పృహను, సమకాలీన సమస్యలను హాస్యం, వ్యంగ్యం జోడించి స్పృశించిన ఈ కథలు చిట్టివే అయినా చాలా గట్టివి. లోకం తీరుకు, మనుషుల మనస్తత్వానికి అద్దం పడతాయి. వీటిని చదువుతుంటే మన చుట్టూ ఉండే సమాజం కళ్లకు కట్టినట్లు కనిపిస్తుంది. వీటిలోని పాత్రలు మనకు తెలిసినవాళ్లే అనిపిస్తుంది. చక్కటి, చిక్కటి చాయ్ లాంటి ఈ కథలు అందరినీ ఆకట్టుకుంటాయి. పసందైన ఈ పొట్టి కథలను ప్రతి ఒక్కరూ చదవొచ్చు.
- జి. మహేశ్వర్-
గమనిక: లైఫ్& లిటరేచర్పేజీకి వ్యాసాలు పంపాల్సిన మెయిల్ఐడీ [email protected]
