పగిలిన అరచేతుల్తో
ఎన్ని వానాకాలాలు దాటిండో
వంగిన మెడ మీద
ఎన్ని బస్తాలు మోసిండో
గడియారం ముల్లోలె తిరిగే
కాళ్ళల్ల ఎన్ని ముండ్లు గుచ్చుకున్నయో
చేన్ల పంట పండియ్యనీకి
చేతుల్ల ఎన్ని కాయలు కాసినయో
మిరుగు సొరంగనే సావుకారి గడప ముందట
పిట్టలెక్క నిలుసుండేటోడు
అప్పు నూకల కోసం..
ఎన్ని ఇత్తునాలు, ఎన్ని ఎరువు బస్తాలు
ఎంత వడ్డీ అంటు లెక్కలు
పంట మొలకెత్తక ముందే
నాయిన గుండెల్ల చింత అనే పంట పండేది..
కాడెద్దుల కాళ్ళ కంటే ముందుగాల్లే
ఆ అప్పు చేనంతా నడిసేది
కంపెనీ ట్రూత్‌ఫుల్ లేబుల్ల లెక్కలు తెల్వని నాయిన
దుకాణంల ఎంత రేటు సెప్తె
గంతకే ఇత్తునాలు కొనుక్కొచ్చి
బక్కచిక్కి బొక్కలు తేలిన కాడెద్దులతోటి
సాలు తీస్తు ఇత్తునమేస్తూ
భూమికి ఆకాశానికి నడిమిట్ల
ఒక జూదగానిలెక్క నిలబడేటోడు
సినుకు రాలకపోతె
తలెత్తి ఆకాశం వంక చూసేటోడు గాని
దేవున్ని పల్లెత్తు మాట అనేటోడు కాదు
మొలక శాతం తక్కువొస్తె
మల్లొకసారి విత్తేటోడు, మల్లొక అప్పు
కలుపు తీసే ప్రతి రోజు
వీపు వంగేది భూమి కోసం కాదు
ఆ భూమి మీద ఆధారపడ్డ
నలుగురి కడుపు కోసం
పత్తి కాయలు పగిలే దినాలల్ల
అతని వేళ్ళు గూడ పగిలేటివి
మొక్కా నాయినా ఇద్దరూ
ఒకే భూమి బిడ్డలు గదా...
రాలిన చెమట
పంట తేమ శాతాన్ని పెంచిందేమో
మార్కెట్ల
ఏడాది కష్టానికి
నిమిషంల వెల కడ్తడు దళారి
నాయిన తల వంచేటోడు
మా నాన్న కాస్తకారు
కాస్తయినా జాలిలేని
దగాకోరుల నడిమిట్ల నలిగే
రుణభారాల హలధారు
- వినయ్ కుమార్ కొట్టే
గమనిక: లైఫ్& లిటరేచర్ పేజీకి వ్యాసాలు పంపాల్సిన మెయిల్ ఐడీ
featureseditor@v6velugu.com
