చార్మినార్ చెంత నాలుగు శతాబ్దాలుగా వెలుగొందుతున్న లాడ్‌బజార్ కేవలం షాపింగ్ కేంద్రం మాత్రమే కాదు... హైదరాబాద్ సాంస్కృతిక వారసత్వానికి ప్రతీక. వేలాది కళాకారుల చేతుల్లో రూపుదిద్దుకునే లక్క గాజులు దేశ విదేశాల్లో ప్రత్యేక గుర్తింపు పొందగా, జీఐ ట్యాగ్‌తో ఈ కళకు మరింత గౌరవం దక్కింది.
తరాలు మారుతున్నా హైదరాబాద్ పురాతన సంప్రదాయ లక్క గాజులకు క్రేజ్ కొనసాగుతూనే ఉంది. కుతుబ్‌షాహీల కాలంలో లాడ్‌బజార్ ఏర్పాటైందని చరిత్రకారులు భావిస్తున్నారు. నాటి సుల్తాన్ మొహమ్మద్ కులీ కుతుబ్ షా తన కూతురి పెళ్లి నిమిత్తం బ్రైడల్ సామగ్రిని అందించడానికి పురాతన చార్మినార్ చెంత లాడ్ బజార్ ఏర్పాటు చేసి అందులో వజ్రాలు పొదిగిన లక్క గాజులు తయారు చేయించారని ప్రసిద్ధి. 400 ఏళ్లకు పైగా చరిత్ర ఉన్న లాడ్ బజార్‌ను చూడీ బజార్ అని కూడా పిలుస్తుంటారు.
లాడ్ అంటే లాక్ అని అర్థం. ఇది గాజులకు ఆకృతిని ఇవ్వడానికి, వాటిపై ప్రకాశవంతమైన రాళ్లను అతికించడానికి ఉపయోగించే జిగట పదార్థం. ఆరవ నిజాం భార్య అయిన లాడ్లీ బేగం పేరు మీద ఈ వీధికి ఆ పేరు వచ్చిందని కూడా మరికొందరి అభిప్రాయం. రాజభవనాల్లోని రాణులు, ఉన్నత వర్గాల మహిళలు తమ ఉన్నత హోదాకు చిహ్నంగా రంగురంగుల రాళ్లు పొదిగిన ఈ లక్క గాజులను ధరించేవారు.
ఈ లాడ్ బజార్ చార్మినార్, మక్కా మసీదు, చౌమహల్లా ప్యాలెస్ వంటి ఇతర చారిత్రక ప్రదేశాలకు సమీపంలో ఉంది. చార్మినార్ నుంచి మిట్టీకాషేర్ చార్ కమాన్ వరకు మొత్తం కిలోమీటరు దూరంలో వరుసగా ఉన్న రంగురంగుల గాజుల దుకాణాలు మహిళలను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. లాడ్ బజార్ ఇప్పటికీ గత కాలపు వైభవాన్ని కళ్లకు కట్టినట్లు చూపిస్తుంది. కుతుబ్ షాహీలు, నిజాంల కాలం నుంచి ఈ మార్కెట్ ఉనికిలో ఉందని, తద్వారా ఇది నగరానికి ఒక సజీవ వారసత్వ చిహ్నంగా నిలుస్తుందని చరిత్రకారులు చెప్తారు.
ఇంటింటా కుటీర పరిశ్రమగా గాజుల తయారీ
హైదరాబాద్‌లోని చార్మినార్ సమీపంలోని గల్లీలు, బస్తీల్లో లక్కగాజుల తయారీ కుటీర పరిశ్రమగా మారింది. ఇంట్లో ఉన్న పురుషులు, మహిళలు అందరూ లక్క గాజులను తయారు చేస్తుంటారు. చార్మినార్, తలాబ్ కట్ట, షాహీన్ నగర్, ఈదీబజార్, చాంద్రాయణగుట్ట, బాబానగర్, ఫలక్ నుమా, కిషన్ బాగ్, 9 నంబరు పహాడి ప్రాంతాల్లోని ఇళ్లలో లక్క గాజుల తయారీ సాగుతోంది.
లాడ్‌బజార్ వెనుక ఉండే ఇరుకైన సందుల్లో 5వేల మంది నిపుణులైన కళాకారులు ఈ లక్క గాజులను చేతితో తయారు చేస్తున్నారు. ఈ కళలో వేలాది మంది శిల్పకారులు, వారి కుటుంబాల వారీగా చిన్న వర్క్‌షాప్‌లలో పని చేస్తున్నారు.
ఎన్నెన్నో డిజైన్ల గాజులు..
లక్క గాజుల్లో 300కు పైగా రకాల డిజైన్లతో కళాకారులు రూపొందిస్తున్నారు. సంప్రదాయ లక్క గాజుల నుంచి ఆధునిక డిజైన్ల వరకు అనేక రకాల గాజులు లభిస్తున్నాయి. మగువల మనసుదోచేలా వివిధ కొత్త కొత్త డిజైన్లకు రూపకల్పన చేస్తున్నారు. ఛోటి బ్యాంగిల్స్, డబుల్ లేయర్, ప్లెయిన్ బ్యాంగిల్స్‌ను తాము ఎక్కువగా ఇష్టపడుతున్నామని హైదరాబాద్ నగరానికి చెందిన సయీదా భాను చెప్పారు.
పింక్, లావెండర్, క్రీమ్ రంగులతోపాటు మార్బుల్డ్ రకరకాల రంగుల మిశ్రమం, అల్లిన బ్రైడెడ్ డిజైన్ల గాజులు లభిస్తున్నాయి. కరిష్మా లాక్ బ్యాంగిల్స్,మురాద్ బ్యాంగిల్ స్టోర్, మినార్ బ్యాంగిల్స్, లాక్ బ్యాంగిల్స్, పరమేశ్వర బ్యాంగిల్స్, బ్యాంగిల్స్ ప్యాలెస్, కరీం గాజులు స్టోర్, ఎ1 బ్యాంగిల్స్ & జ్యువలరీ, నైస్ బ్యాంగిల్స్ కలెక్షన్స్, కేజ్ బ్యాంగిల్స్ స్టోర్, సఫా గాజులు అండ్ నగల దుకాణం, రాజధానీ బ్యాంగిల్స్, నైస్ గాజులు, బ్యూటీ కంగన్, రాజస్థానీ జైపురి లాక్ బ్యాంగిల్స్, ట్రెండ్ లాక్ బ్యాంగిల్స్ దుకాణాలు వివిధ డిజైన్ల గాజులను విక్రయిస్తున్నారు.
అందుబాటు ధరల్లోనే...
లాడ్ బజార్ లక్క గాజులు డిజైన్లు, పొదిగిన రాళ్లను బట్టి జత 99 రూపాయల నుంచి రెండువేల రూపాయల దాకా పలుకుతున్నాయి. తక్కువ ధరల నుంచి ప్రీమియం బ్రైడల్ సెట్‌ల వరకు అన్ని బడ్జెట్‌లకు సరిపోయే గాజులు లభిస్తున్నాయి. లాడ్ బజార్ లక్క గాజులు హైదరాబాద్‌కు ఒక ప్రత్యేక గుర్తింపుగా నిలిచాయి.
గాజులకు జియోగ్రాఫికల్ ఇండికేషన్ ట్యాగ్
ఎంతో ప్రసిద్ధి చెందిన లాడ్ బజార్ లక్క గాజులకు 2024వ సంవత్సరంలో అధికారికంగా జియోగ్రాఫికల్ ఇండికేషన్ ట్యాగ్ లభించింది.హైదరాబాద్ లక్క గాజుల కోసం జీఐ దరఖాస్తును క్రెసెంట్ హ్యాండీక్రాఫ్ట్స్ ఆర్టిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ దాఖలు చేసింది.
తెలంగాణ ప్రభుత్వ పరిశ్రమలు, వాణిజ్య శాఖ సహకారంతో గాజులకు జీఐ ట్యాగ్ దక్కింది. ఈ గుర్తింపు సాధనలో స్థానిక హస్తకళా సంఘాలు, తయారీదారులు, అసోసియేషన్ ప్రతినిధులు కీలక పాత్ర పోషించారు.
అంతర్జాతీయంగా ప్రాచుర్యం పొందిన లక్క గాజుల నాణ్యతను, ప్రత్యేకతను కాపాడటానికి ఈ జియోగ్రాఫికల్ ఇండికేషన్ దోహదపడింది. దీంతో ఈ కళకు ప్రత్యేక గుర్తింపు లభించడంతోపాటు నకిలీ ఉత్పత్తుల నుంచి రక్షణ కూడా పెరిగింది.
ఎంబ్రాయిడరీ వస్త్రాలు, చీరలు
లాడ్ బజార్‌లో రంగురంగుల గాజులే కాకుండా జరీ, ఎంబ్రాయిడరీ పనులు చేసిన వస్త్రాలు, చీరలు, ఇతర సంప్రదాయ దుస్తులు, సెమీ-ప్రెషియస్ రాళ్లు, విలువైన రత్నాలు కూడా లభిస్తాయి. ఇక్కడ ముత్యాలు కూడా ఎంతో ప్రసిద్ధి చెందాయి.
ప్రజలు కేవలం గాజుల కోసమే ఇక్కడికి రారు. ఎన్నో ఏళ్ల చరిత్ర కలిగిన ఈ మార్కెట్ ఒక నిరంతర జాతరలా ఉంటుంది. నోరూరించే ఆహార పదార్థాల నుంచి ఆభరణాల దుకాణాల వరకు, పెళ్లి దుస్తుల నుంచి మెరిసే స్కర్టులు, బ్యాగుల వరకు, హైదరాబాదీ ముత్యాల నుంచి ఫ్యాషన్ జ్యువెలరీ వరకు... దాదాపు ప్రతి వస్తువు ఇక్కడ దొరుకుతుంది.
విదేశాల్లోనూ డిమాండ్
లక్క గాజులకు దేశీయ మార్కెట్‌తోపాటు అమెరికా, యూకే, యూఏఈ, సింగపూర్ వంటి దేశాల్లో కూడా డిమాండ్ ఏర్పడింది. ఈ పరిశ్రమ హైదరాబాద్ సాంస్కృతిక వారసత్వానికి ప్రతీకగా నిలుస్తూ, వేలాది కుటుంబాలకు ఉపాధిని అందిస్తోంది. ముఖ్యంగా పెళ్లిళ్లు, రమజాన్, బక్రీద్, బోనాలు, బతుకమ్మ వంటి పండుగల సమయంలో లక్క గాజుల అమ్మకాలు గణనీయంగా పెరుగుతున్నాయని లాడ్ బజార్ మురాద్ బ్యాంగిల్స్ కళాకారుడు నూర్ ముహమ్మద్ చెప్పారు.
చార్మినార్, చౌమహల్లా ప్యాలెస్ మధ్య ఉన్న లాడ్ బజార్ ప్రాచుర్యం పొందింది. ఈ బజార్‌కు ప్రతిరోజూ 500-, 600 మంది విదేశీ పర్యాటకులు వస్తుంటారు. ఇది దేశీయ, అంతర్జాతీయ పర్యాటకులకు ఒక ప్రముఖ పర్యాటక కేంద్రం. 2025 మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొన్న అందాల భామలు చార్మినార్ నుంచి లాడ్ బజార్‌లో హెరిటేజ్ వాక్ చేశారు. ప్రపంచ అందాల భామలు లాడ్ బజార్‌లో షాపింగ్ కూడా చేయడంతో ఈ బజార్‌కు ప్రపంచవ్యాప్త గుర్తింపు లభించింది.
నాటి పూర్వవైభవం నేడేది?
నిజాం నాటి లాడ్ బజార్ పూర్వ వైభవాన్ని పునరుద్ధరించడానికి కులీ కుతుబ్ షా పట్టణ అభివృద్ధి అథారిటీ ప్రతిపాదనలు అమలు చేయలేదు. గాజుల దుకాణాల ముఖభాగాన్ని ఏకరూపత ఉండేలా నిర్ణయించినా అవి కాగితాలకే పరిమితం అయ్యాయి. లక్కగాజుల కళాకారులకు చార్మినార్ చెంత కామన్ ఫెసిలిటీ సెంటర్‌ను ఏర్పాటు చేయాలని లాడ్ బజార్ లక్క గాజుల అసోసియేషన్ అయిన క్రిసెంట్ హస్తకళల ఆర్టిసన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కోరుతున్నట్లు అసోసియేషన్ అధ్యక్షుడు మహమ్మద్ హుసాముద్దీన్ చెప్పారు.
లక్క గాజులు తయారు చేస్తున్న కళాకారులకు సబ్సిడీ రుణాలు ఇప్పించాలని, విదేశాలకు గాజుల ఎగుమతి సౌకర్యం కల్పించాలని, హెల్త్ కార్డులు జారీ చేయాలని తాము కోరినా ఇప్పటివరకు ఫలితం రాలేదు. ఈ పురాతన కళ అంతరించిపోకుండా కాపాడేందుకు వీలుగా హస్తకళల సంస్థ, రాష్ట్ర ప్రభుత్వం యువతీ, యువకులకు శిక్షణ ఇప్పించాలని ఆయన కోరారు.
జీఐ ట్యాగ్‌తో ఈ కళకు ప్రపంచ గుర్తింపు లభించినా, వేలాది కళాకారుల జీవనోపాధికి మరింత ప్రోత్సాహం అవసరం. ప్రభుత్వం, హస్తకళల సంస్థలు చేయూతనిస్తే లాడ్‌బజార్ లక్క గాజుల వైభవం మరిన్ని తరాలకు సజీవ వారసత్వంగా నిలుస్తుంది.
లక్క గాజుల తయారీ ఇలా...
ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్ నగర్ నుంచి ఏజెంట్ల ద్వారా లక్కను కొనుగోలు చేస్తుంటారు. సహజ లక్క (రెసిన్)ను వేడి చేసి మెత్తగా చేస్తారు. అవసరమైన రంగులను కలిపి మృదువైన మిశ్రమంగా తయారు చేస్తారు. గాజు ఆకారం ఇవ్వడానికి లోహం లేదా చెక్కతో చేసిన అచ్చుపై వేడి చేసిన లక్కను చుట్టి, గాజు ఆకారంలో రూపొందిస్తారు.
ప్రత్యేక కొలతల అచ్చుల సాయంతో గాజుల పరిమాణాన్ని సరిచేసి, అంచులను మృదువుగా చేస్తారు. ఆ తర్వాత గాజులపై రంగురంగుల రాళ్లు, అద్దాలు, ముత్యాలు, కుందన్, జిర్కాన్ వంటి అలంకరణ వస్తువులను చేతితో అమరుస్తారు. తయారైన గాజులను చల్లబరచి గట్టిపడేలా చేస్తారు. చివరగా ప్రతి గాజును పరిశీలించి, జతలుగా అమర్చి విక్రయానికి సిద్ధం చేస్తారు. లాడ్ బజార్‌లో ఈ ప్రక్రియలో చాలా భాగం ఇప్పటికీ చేతిపనితోనే చేస్తున్నారు. అందువల్ల ప్రతి లక్క గాజులో ప్రత్యేకమైన అందం, నైపుణ్యం కనిపిస్తుంది.
సందడిగా లాడ్ బజార్
హైదరాబాద్‌లోని లాడ్ బజార్ ఎప్పుడూ సందడిగా ఉంటుంది. ఉదయం11 గంటల నుంచి రాత్రి 11 గంటల దాకా12 గంటల పాటు ఈ బజార్ కళకళలాడుతుంటుంది. రమజాన్, బక్రీద్, బతుకమ్మ, బోనాలు, పెళ్లిళ్ల సీజన్‌లలో లాడ్ బజార్ మరింత కళకళలాడుతుంది.
సాయంత్రం వేళల్లో రంగురంగుల విద్యుత్ దీపాల వెలుగులతో అలంకరించిన దుకాణాలు, వ్యాపారుల పిలుపులు, కొనుగోలుదారుల సందడి, చేతితో తయారైన లక్క గాజుల మెరుపులు ఈ ప్రాంతానికి ప్రత్యేకమైన అందాన్ని తీసుకువస్తాయి. ఈ కారణంగానే లాడ్ బజార్‌ను హైదరాబాద్ సాంస్కృతిక వారసత్వానికి ప్రతీకగా భావిస్తారు.
హైదరాబాద్ లక్క గాజుల తయారీ పరిశ్రమ తెలంగాణ సంప్రదాయ హస్తకళల్లో ఒక ముఖ్యమైన పరిశ్రమ. ముఖ్యంగా పాతబస్తీలోని లాడ్ బజార్ లక్క గాజుల పరిశ్రమకు ప్రధాన కేంద్రంగా మారింది. ఈ దుకాణాల్లో గాజులే కాకుండా పెళ్లి సామాగ్రిని సైతం విక్రయిస్తున్నారు. దేశ, విదేశాల నుంచి వచ్చే పర్యాటకులు, పెళ్లి షాపింగ్‌కు వచ్చే కుటుంబాలు, మహిళలు ఈ గాజులను ఆసక్తిగా చూసి కొనుగోలు చేస్తుంటారు.
గమనిక: లైఫ్& లిటరేచర్ పేజీకి వ్యాసాలు పంపాల్సిన మెయిల్ ఐడీ featureseditor@v6velugu.com
