కరీంనగర్, వెలుగు : బీఆర్ ఎస్ కార్యకర్త, అతడి తమ్ముడిపై బీజేపీ కార్పొరేటర్ అనుచరులు దాడి చేశారు. ఈ ఘటన కరీంనగర్ పట్టణంలోని కిసాన్ నగర్ లో ఆదివారం రాత్రి జరిగింది. వివరాల్లోకి వెళ్తే... కిసాన్ నగర్ కు చెందిన బీఆర్ఎస్ కార్యకర్త గుగులోత్ శ్రీకాంత్, అతడి తమ్ముడు శేఖర్ ఆదివారం రాత్రి స్థానిక ఓపెన్ జిమ్ వద్ద ఉన్నారు.
ఇదే సమయంలో 29వ డివిజన్ బీజేపీ కార్పొరేటర్ సోమిడి వేణుప్రసాద్ అనుచరులు కుడిది నాగేందర్, పంతంగి మధు, నేరెళ్ల నాగరాజు, శ్రీరామోజు భానుచందర్, సంగం వేణు, పంతంగి శశిధర్ బీర్లు తాగుతూ వచ్చి.. శ్రీకాంత్, అతడి సోదరుడిపై దాడి చేసి పరార్ అయ్యారు. శ్రీకాంత్ పొట్ట భాగంలో బీరు సీసాతో పొడవడంతో తీవ్రంగా గాయపడ్డాడు.
గమనించిన స్థానికులు ఇద్దరినీ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న కరీంనగర్ టౌన్ ఏసీపీ వెంకటస్వామి, టూటౌన్ సీఐ సృజన్ రెడ్డి వచ్చి బాధితుడితో మాట్లాడారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు కార్పొరేటర్ వేణుప్రసాద్ తో మిగతా ఆరుగురిని అదుపులోకి తీసుకొని రిమాండ్ కు తరలించారు.
విషయం తెలుసుకున్న కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ సోమవారం హాస్పిటల్ లో శ్రీకాంత్‌ను పరామర్శించారు. కరీంనగర్ ప్రజలు బీజేపీకి మేయర్ పదవి కట్టబెడితే.. వారు నగరంలో దాడుల సంస్కృతికి తెరలేపారని మండిపడ్డారు. బీజేపీలో ఏం జరుగుతుందో కేంద్ర మంత్రి బండి సంజయ్‌కి అర్థం అవుతుందా ? అని ప్రశ్నించారు. కేంద్ర మంత్రి స్పందించి, దాడికి పాల్పడిన వారిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.
