కస్టమర్ సర్వీస్ కాల్స్‎కు ‘1601’ నంబర్ సిరీస్

కస్టమర్ సర్వీస్ కాల్స్‎కు ‘1601’ నంబర్ సిరీస్

న్యూఢిల్లీ: బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్ అండ్ ఇన్సూరెన్స్‌‌‌‌‌‌‌‌(బీఎఫ్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ఐ) కోసం,  ప్రభుత్వ సమాచారం కోసం ఇప్పటికే 1600 సిరీస్  పనిచేస్తుండగా,  మిగిలిన సంస్థలు చేసే సర్వీస్, ట్రాన్సాక్షన్  కాల్స్ కోసం ప్రత్యేకంగా '1601' నంబర్ సిరీస్‌‌‌‌‌‌‌‌ను టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్‌‌‌‌‌‌‌‌) తీసుకొచ్చింది. 

సాధారణ 10 అంకెల నంబర్లతో వ్యాపార సంస్థల పేరిట జరుగుతున్న మోసాలను, సైబర్ నేరాలను అరికట్టడానికి  ఈ నిర్ణయం తీసుకుంది. మొదటి దశలో కరెంట్‌‌‌‌, గ్యాస్, వాటర్ సప్లయ్‌‌‌‌ వంటి యుటిలిటీస్ రంగాలతో పాటు కొరియర్, డెలివరీ, లాజిస్టిక్స్ సంస్థలు ఈ కొత్త విధానాన్ని  పాటించాల్సి ఉంటుంది.  '1601' సిరీస్ నంబర్లను కేవలం సర్వీస్,  ట్రాన్సాక్షనల్ సమాచారం కోసమే వాడాలి.  

ఎలాంటి ప్రచార/ప్రమోషనల్ కాల్స్ చేయడానికి వీల్లేదు.   ఆర్థికపరమైన అత్యవసర కాల్స్ ఇతర సాధారణ సర్వీస్ కాల్స్‌‌‌‌‌‌‌‌తో కలవకుండా ఉండేందుకే కొత్తగా '1601' సిరీస్‌‌‌‌‌‌‌‌ను తెచ్చారు. టెలికాం ఆపరేటర్లు అర్హత కలిగిన సంస్థలను 90 రోజుల్లోగా ఈ కొత్త 1601 సిరీస్‌‌‌‌‌‌‌‌కి మార్చే ప్రక్రియను పూర్తి చేయాలని ట్రాయ్ స్పష్టం చేసింది. ఈ విధానం ద్వారా కస్టమర్లు సైబర్ మోసగాళ్ల బారిన పడకుండా జాగ్రత్తపడడానికి వీలుంటుంది.