- ఈ నెల 15 వరకు అప్లికేషన్ల స్వీకరణ
- వరుస సెలవుల నేపథ్యంలో మరో ఐదు రోజులు అవకాశం
- హౌసింగ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
హైదరాబాద్, వెలుగు: క్యూర్ పరిధిలోని ఎల్‌ఐజీ టవర్స్‌కు అప్లై చేసుకునేందుకు గడువును ఈనెల 15 వరకు పొడిగిస్తున్నట్టు హౌసింగ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు. బోనాల నేపథ్యంలో వరుసగా మూడు రోజులు సెలవులు రావటంతో, ప్రజలంతా బోనాల వేడుకల్లో ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు సోమవారం పత్రిక ప్రకటనలో తెలిపారు. అప్లై చేసుకునేందుకు ఎక్కువ మందికి గడువు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. 16 నియోజకవర్గాల్లో ఒక్కోదానికి 480 చొప్పున 7,340 ఫ్లాట్లు నిర్మిస్తుండగా మొత్తం 46,121 అప్లికేషన్లు వచ్చాయని మంత్రి ప్రకటించారు. సోమవారం చివరి రోజు అని ప్రకటించటంతో ఒక్క రోజే 9 వేల మంది అప్లై చేసుకోవడం గమనార్హం.
అత్యధికంగా కూకుట్‌పల్లి నియోజకవర్గం నుంచి 6,615 అప్లికేషన్లు రాగా మహేశ్వరం నియోజకవర్గం నుంచి 734 అప్లికేషన్లు మాత్రమే వచ్చాయి. గత నెల 21 నుంచి మీ సేవా కేంద్రాల ద్వారా అప్లికేషన్లు తీసుకున్నారు. దరఖాస్తుల స్వీకరణ గడువును పెంచినప్పటికీ, దరఖాస్తుల పరిశీలన, అర్హత నిర్ధారణ, కేటాయింపు, లాటరీ తదితర ప్రక్రియల్లో ఎలాంటి జాప్యం జరగకుండా చర్యలు తీసుకోవాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ఈ నెలాఖరు నాటికి ఇండ్ల కేటాయింపు ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించారు. ఇండ్ల కేటాయింపు ప్రక్రియపై దరఖాస్తుదారులు ఎటువంటి అపోహలు, అనుమానాలకు గురికావాల్సిన అవసరం లేదని మంత్రి పొంగులేటి తెలిపారు. అర్హత ప్రమాణాలకు అనుగుణంగా, పూర్తి పారదర్శకతతో, నిష్పక్షపాతంగా ఇండ్ల కేటాయింపు ప్రక్రియను నిర్వహిస్తామని స్పష్టం చేశారు.
