గండిపేట, వెలుగు: ఇళ్ల కింద గుప్త నిధులు ఉన్నాయని అమాయకులను నమ్మించి భారీగా డబ్బులు వసూలు చేస్తున్న ముఠా గుట్టును శంషాబాద్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు, రాజేంద్రనగర్ పోలీసులు రట్టు చేశారు. ఈ కేసులో ఓల్డ్ సిటీకి చెందిన మహ్మద్ మునావర్ అలియాస్ మున్నా(36), సయ్యద్ అలీ అష్రఫ్(40), మహ్మద్ హాజీ(25), మహ్మద్ సల్మాన్(29)ను అరెస్ట్ చేశారు.
మునావర్ తనకు గుప్త నిధులు వెలికితీసే ప్రత్యేక విద్య ఉందని ప్రచారం చేసుకునేవాడు. అనంతరం మిగతా నిందితులతో కలిసి అమాయకులను సంప్రదించి వారి ఇళ్ల కింద గుప్త నిధులు ఉన్నాయని నమ్మించేశారు. బాధితులు నమ్మిన తర్వాత వారు సూచించిన ప్రాంతంలో గుంత తీయించి, ముందుగానే సిద్ధం చేసుకున్న బొగ్గు, నకిలీ బంగారు నాణేలు ఉన్న సంచిని అందులో రహస్యంగా పెట్టేవారు.
అనంతరం పూజలు చేసి.. బొగ్గు బంగారంగా మారడానికి కొంత సమయం పడుతుందని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయేవారు. ఈ విధంగా బాధితుల నుంచి భారీగా డబ్బులు వసూలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఈ ముఠా వివిధ ప్రాంతాల్లో సుమారు 11 మందిని మోసం చేసి రూ.కోటి వరకు వసూలు చేసినట్లు దర్యాప్తులో తేలింది. నిందితుల నుంచి 25 నకిలీ బంగారు పూత నాణేలు, 6 కిలోల బొగ్గు, 4 కిలోల మట్టి, పూజా సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. ఘటనపై రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
