ఓపెన్ పేజి: తెలంగాణ చూపిన బాటలోనే దేశం..నాడు వద్దన్న విధానమే... నేడు దేశానికి ఆదర్శం

ఓపెన్ పేజి:  తెలంగాణ చూపిన బాటలోనే దేశం..నాడు వద్దన్న విధానమే...  నేడు దేశానికి ఆదర్శం

ఒక కొత్త  ఆలోచన పుట్టినప్పుడు వ్యతిరేకత సహజం. కానీ ఆ ఆలోచన నిజాయితీతో కూడినదైతే.. కాలమే దానికి సమాధానం చెబుతుంది.  తెలంగాణలో  మేం తీసుకొచ్చిన మొబైల్ ఫెర్టిలైజర్ బుకింగ్ విధానం విషయంలో సరిగ్గా  అదే జరిగింది.  రైతుకు కావాల్సింది ఒక్కటే..  అవసరమైన  సమయంలో,  అవసరమైన ఎరువు అందుబాటులో ఉండటం.

యూరియా కోసం గంటల తరబడి క్యూలలో నిలబడటం,  ఏ దుకాణంలో స్టాకు ఉందో తెలియక తిరగడం,  కొందరు అక్రమంగా కొనుగోలు చేసి నిజమైన  రైతుకు ఎరువు దొరకని పరిస్థితి తీసుకురావడం.. ఇవన్నీ ఏళ్ల తరబడి రైతును వేధించిన సమస్యలు.   

అన్నింటికంటే మించి ప్రభుత్వం భారీ సబ్సిడీతో ఇస్తున్న ఎరువు పక్కదారి పట్టకుండా,  నిజంగా  సాగుభూమిలో  చెమటోడ్చే  రైతుకే  చేరాలన్నదే  మా లక్ష్యం.  ఆ లక్ష్యంతోనే  మొబైల్  ఫెర్టిలైజర్ బుకింగ్ యాప్‌‌ను తీసుకొచ్చాం.  ఇది రైతుపై ఆంక్ష కాదు.  రైతుకు ఇచ్చిన భరోసా.

గతంలో ఎరువుల పంపిణీ  ఆధార్ కార్డు మీదే ఆధారపడి ఉండేది.  ఆధార్ ఉన్న వ్యక్తి  వాస్తవంగా  ఎంత భూమి సాగు చేస్తున్నాడో,  ఏ పంట వేశాడో,  ఆ పంటకు  నిజంగా  ఎంత ఎరువు కావాలో వీటికీ  కొనుగోలుకూ ఎలాంటి సంబంధం ఉండేది కాదు.  ఫలితంగా  అవసరానికి మించి కొనుగోలు,  కొన్నిచోట్ల  సబ్సిడీ ఎరువు  వ్యవసాయేతర  అవసరాలకు మళ్లిపోవడం జరిగేది.  మేం ఈ విధానాన్ని  సమూలంగా మార్చాం.  ఇకపై ఆధార్ ఒక్కటే ప్రాతిపదిక కాదు. 

 వాస్తవంగా  సాగవుతున్న  భూమే ప్రాతిపదిక.  సొంత భూమైనా,  కౌలు భూమైనా తేడా లేదు.  నిజంగా పంటవేసిన  ప్రతి రైతుకూ,  పంట స్వభావం,  సాగు విస్తీర్ణం, వ్యవసాయ విశ్వవిద్యాలయం సూచించిన శాస్త్రీయ ప్రమాణాల  ఆధారంగా ఎరువు లభించేలా  వ్యవస్థను రూపొందించాం.  దీని ఫలితం రెండువైపులా కనిపించింది.  నిజమైన  రైతుకు  ఎరువు  దొరుకుతుందన్న భరోసా పెరిగింది,  సబ్సిడీ  ఎరువుల  దుర్వినియోగం, అక్రమ నిల్వలు,  మళ్లింపుపై  కళ్లెం పడింది.

సినిమా టికెట్ బుక్ చేసినంత సులభంగా ఆలోచన సరళమైనది. సినిమా టికెట్‌‌ను ఇంటి నుంచే  బుక్  చేసుకున్నట్టుగా,  రైతు తనకు కావాల్సిన యూరియాను  మొబైల్‌‌లోనే  బుక్ చేసుకుని,  స్టాక్ ఎక్కడుందో చూసి,  నిర్ధారించుకుని డీలర్ వద్దకు వెళ్లే వెసులుబాటు కల్పించాం. 

 క్యూలు లేవు.  అనిశ్చితి లేదు. ఒక దుకాణం నుంచి మరో దుకాణానికి తిరిగే శ్రమ లేదు.  కాగా,  కొత్త వ్యవస్థ కావడంతో  మొదట్లో సాంకేతిక ఇబ్బందులు ఎదురయ్యాయి.  రైతులు, డీలర్లు అలవాటుపడటానికి కొంత సమయం పట్టింది.  ఇదే అదనుగా రాజకీయ దాడి మొదలైంది.

  బీఆర్ఎస్ నాయకులు ఈ యాప్‌‌ను  ‘బంగాళాఖాతంలో పడేస్తాం’ అని  బహిరంగంగా  ప్రకటించారు.  కొందరు బీజేపీ నాయకులు కూడా గొంతు కలిపారు. కానీ మేం రాజకీయ విమర్శలను కాదు,  రైతు ప్రయోజనాన్ని చూశాం.  నేను స్వయంగా  ఒక రైతును.  అందువల్ల  పంట సమయంలో ఎరువు దొరకని ఆందోళన  నాకు  తెలుసు,  సబ్సిడీ  ఎరువు నిజమైన రైతుకు చేరకపోతే జరిగే అన్యాయమూ తెలుసు.  అందుకే  మొదట్లో ఎదురైన సమస్యలు మమ్మల్ని ఆపలేకపోయాయి.

తెలంగాణ ప్రయోగం.. ఇవాళ దేశానికి దిక్సూచి

ఈరోజు మాకు గర్వకారణమైన విషయం ఒక్కటే.  తెలంగాణలో పుట్టిన ఈ ఆలోచనను కేంద్ర ప్రభుత్వం స్వీకరించి దేశవ్యాప్తంగా అమలు చేస్తోంది.  తెలంగాణ యూరియాతో  ప్రారంభించిన డిజిటల్ బుకింగ్ విధానాన్ని విస్తరించి,  కేంద్రం  ఎఫ్ఎఫ్ఎస్   పేరుతో  అన్ని  ఎరువులకూ  దేశమంతటా  దశలవారీగా  అమలు చేయనుండటం,  తెలంగాణ  సంస్కరణకు దక్కిన అత్యున్నత గుర్తింపు.  నాడు ‘సాధ్యమా’ అని  ప్రశ్నించిన విధానం,  నేడు దేశానికే  మార్గదర్శిగా నిలిచింది.  

తెలంగాణ చూపిన బాటలోనే దేశం.. ఇది  నినాదం కాదు.   ఫలితాలతో  నిరూపితమైన వాస్తవం.  ఈ విజయంలో అందరి భాగస్వామ్యం ఉంది.   ఏ సంస్కరణ కేవలం  ప్రభుత్వ  ఉత్తర్వుతో  మాత్రమే  విజయవంతం కాదు.  ప్రజలు దాన్ని  స్వీకరించినప్పుడే  అది  నిలబడుతుంది.  మొదట్లో  ఎదురైన  ఇబ్బందులను ఓపికగా భరించి ఈ విధానాన్ని  అక్కున చేర్చుకున్న  తెలంగాణ  రైతులకు నా హృదయపూర్వక అభినందనలు.  

కొత్త వ్యవస్థకు  అనుగుణంగా మారిన  ఎరువుల  డీలర్లకూ  నా కృతజ్ఞతలు.  ఈ  ఆలోచనను క్షేత్రస్థాయిలో విజయవంతం చేయడంలో  వ్యవసాయశాఖ కార్యదర్శి,  డైరెక్టర్‌‌తోపాటు  రాష్ట్ర స్థాయి నుంచి గ్రామస్థాయి వరకు అధికారులు,  సిబ్బంది చేసిన కృషి  మరువలేనిది.  సమస్యలు వచ్చిన ప్రతిసారి వాటిని గుర్తించి,  పరిష్కరించి,  వ్యవస్థను మెరుగుపరిచిన వారందరినీ  ప్రత్యేకంగా అభినందిస్తున్నాను.

విమర్శలకు సమాధానం.. ఫలితాలు

తెలంగాణ  రైతన్నల  మేలు కోసం  చేసిన  సంస్కరణలను  రాజకీయ కళ్లద్దాలతో  చూడకూడదు.  తెలంగాణలో  ఈ యాప్‌‌ను  ‘బంగాళాఖాతంలో  పడేస్తాం’ అని విమర్శించినవారు.. ఇప్పుడు  అదే విధానాన్ని కేంద్రం  దేశమంతటా  అమలు చేస్తుంటే  ఏం  సమాధానం  చెబుతారు?  

 తెలంగాణలో  ఈ  విధానాన్ని  వ్యతిరేకించిన  బీజేపీ  నాయకులు,  ఇప్పుడు  తమ కేంద్ర  ప్రభుత్వ  నిర్ణయాన్ని స్వాగతిస్తారని  భావిస్తున్నాను.  అదేస్థాయి  నిజాయితీతో  తెలంగాణ  చేసిన  ప్రయోగం  సరైనదేనని అంగీకరించే  హుందాతనం  కూడా  చూపగలరని  ఆశిస్తున్నాను.  

ఎందుకంటే  రైతు  ప్రయోజనం దగ్గర  రాజకీయాలకు  చోటు ఉండకూడదు.  సాంకేతికత  రైతుకు అడ్డంకి కాకూడదు.  అది రైతు సమయాన్ని కాపాడాలి.  అవసరమైన  ఎరువు  అందుతుందన్న  భరోసా ఇవ్వాలి.  ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ  నిజమైన  సాగుదారుడికి  చేరేలా చూడాలి.  

ప్రతి బస్తా ఎరువు,  సరైన  రైతుకు,  సరైన సమయంలో,  సరైన పరిమాణంలో చేరాలనేది మా లక్ష్యం.  నాడు  విమర్శించినా  మేం వెనక్కి తగ్గలేదు.   రైతులు  మా  ప్రభుత్వాన్ని నమ్మారు.  ఫలితాలు నిరూపించాయి.   నేడు  దేశమే  అనుసరిస్తోంది.  తెలంగాణ ఆలోచించింది.. దేశం ఆచరిస్తోందని నిరూపితమైంది.

- తుమ్మల నాగేశ్వరరావు, వ్యవసాయశాఖ మంత్రి

గమనిక: ఓపెన్​ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్​ ఐడీ openpage@v6velugu.com రచయితలు ‘వెలుగు’ కు మాత్రమే పంపుతున్నామని హామీ తప్పనిసరి రాయాలి. స్వీయ రచన అయి ఉండాలి.రచన 700 పదాలకు మించరాదు.