చారిత్రాత్మక లాల్ దర్వాజ్ సింహవాహిని మహాంకాళి అమ్మవారి బోనాల వేడుకల్లో భాగంగా అత్యంత ఉత్కంఠభరితంగా నిర్వహించే రంగం కార్యక్రమం కన్నులపండువగా ముగిసింది. భవిష్యవాణిని వినిపించిన మాతంగి అనురాధ అమ్మవారి వాక్కులను భక్తులకు తెలియజేశారు.
భక్తులు చేసిన పూజలపట్ల తాను సంతోషంగా ఉన్నానని మాతంగి అనురాధ తెలిపారు. అయితే, కాలం మారుతోందని, కలికాలం కావడంతో అనుకోని సంఘటనలు జరుగుతున్నాయని, పసిపిల్లలపై ఘోరాలు పెరిగిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. పాపాలు ఎక్కువైనప్పటికీ, భక్తితో ఉన్నవారికి ఎప్పుడూ ముక్తిని ప్రసాదిస్తానని, అందరినీ ఆదుకుంటున్నానని అభయమిచ్చారు.
ప్రజలు చేసే పూజల వల్లే దేశం సుభిక్షంగా ఉందని, గ్రామగ్రామాన తాను కొలువుదీరి ఉన్నానని తెలిపారు. పసుపు కుంకుమలతో తనను ఆరాధించే వారిని కంటికి రెప్పలా కాపాడుతూ కోరికలు నెరవేరుస్తానని చెప్పారు. తనకు శాక పూజలు చేయాలని, ఐదు వారాల పాటు నిష్టగా పూజలు నిర్వహించాలని సూచించారు.
ముందుండి నడిపించే వారికి భక్తి, ముక్తి, శక్తిని ప్రసాదిస్తానని, నా ఆశీర్వాదం ఎప్పటికీ అందరికీ ఉంటుందని మాతంగి అనురాధ చెప్పారు. చెడు చేసిన వారిని శిక్షించి తీరుతామని హెచ్చరించిన అమ్మవారు, ప్రభుత్వాలకు కూడా ఎప్పుడూ తన ఆశీర్వాదం ఉంటుందన్నారు.
