- వరంగల్ సిటీ మహిళలకు అందుబాటులో ట్రైనింగ్, ఎంప్లాయ్మెంట్
- వరంగల్ సిటీకి క్యూ కడుతున్న కార్పొరేట్ సంస్థలు
- ఇప్పటికే వెయ్యి మందికి పైగా ఉద్యోగాలు
- కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కులో ప్రయారిటీ
వరంగల్, వెలుగు: ఓరుగల్లులోని నిరుద్యోగ యువత, మహిళలకు ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు మెరుగుపర్చేందుకు తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. యూత్ సర్వీసెస్ డిపార్టుమెంట్ ఆధ్వర్యంలో స్టెప్(సొసైటీ ఫర్ ట్రైనింగ్ అండ్ ఎంప్లాయిమెంట్ ప్రమోషన్) కార్యక్రమంలో భాగంగా స్కిల్ డెవలప్‍మెంట్ ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటు చేశారు.
ఇప్పటికే ఇందులో వెయ్యి మందికి పైగా మహిళలు వివిధ కోర్సుల్లో శిక్షణ తీసుకొని సంస్థ అందించిన సర్టిఫికెట్ ద్వారా పలు కంపెనీలు, సంస్థల్లో ఉద్యోగాలు పొందారు. మరికొందరు సొంతంగా వ్యాపారరంగంలోకి అడుగుపెట్టారు.
స్టెప్ అందించే ట్రైనింగ్‍లో టైలరింగ్ ద్వారా మహిళలు కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ వంటి కార్పొరేట్ సంస్థల్లో ఉద్యోగాలు సంపాదించగా.. ఫ్యాషన్ డిజైనింగ్, బ్యూటిషియన్ వంటి కోర్సులతో యువతులు రాణిస్తున్నారు.
గృహిణుల నుంచి బీటెక్, పీజీ స్టూడెంట్ల వరకు..
రాష్ట్ర ప్రభుత్వం ఓరుగల్లులోని నిరుద్యోగ మహిళలకు హనుమకొండ కాకతీయ డిగ్రీ కాలేజీ ఎదురుగా నిర్వహిస్తున్న స్కిల్ డెవలప్‍మెంట్ సెంటర్ అండగా నిలుస్తోంది. ఈ సెంటర్లో టైలరింగ్, ఫుడ్ ప్రాసెసింగ్, బ్యూటిషియన్, ఫ్యాషన్ డిజైనింగ్, కంప్యూటర్ కోర్సులు అందిస్తున్నారు. కోర్సుల ఆధారంగా ఒక్కో బ్యాచ్‍లో 50 నుంచి 100 మందికి సీనియర్ ట్రైనర్లతో శిక్షణ ఇస్తున్నారు.
3 నెలల శిక్షణ అనంతరం ఎగ్జామ్ నిర్వహించి సర్టిఫికెట్లు అందిస్తున్నారు. కార్పొరేట్ సంస్థలకు ఇక్కడ శిక్షణ పూర్తి చేసుకున్న వారి వివరాలు పంపిస్తున్నారు. దీంతో టైలరింగ్, ఫుడ్ ప్రాసెసింగ్, ఫ్యాషన్ డిజైనింగ్, బ్యూటిషియన్, కంప్యూటర్ కోర్సుల్లో గృహిణులతో పాటు బీటెక్, డిగ్రీ, పీజీ, ఎంటెక్ చదువుతున్న స్టూడెంట్లు తమ స్కిల్ డెవలప్ చేసుకోడానికి ఇంట్రెస్ట్ చూపుతున్నారు.
జాబ్స్ ఫ్యాక్టరీగా ‘స్టెప్’ సెంటర్
ప్రభుత్వ సంస్థలతో పాటు వరంగల్‌లోని కార్పొరేట్ కంపెనీలు, ఫుడ్ సెంటర్లు, టెక్స్టైల్ రంగంలో బ్రాండెడ్ షోరూమ్‌లలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు అందుబాటులో ఉండగా, వారు తమ సంస్థలో పని చేయడానికి అవసరమైన మెళకువలు ఉన్న వారికి ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈక్రమంలో స్కిల్ డెవలప్‍మెంట్ సెంటర్ నిరుద్యోగ మహిళలకు వరంలా మారుతోంది.
స్టెప్ ద్వారా అందించే కోర్సులకు మార్కెట్లో డిమాండ్ ఉండడంతో పలు సంస్థలు ఇక్కడ శిక్షణ పూర్తి చేసుకున్న వారికి అవకాశాలు కల్పిస్తున్నాయి. నగరంలో నిర్వహించే జాబ్ మేళాల్లో స్కిల్ డెవలప్ సెంటర్లలో శిక్షణ పొందిన వారికి ప్రాధాన్యాత ఇస్తున్నారు. దీంతో తక్కువ సమయంలోనే ఉద్యోగాలు పొందే అవకాశం దక్కుతోంది.
ఓరుగల్లులో ఇటీవల కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ ప్రారంభమవగా, ఇందులో కైటెక్స్ వంటి అతిపెద్ద సంస్థ ఉత్పత్తులు ప్రారంభించేందుకు సిద్ధమవుతోంది. ఈక్రమంలో స్టెప్‌లో టైలరింగ్‍లో పూర్తి స్థాయి శిక్షణ పొందిన 200 మందికి ఉద్యోగాలు కల్పించేందుకు ముందుకొచ్చింది. వరంగల్ నగరంలో 11 లక్షల జనాభా ఉండడంతో చాలా మంది మహిళలు సొంతంగా బ్యూటిషియన్, లేడీస్ టైలరింగ్ సెంటర్లను ఏర్పాటు చేసుకొని రాణిస్తున్నారు.
స్టెప్ శిక్షణతో ఈజీగా ఉద్యోగాలు
ప్రభుత్వం నిర్వహిస్తున్న స్కిల్ డెవలప్ సెంటర్ ద్వారా నిరుద్యోగ మహిళలకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగు పడుతున్నాయి. ఇక్కడ ట్రైనింగ్ తీసుకున్న వారు పూర్తి స్థాయిలో సక్సెస్ అవుతున్నారు. వివిధరంగాల్లో ఈజీగా అవకాశాలు వస్తున్నయ్. ఇక్కడ అందించే సర్టిఫికెట్‍తో ఉద్యోగాలు పొందుతున్నారు.
- అబ్దుల్ నయీం, స్టెప్ కో ఆర్డినేటర్
