- ఇరాన్ సుప్రీం లీడర్ వీడియో క్లిప్ ప్రసారం
- ఫిబ్రవరి 28న అలీ ఖమేనీ మరణం తర్వాత బయటకురాని మొజ్తబా
న్యూఢిల్లీ: ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ ఆరోగ్యంపై నెలల తరబడి ఊహాగానాలు సాగుతున్న నేపథ్యంలో తాజాగా ఆయన వీడియోను ఆ దేశ ప్రభుత్వ మీడియా సంస్థ ‘మెహర్’ ప్రసారం చేసింది. ‘‘విప్లవ నాయకుడు అయతుల్లా సయ్యద్ మొజ్తబా ఖమేనీ వీడియో మొదటిసారి విడుదలైంది” అని సదరు వార్తా సంస్థ శనివారం తన వెబ్ సైట్ ద్వారా వెల్లడించింది.
12 సెకన్ల నిడివి గల ఈ వీడియోలో మొజ్తబా ఆరోగ్యంగానే కనిపిస్తున్నారు. ఒక గదిలో కార్పెట్ మీద కూర్చుని ఉన్నారు. నల్లటి తలపాగా, తెలుపు రంగు దుస్తుల మీద లేత బూడిద రంగు గౌను ధరించి, చుట్టూ కూర్చున్న వారితో మాట్లాడుతున్నారు. అయితే, ఈ వీడియో ఎప్పుడు, ఎక్కడ తీశారనేది తెలియరాలేదు. మార్చి 20న ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఐఆర్ఐబీ మీడియా సంస్థ కూడా మొజ్తబాకు సంబంధించిన దాదాపు ఇలాంటి వీడియోనే విడుదల చేసింది.
‘‘మొదటిసారి ప్రసారం. అయతుల్లా మొజ్తబా ఖమేనీ బోధిస్తున్న మతపరమైన శాస్త్రాల వీడియో” అని ‘ఎక్స్’ వేదికగా పేర్కొన్నప్పటికీ, ఆ వీడియో తీసిన తేదీ లేదా ప్రదేశాన్ని వెల్లడించలేదు. ఫిబ్రవరి 28న ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ జరిపిన దాడిలో మొజ్తబా తండ్రి, అప్పటి సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మరణించారు. అదే దాడిలో మొజ్తబా కూడా తీవ్రంగా గాయపడ్డారనివార్తలు వచ్చాయి.
కొన్ని నెలలుగా ఊహాగానాలు..
అలీ ఖమేనీ మరణం తర్వాత కొత్త సుప్రీం లీడర్‌గా మొజ్తబా నియమితులైనప్పటికీ, ఆయన ఇప్పటివరకూ బహిరంగంగా కనిపించలేదు. గత నెలలో జరిగిన అలీ ఖమేనీ అంత్యక్రియలకూ హాజరుకాలేదు. ఇప్పటివరకూ పలుసార్లు మొజ్తబా పేరిట రాతపూర్వక సందేశాలు తప్ప ఫోటో లేదా వాయిస్ రికార్డింగ్ విడుదల కాలేదు. దీంతో మొజ్తబా తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్నారంటూ కొన్ని నెలలుగా ఊహాగానాలు సాగుతున్నాయి.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గత నెలలో మాట్లాడుతూ.. మొజ్తబా 90% మరణించారని వ్యాఖ్యానించారు. మొజ్తబా పరిస్థితి చాలా దారుణంగా ఉందని ఇజ్రాయెల్ ‘చానెల్ 14’ ఇటీవల ఓ కథనంలో పేర్కొంది. ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియన్ ఇటీవల మాట్లాడుతూ.. మొజ్తబాతో కమ్యూనికేషన్ ప్రస్తుతం చాలా కష్టంగా ఉందని చెప్పారు. కానీ ఎలాగైనా సరే ఆయన ఉనికి తమకు గొప్ప బలాన్ని ఇస్తుందని, తద్వారా తాము ముందుకు సాగగలమని చెప్పారు.
