హైదరాబాద్ నగర విస్తరణ అత్యంత వేగంగా నమోదు అవుతున్న ప్రస్తుత తరుణంలో.. తెలంగాణ ప్రభుత్వం క్యూర్ (కోర్ అర్బన్ రీజియన్ ఎక్స్‌పాన్షన్) చట్టం ద్వారా హైడ్రా సంస్థకు పూర్తిస్థాయి చట్టబద్ధమైన అధికారాలు కల్పించడం పరిపాలనా రంగంలో కీలకమైన మైలురాయి. కొంతకాలంగా నీటి వనరుల ఆక్రమణలు, నాలాల ఆటంకాలపై హైడ్రా నిర్వహించిన కూల్చివేతల చర్యలు సమాజంలో తీవ్రస్థాయి చర్చకు దారితీశాయి.
అయితే, స్పష్టమైన చట్టపరమైన పునాది లేకపోవడం మూలంగా పలు న్యాయపరమైన అడ్డంకులు, ప్రజా సందేహాలు, పరిపాలనా సవాళ్లు తెరపైకి వచ్చాయి. బాధితుల విజ్ఞప్తులు విచారించడానికి చట్టంలోనే ప్రత్యేక అప్పిలేట్ ట్రిబ్యునల్ ఏర్పాటు చేయడం వల్ల పౌరుల రాజ్యాంగబద్ధ 'సహజ న్యాయ సూత్రాలు' సంపూర్ణంగా కాపాడటం జరుగుతుంది.
ఆక్రమణల తొలగింపు చర్యలు ఏ ఒక్క నిర్దిష్ట వర్గానికో లేదా బలహీనులకో మాత్రమే పరిమితం కాకుండా, పక్షపాతరహితంగా, పారదర్శకంగా జరగాలి. ప్రజాస్వామ్య వ్యవస్థలో సమన్యాయ పాలన మాత్రమే వ్యవస్థ విశ్వసనీయతను నిలబెడుతుంది.
ప్రకృతి వనరుల సంరక్షణ విషయంలో మన రాజ్యాంగ మార్గదర్శకాలు స్పష్టమైన దిశా నిర్దేశం చేస్తున్నాయి. భారత రాజ్యాంగంలో పబ్లిక్ ట్రస్ట్ సిద్ధాంతం నేరుగా లిఖితపూర్వకంగా లేనప్పటికీ, సుప్రీంకోర్టు దీనిని జీవించే హక్కు (ఆర్టికల్ 21), పర్యావరణ సంరక్షణపై ప్రభుత్వ బాధ్యత (ఆర్టికల్ 48A), అలాగే ఆర్టికల్ 51A(g) ప్రాథమిక విధితో ముడిపెట్టి ప్రభుత్వ బాధ్యతగా మార్చింది.
ఇటీవలి కాలంలో మానవ నిర్మిత సరస్సులకు కూడా ఈ సూత్రాన్ని వర్తింపజేసిన 'స్వచ్ఛ అసోసియేషన్ వర్సెస్ బాంబే హైకోర్టు (2025)' కేసు వరకు న్యాయస్థానాలు ఎన్నో కీలక తీర్పులను ఇచ్చాయి. ఈ సిద్ధాంతం ప్రకారం, నదులు, అడవులు, సరస్సులు వంటి ప్రకృతి వనరులను ప్రైవేట్ లేదా వాణిజ్య ప్రయోజనాల కోసం ధారాదత్తం చేసే అధికారం ప్రభుత్వానికి లేదు.
ప్రభుత్వం కేవలం ప్రజల తరఫున ఈ వనరులను కాపాడే ఒక సంరక్షకురాలు (ట్రస్టీ) మాత్రమేనని కోర్టులు తెలియజేస్తున్నాయి. పబ్లిక్ ట్రస్ట్ సిద్ధాంతం ప్రకారం చెరువుల ఎఫ్‌టిఎల్, బఫర్ జోన్లు ప్రజల ఉమ్మడి ఆస్తులు కాబట్టి, పర్యావరణ పరిరక్షణార్థం వీటిల్లో ఎలాంటి ప్రైవేట్ ఆక్రమణలను లేదా శాశ్వత నిర్మాణాలను అనుమతించే అధికారం ప్రభుత్వానికి లేదు.
ఒకవేళ ఈ సురక్షిత ప్రాంతాలలో నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు చేపడితే, కోర్టులు ఆ
రిజిస్ట్రేషన్లను రద్దు చేస్తూ ఆక్రమణలను నిర్దాక్షిణ్యంగా కూల్చివేయాలని ఆదేశిస్తున్నాయి.
టీడీఆర్ విధానంలో సమానత్వం అవసరంచెరువులు, నదుల ఎఫ్టీఎల్, బఫర్ జోన్ల పరిధిలో కూల్చివేతలకు గురయ్యే శిఖం, పట్టా భూముల ధ్రువీకరణ ఉన్న అందరికీ టీడీఆర్ హక్కులు అందించాలి. టీడీఆర్ (ట్రాన్స్‌ఫరబుల్ డెవలప్‌మెంట్ రైట్స్) అనగా బదిలీ చేయదగిన అభివృద్ధి హక్కులు. దీనిని సాధారణంగా ‘టీడీఆర్’ అంటారు.
జీహెచ్‌ఎంసీ చట్టం-1955 అలాగే హెచ్‌ఎండీఏ చట్టం-2008 నియంత్రిస్తాయి. ప్రభుత్వ పనుల కోసం భూమిని కోల్పోయిన యజమానులకు నగదుకు బదులుగా ట్రాన్స్‌ఫరబుల్ డెవలప్‌మెంట్ రైట్స్ సర్టిఫికెట్లను ప్రభుత్వం జారీ చేస్తుంది. భూమిని కోల్పోయిన యజమాని, ఆ హక్కులను వేరే ప్రాంతంలో భవనాలు నిర్మించడానికి ఉపయోగించుకోవచ్చు లేదా వేరే వారికి అమ్ముకోవచ్చు.
ఒక సినీ నటుడికి చెందిన 'ఎన్-కన్వెన్షన్' నిర్మాణాలను తొలగించి, బదులుగా టీడీఆర్ పరిహారం ప్రసక్తి రావడం, అదే సమయంలో సామాన్య నిరుపేద బాధితులకు కేవలం రెండు పడకగదుల (2బీహెచ్‌కే) ఇళ్లు మాత్రమే కేటాయించడం విధానపరమైన పక్షపాతాన్ని బహిర్గతం చేస్తోంది. అది పరిపూర్ణ న్యాయం అనిపించుకోదు.
శాస్త్రీయ అధ్యయనాలు తప్పనిసరి
కూల్చివేతల నిర్ణయాలు కేవలం తాత్కాలిక ఒత్తిళ్ల ఆధారంగా కాకుండా శాస్త్రీయ పర్యావరణ అధ్యయనాలు, హైడ్రోలాజికల్ పరిశోధనలు, ఆధునిక డ్రోన్ సర్వేల ప్రాతిపదికన పక్కా డేటా ఆధారంగా రూపుదిద్దుకోవాలి. సాంకేతిక వివరాలు ప్రజలకు అందుబాటులో ఉంచడం ద్వారా భవిష్యత్తులో స్థిరాస్తి కొనుగోలుదారులు అక్రమ నిర్మాణాల బారిన పడకుండా ముందస్తు రక్షణ పొందుతారు.
ఇటువంటి పారదర్శక సాంకేతిక విధానం వల్ల పౌరులు ఆస్తుల కొనుగోలుకు ముందే చెరువుల సరిహద్దులను సరిచూసుకునే వీలు కలిగి మోసాలను నివారించవచ్చు. భూగర్భ నీటిమట్టాలు, వాతావరణ సమాచారం పరిశీలించి నదీ పరీవాహక ప్రాంతాల శాస్త్రీయ అధ్యయనం పూర్తయిన తర్వాతే చర్యలకు పూనుకోవాలి. ముందస్తు సాంకేతిక నిరోధక వ్యవస్థలను బలోపేతం చేయడం ద్వారా పౌరుల ప్రాణ, ఆస్తి నష్టాలను సమర్థవంతంగా అరికట్టవచ్చు.
రాష్ట్రమంతటికీ హైడ్రా తరహా చట్టబద్ధ వ్యవస్థ
పరిశుభ్రమైన వాతావరణం, సురక్షిత జీవనం పొందే ప్రాథమిక హక్కు కేవలం రాజధాని నగర పౌరులకే పరిమితం కాకూడదు. తెలంగాణలోని ద్వితీయ శ్రేణి పట్టణాలైన వరంగల్, కరీంనగర్, ఖమ్మం, నిజామాబాద్, మహబూబ్‌నగర్, నల్గొండ, సంగారెడ్డి వంటి ప్రాంతాల్లోనూ వేగవంతమైన నగరీకరణ ఫలితంగా చెరువుల ఆక్రమణల సమస్య తీవ్రమవుతోంది.
రాజ్యాంగబద్ధమైన పర్యావరణ పరిరక్షణ హక్కు రాష్ట్రమంతటికీ సమానంగా వర్తించాలి. అన్ని మున్సిపల్ కార్పొరేషన్లకు ప్రాంతీయ హైడ్రా లేదా హైడ్రా తరహా చట్టబద్ధ వ్యవస్థలను విస్తరించడం అత్యంత అవసరం. ఈ ప్రక్రియలో అధికార వికేంద్రీకరణను ప్రోత్సహిస్తూ పట్టణ స్థానిక సంస్థల సామర్థ్యాన్ని బలోపేతం చేయడం ద్వారా స్థానిక పురపాలక అధికారాలను కాపాడుతూనే అమలు ప్రక్రియను వేగవంతం చేయవచ్చు.
అగ్నిమాపక, విపత్తు నిర్వహణ శాఖతో అనుసంధానం
భవనాల రక్షణ, నీటి ముంపు, అగ్నిప్రమాదాలు సమగ్ర పట్టణ విపత్తు నిర్వహణ పరిధిలోకి వచ్చే అంశాలు. అందుకే హైడ్రాను రాష్ట్ర అగ్నిమాపక, అత్యవసర సేవల శాఖతో శాశ్వత ప్రాతిపదికన అనుసంధానించడం అత్యంత అవసరం. అగ్నిమాపక శాఖ వద్ద ఉన్న అత్యవసర స్పందన నైపుణ్యం, హైడ్రా పరిధిలోని భౌగోళిక సమాచారం కలిసి పనిచేస్తే అత్యవసర పరిస్థితుల్లో త్వరితగతిన రక్షణ చర్యలు చేపట్టే వీలు కలుగుతుంది. నిర్మాణం ప్రారంభానికి ముందే ఫైర్ సేఫ్టీ, పర్యావరణ అనుమతులను సమీక్షించి నిరోధాత్మక భద్రతా నియమాలు అమలు చేయడం సమగ్ర నగర రక్షణకు తోడ్పడుతుంది.
ప్రజాస్వామ్య జవాబుదారీతనం
క్యూర్ చట్టం ద్వారా హైడ్రా సంస్థకు ఇచ్చే చట్టబద్ధత కేవలం బుల్డోజర్ల అధికారాన్ని ప్రదర్శించే సాధనం కాకూడదు. అది జవాబుదారీతనానికి, పరిపాలనా సమర్థతకు ప్రతీకగా నిలవాలి. ఈ ట్రిబ్యునల్ ద్వారా అప్పీళ్లను 30 రోజుల పరిమిత కాలవ్యవధిలో పరిష్కరించే స్పష్టమైన నిబంధనను చేర్చడం వల్ల సుదీర్ఘ న్యాయపోరాటాలను నివారించి చట్టబద్ధమైన సహజ న్యాయ సూత్రాలను కాపాడవచ్చు.
రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాలు, ప్రాథమిక విధుల స్పూర్తితో, శాస్త్రీయ అధ్యయనాల ఆధారంగా ఎటువంటి పక్షపాతం లేకుండా పాలన సాగించాలి. టీడీఆర్ అర్హతలో సమానత్వం సంపూర్ణంగా అమలు చేసినప్పుడే తెలంగాణ పట్టణాభివృద్ధి నమూనా భారతదేశానికి ఆదర్శవంతంగా నిలుస్తుంది.
- డా. కట్కూరి , పాలసీ ఎనలిస్ట్
గమనిక: ఓపెన్ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్ ఐడీ [email protected] రచయితలు ‘వెలుగు’ కు మాత్రమే పంపుతున్నామని హామీ తప్పనిసరి రాయాలి. స్వీయ రచన అయి ఉండాలి.రచన 700 పదాలకు మించరాదు.
