లంచం కేసులో అదానీకి భారీ ఊరట.. క్రిమినల్ కేసును కొట్టేసిన అమెరికా కోర్టు

లంచం కేసులో అదానీకి భారీ ఊరట.. క్రిమినల్ కేసును కొట్టేసిన అమెరికా కోర్టు

సెక్యూరిటీలు, వైర్ ఫ్రాడ్ కేసులో వ్యాపార దిగ్గజం అదానీకి భారీ ఊరట దక్కింది. అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీ, అతని మేనల్లుడు సాగర్ అదానీలపై ఉన్న క్రిమినల్ ఆరోపణలను అమెరికాలోని న్యాయస్థానం కొట్టివేసింది.

న్యూయార్క్ తూర్పు జిల్లా యునైటెడ్ స్టేట్స్ డిస్ట్రిక్ట్ కోర్టు న్యాయమూర్తి నికోలస్ గరౌఫిస్, అదానీలపై సెక్యూరిటీలు, వైర్ ఫ్రాడ్‌కు సంబంధించిన క్రిమినల్ ఆరోపణలను 'విత్ ప్రెజుడిస్' పద్ధతిలో కొట్టివేశారు. అంటే.. ఈ కేసులలో విచారణను మళ్లీ ప్రారంభించడానికి వీలులేదని అర్థం.

మోసం, లంచం ఆరోపణల కేసులో దాదాపు రెండేళ్లుగా సాగుతున్న విచారణకు ఈ తీర్పుతో ముగింపు పలికినట్టైంది. నవంబర్ 2024లో అదానీ గ్రూప్ సోలార్ కాంట్రాక్టుల కోసం భారత ప్రభుత్వ అధికారులకు 250 మిలియన్ డాలర్ల లంచం ఇచ్చేందుకు కుట్ర పన్నిందని అమెరికా సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. భారత ప్రభుత్వ అధికారులకు 250 మిలియన్ డాలర్లు (దాదాపు రూ.2,400 కోట్లు) లంచాలు ఇచ్చి సోలార్ పవర్ కాంట్రాక్టులు పొందారని, ఈ విషయాన్ని దాచిపెట్టి అమెరికా ఇన్వెస్టర్లను మోసం చేశారని గౌతమ్‌‌‌‌ అదానీ, ఆయన మేనల్లుడు సాగర్ అదానీలపై 2024లో అమెరికాలో కేసు నమోదైంది.

ఈ కేసులోనే.. అమెరికా న్యాయస్థానం తీర్పు ప్రకటించింది. ఈ వ్యవహారం అమెరికా చట్టాల పరిధిలోకి రాదని,  డీఓజే ఈ కేసును వెనక్కి తీసుకుంది. సాధారణంగా ప్రాసిక్యూషన్ వద్దనుకున్న కేసును జడ్జిలు బలవంతంగా నడపలేరు, కానీ జడ్జి అధికారికంగా సంతకం చేసేవరకు అదానీపై చార్జీలు పెండింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోనే ఉంటాయి. జడ్జి తీర్పుతో ఈ కేసులో అదానీ, అతని మేనల్లుడికి ఊరట దక్కింది.