ఓపెన్ పేజి:ఇంటి ముందు విషరసాయన సాన్పి.. భూగర్భ జలాలు కలుషితం.. ఆరోగ్యం దెబ్బతింటుంది..

ఓపెన్ పేజి:ఇంటి ముందు విషరసాయన సాన్పి..  భూగర్భ జలాలు కలుషితం.. ఆరోగ్యం దెబ్బతింటుంది..

ఒకప్పుడు  దినచర్య అనేది వాకిట్లో  పేడతో  సాన్పి చల్లి (అలుకు చల్లి)  చక్కగా ముగ్గులతో వాకిలిని అలంకరించేవారు. ఈ పద్ధతి వలన ఇంటి చుట్టూ పరిశుభ్రత ఏర్పడి వాతావరణం ఆరోగ్యకరంగా, ఆహ్లాదకరంగా ఉండేది. 

 కాని కాలక్రమేణా మట్టివాకిళ్లు సిమెంట్ కాంక్రీట్‌‌తో  కప్పివేయడం వలన,  పేడ దొరకక పోవడం, లేదా పేడను  సేకరించే సమయం లేకపోవడం  మొదలగు కారణాల వలన ఇంటి ముంగిట వాకిట్లో పేడతో అలికే బదులు  మార్కెట్లో  తక్కువ ధరతో  సులభంగా  లభ్యమయ్యే విషపూరిత రసాయనాలతో తయారుచేసిన రంగు రంగుల రసాయనిక పదార్థాలను ప్రజలు సాన్పిగా  వాడుతున్నారు.  ఈ  రసాయనాలు మార్కెట్లో ‘సాన్పి’ లేదా ‘కలాపి’ పేరుతో  లభిస్తున్నవి.  ఈ  రసాయనాలతో  వాకిలిని అలికిన తర్వాత  పేడతో  అలికిన విధంగానే కనిపిస్తుంది.  

ప్రజలు  రసాయనాలతో  కూడిన ఈ రంగులను వాడటం వలన విపరీతమైన ఆరోగ్య సమస్యలు ఎదురవుతున్నాయి. ఆకుపచ్చని  రంగును ఇచ్చే ఈ రసాయనిక పదార్థం పేరు ‘ఔరమైన్-ఓ’.  ఇది  ‘డైఅరైల్ మీథేన్’ వర్గానికి  చెందిన కృత్రిమ రంగు పదార్థం.  పేడ  సులభంగా లభించే, తక్కువ ఖర్చుతో కూడిన పర్యావరణ అనుకూలమైన పదార్థం. 

భారతీయ సంస్కృతిలో  పేడను ముఖ్యంగా ఆవుపేడను పవిత్రంగా భావించే సంప్రదాయం ఉంది.  అందువల్ల పేడను శుద్ధికి ప్రతీకగా భావించి పూజలు,  పండుగలు,  ఇంటి వాకిలి  అలంకరణలో ఉపయోగించే  ఆచారం ఏర్పడింది.  భారతీయ  సంప్రదాయాల్లో  వాకిలిని,  మట్టి ఇళ్ల  గోడలు/ నేలను పేడతో  అలకటం  వెనుక కేవలం ఆచారం మాత్రమే కాకుండా,  కొన్ని ఆచరణాత్మక,  పర్యావరణ, సాంస్కృతిక  కారణాలు కూడా ఉన్నాయి. 

పేడ నేలలో ఉండే ఉపయోగకరమైన  సూక్ష్మజీవుల సంఖ్యను పెంచటం  వలన నేల  
సారవంతమవుతుంది.  పేడను  పలుచగా పూసి ఎండబెట్టడం వల్ల నేల ఉపరితలం పొడిగా మారుతుంది.  కొన్ని రకాల హానికరమైన సూక్ష్మజీవులను ఇంటి పరిసరాలలో లేకుండా చేస్తుంది.

ఇంటి ఉష్ణోగ్రతను నియంత్రించడంలో సహాయం

పేడను  మట్టి  లేదా మట్టితో  కలిపి పూయడం వల్ల ఒక  సహజ పూత ఏర్పడుతుంది.  ఇది ఉపరితలాన్ని కొంత  బలపరచడంతోపాటు  దుమ్ము తగ్గించడంలో సహాయపడుతుంది.  మట్టి–పేడ పూత  ఇంటి ఉష్ణోగ్రతను నియంత్రించడంలో సహాయపడుతుంది.   

ఔరమైన్‌‌ఓ కృత్రిమ  రంగు.  దీనిని  కొన్ని  పారిశ్రామిక రంగాల్లో,  ముఖ్యంగా రంగులు,  ముద్రణ,  వస్త్ర పరిశ్రమల్లో ఉపయోగిస్తారు.  అయితే  దీనివల్ల మానవ ఆరోగ్యం,  పర్యావరణంపై  ప్రతికూల 
ప్రభావాలు కలుగుతాయి. ‘ఔరమైన్-ఓ’ను  వాకిట్లో   వాడటం  వలన నేలలో ఉండే  ఉపయోగకరమైన  సూక్ష్మజీవులు  నశించిపోవటం వలన నేల  బయోడిగ్రడేషన్  (జీవ విచ్ఛిన్నం)  ధర్మాన్ని  కోల్పోతుంది.  

సూక్ష్మజీవులు,  బ్యాక్టీరియా, శిలీంధ్రాలు మొదలైనవి  వ్యర్ధ పదార్థాలను తమ జీవక్రియల ద్వారా చిన్న,  సరళమైన  పదార్థాలుగా విచ్ఛిన్నం చేయడాన్ని బయోడిగ్రెడేషన్ అంటారు. బయోడిగ్రెడేషన్ లేకపోవటం వలన ఇంటిముంగిట వాకిట్లో,  ఇంటి పరిసరాలలో హానికర సూక్ష్మజీవుల  సంఖ్య పెరిగి పోవటం వలన ఇంటి పరిసరాలలో అనారోగ్య వాతావరణం ఏర్పడే అవకాశం ఉన్నది.

 భూగర్భ జలాలు కలుషితం

వర్షాకాల సమయంలో వాకిట్లోని కృత్రిమ రంగు పదార్థాలు వాననీటిలో  కలిసిపోతాయి. ఈ  వాన లేదా వరద  నీరు   చెరువులు,  ఇతర  ఉపరితల నీటి వ్యవస్థలలోనికి ప్రవేశించటం వలన నీరు కలుషితం అవుతుంది.  నీటి వనరులలో కలిసిపోయిన  కృత్రిమ రంగు పదార్థాలు ‘బయోమాగ్నిఫికేషన్’ చెంది  ఆహారపు గొలుసు ద్వారా తిరిగి మానవుని శరీరంలోనికి అధిక పరిమాణంలో ప్రవేశిస్తాయి.  

కృత్రిమ రంగు పదార్థాలను  కలిగిన  వరద నీరు పంట పొలాల గుండా  ప్రవహించినప్పుడు  కృత్రిమ రంగు పదార్థాలు పంటపొలాల్లో అవక్షేపకాలుగా మిగిలిపోవటం వలన పంట పొలాలు భూసారాన్ని కోల్పోతాయి. అటువంటి పంట పొలాల్లో పండించిన  ఆహార పదార్థాలలోనికి కృత్రిమ రంగు పదార్థాలు ప్రవేశిస్తాయి.   

కృత్రిమ రంగు పదార్థాలను కలిగిన వరద నీరు భూమిలోనికి ఇంకిపోవటం వలన భూగర్భ జలాలు కలుషితం అవుతాయి.  నీటిలో కృత్రిమ రంగు పదార్థాలు వచ్చి చేరటం వలన నీటిలోని జలచరాలకు హాని కలిగి అవి నశిస్తాయి.  

చెరువులు,  నదులు వంటి  ఉపరితల నీటి వ్యవస్థలలో ఉండే ఉపయోగకరమైన  సూక్ష్మజీవులు నశించిపోవటం వలన  ప్రకృతిసిద్ధమైన 'నీటి స్వయంశుద్ధి' ప్రక్రియ నిలిచిపోతుంది.  నీటిలో అధిక మొత్తంలో  కృత్రిమ రంగు పదార్థాల పరిమాణం ఉంటే సూర్యకాంతి నీటిలోనికి ప్రవేశించడం తగ్గి, కిరణజన్య సంయోగక్రియ ప్రక్రియకు అంతరాయం కలుగుతుంది.

మానవ ఆరోగ్యంపై  ప్రభావాలు

‘ఔరమైన్-ఓ' దీర్ఘకాలికంగా  లేదా అధికస్థాయిలో వాడటం వలన క్యాన్సర్  వచ్చే ప్రమాదం ఉన్నది.  
ఈ  రసాయనాన్ని చేతులతో  నీటిలో  కలిపినప్పుడు  లేదా  పొరపాటున ఈ రసాయనం చేతులకు తగిలినా  రసాయనపు  మరకలు  చేతులపై  దీర్ఘకాలంపాటు ఉండి ఆహారం తినేటప్పుడు  క్రమంగా శరీరంలోనికి  ప్రవేశిస్తుంది.  చేతులపై ఎలర్జీ వంటి  రోగాలను కలుగజేస్తుంది.

  ‘ఔరమైన్-ఓ' కాలేయం,  మూత్రపిండాలపై తీవ్రమైన ప్రభావం చూపుతుంది. సంప్రదాయం అనేది మన పూర్వీకులు అనుసరించిన జీవన విధానం. ఆ జీవన విధానంలో స్థానిక పరిస్థితులకు అనుగుణంగా స్థానికంగా లభించే  సహజ వనరులతో, ముడిపదార్థాలతో  జీవన విధానాన్ని పర్యావరణ అనుకూలంగా,  ఆరోగ్యకరంగా మలచుకున్నారు.  

ప్రస్తుత కాలంలో  ఆధునికత పేరుతో ఆచార వ్యవహారాలను  మార్పు చేసుకుని పర్యావరణ విధ్వంసం చేయడం  ద్వారా క్యాన్సర్ వంటి  తీవ్రమైన అనారోగ్య సమస్యలకు గురి అవుతున్నారు.  మారుతున్న కాలంతోపాటుగా  ప్రకృతి వనరుల కొరత కూడా ఏర్పడుతున్నది. సంప్రదాయం  పేరిట  సహజసిద్ధమైన  ప్రకృతి వనరుల స్థానంలో  కృత్రిమ పదార్థాలను  వాడడం సరైన విధానం కాదు.  దానికి బదులుగా సంప్రదాయాన్ని ప్రస్తుత  కాలానికి  అనుగుణంగా  మార్చుకుంటే మంచిది.

  ప్రస్తుత కాలంలో సాన్పి చల్లడానికి  పేడ దొరకటం లేదని దాని స్థానంలో  ‘ఔరమైన్-ఓ’ వంటి  విషపూరిత రసాయనాలను వాడుతున్నారు. సాధ్యమైనంత వరకు పేడ సాన్పి చల్లడానికే ప్రాధాన్యమివ్వాలి. పేడ దొరకనపుడు మామూలు నీటితో సాన్పి చల్లుకొని ముగ్గు వేసుకుంటే మంచిది.

- డా..శ్రీధరాల రాము, ఫ్యాకల్టీ ఆఫ్ కెమిస్ట్రీ అండ్ ఎన్విరాన్మెంటల్ సైన్సెస్

గమనిక: ఓపెన్​ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్​ ఐడీ openpage@v6velugu.com రచయితలు ‘వెలుగు’ కు మాత్రమే పంపుతున్నామని హామీ తప్పనిసరి రాయాలి. స్వీయ రచన అయి ఉండాలి.రచన 700 పదాలకు మించరాదు.