రవీంద్రభారతి, వెలుగు: బీసీలకు జనాభా దామాషా ప్రకారం రాజకీయ ఫలాలు అందడం లేదని టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్ అన్నారు. ఆదివారం రవీంద్రభారతిలో సర్దార్ పాపన్న మహారాజ్ ధర్మపరిపాలన సంస్థ, జై గౌడ్ ఉద్యమం జాతీయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన పాపన్న గౌడ్ 376వ జయంతి వారోత్సవాల్లో ఆయన మాట్లాడారు.
తెలంగాణ ప్రభుత్వం బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేసినా కేంద్రం అడ్డుపడుతోందని విమర్శించారు. త్వరలోనే బీసీ చట్టం అమలవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ఆశయాలు, పోరాట స్ఫూర్తిని నేటి తరానికి అందించాల్సిన అవసరం ఉందని అన్నారు.
ఈ నెల 18న సెక్రటేరియట్ ఎదురుగా సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నట్లు తెలిపారు. త్వరలో గౌడ ఆత్మగౌరవ భవనం పూర్తి చేస్తామని, కొన్ని జిల్లాలకు సర్వాయి పాపన్న పేరు పెట్టే అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు.
కార్యక్రమంలో జై గౌడ్ ఉద్యమం జాతీయ అధ్యక్షుడు వట్టికూటి రామారావుగౌడ్, యూపీ మాజీ పీసీసీ చీఫ్ అజయ్ లొల్లు, మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి సత్యం గౌడ్, కర్నాటక సీఎం ఓఎస్డీ శ్రీనివాస్, బీసీ పొలిటికల్ ఫ్రంట్ చైర్మన్ బాలగోని బాలరాజ్‌గౌడ్, కన్వీనర్లు అయిలి వెంకన్నగౌడ్, విజయ్‌కుమార్, టీఎన్జీవో సత్యనారాయణగౌడ్ పాల్గొన్నారు.
