- వచ్చే నెల 14 వరకు శుభముహూర్తాలు
- నెల రోజులపాటు పెళ్లిళ్లే పెళ్లిళ్లు
- రాష్ట్రవ్యాప్తంగా సుమారు 10 వేల లగ్గాలు జరుగుతాయని అంచనా
- వందల కోట్ల వ్యాపారం, లక్షల మందికి ఉపాధి
హైదరాబాద్, వెలుగు: శ్రావణ మాసం ప్రారంభం కానుండటంతో తెలుగు రాష్ట్రాల్లోని పల్లెల నుంచి పట్టణాల వరకు పెళ్లి బాజాలు మోగేందుకు సిద్ధమయ్యాయి. ఈ నెల 13 నుంచి ప్రారంభమయ్యే శుభ ముహూర్తాలు వచ్చే నెల 11 వరకు కొనసాగనున్నాయి. సుమారు నెల రోజుల పాటు మంచి ముహూర్తాలు ఉండటంతో వివాహాలు, నిశ్చితార్థాలు, ఇతర శుభకార్యాలు పెద్ద ఎత్తున జరుగనున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఈ సీజన్‌లో దాదాపు 10 వేలకు పైగా పెళ్లిళ్లు జరగనున్నట్లు అంచనా.
గత నెలలో ఆషాఢ మాసం కారణంగా మంచి ముహూర్తాలు లేక ఫంక్షన్ హాల్స్ ఖాళీగా ఉండగా.. ఇప్పుడు శ్రావణ మాసంతో అవి మళ్లీ కళకళలాడనున్నాయి. ఈ పెళ్లిళ్ల సీజన్‌తో బంగారం, వస్త్రాలు, పూలు, క్యాటరింగ్, ఫంక్షన్ హాళ్లు, అలంకరణ, ఫొటోగ్రఫీ, బ్యూటీ పార్లర్లు తదితర రంగాల్లో వ్యాపారం భారీగా ఊపందుకోనుంది. ప్రత్యక్షంగా, పరోక్షంగా లక్షలాది మందికి ఉపాధి లభించనుండగా, పెళ్లి అనుబంధ రంగాల ద్వారా వందల కోట్ల రూపాయల వ్యాపారం జరగనుంది.
శ్రావణ మాసం ఉపాధి కల్పించే సీజన్
పెళ్లి లేదా శుభకార్యం కేవలం ఒక్క కుటుంబానికి సంబంధించిన కార్యక్రమం మాత్రమే కాదు. దాని చుట్టూ అనేక వృత్తులు, వ్యాపారాలు ఆధారపడి ఉంటాయి. పెళ్లి తేదీ ఖరారైనప్పటి నుంచి బట్టలు, నగలు, పెళ్లి కార్డులు, పూలు, డెకరేషన్, క్యాటరింగ్, ఫొటోగ్రాఫర్లు, ఈవెంట్ మేనేజ్‌మెంట్ సంస్థలు, ట్రావెల్స్ కొనుగోళ్లు ప్రారంభమవుతాయి.
పెళ్లి రోజు దగ్గరపడే కొద్దీ క్యాటరింగ్ సిబ్బంది, వంటవాళ్లు, సర్వర్లు, డెకరేషన్ కార్మికులు, మేకప్ ఆర్టిస్టులు, డ్రైవర్లకు పని విపరీతంగా పెరుగుతుంది. పెళ్లిళ్ల ద్వారా అనేక వృత్తులకు పని దొరుకుతుండటంతో శ్రావణ మాసం ఉపాధి కల్పించే సీజన్‌గా మారుతోంది.
బంగారం, వస్త్ర దుకాణాల్లో రద్దీ
వధూవరుల కుటుంబాలు బంగారు ఆభరణాల కొనుగోళ్లకు అత్యంత ప్రాధాన్యం ఇస్తుండటంతో ఆభరణాల దుకాణాల్లో రద్దీ కనిపిస్తోంది. ప్రస్తుతం 10 గ్రాముల బంగారం ధర రూ. 1,40,000 నుంచి లక్షన్నర పైనే పలుకుతోంది. ధరలు అధికంగా ఉన్నప్పటికీ పెళ్లిళ్ల సీజన్ కావడంతో కొనుగోలు చేయడానికి ఎవరూ వెనుకాడటం లేదు.
ముందే కొనుగోలు చేసిన వారు కొందరైతే, పాత బంగారాన్ని ఎక్స్ఛేంజ్ చేసుకుంటున్న వారు మరికొందరు ఉన్నారు. మరోవైపు వధువు పట్టు చీరలు, వరుడి సంప్రదాయ దుస్తులు, కుటుంబ సభ్యుల కొత్త బట్టల కొనుగోళ్లతో వస్త్ర దుకాణాలు కళకళలాడుతున్నాయి.
క్యాటరింగ్, అలంకరణ రంగాలకు ఫుల్ డిమాండ్
వివాహ వేడుకల్లో పూల అలంకరణకు ప్రత్యేక స్థానం ఉండటంతో పూల వ్యాపారులు, డెకరేటర్లకు చేతినిండా పని దొరికనుంది. ఏపీలోని కడియం, బెంగళూరు తదితర ప్రాంతాల నుంచి ప్రత్యేకంగా పూలు తెప్పించి మండపాలను అలంకరిస్తుంటారు.
పెళ్లి మండపం, ప్రవేశ ద్వారం, స్టేజీ, కార్లు, ఇళ్ల అలంకరణ కోసం ఒక్కో వివాహానికి కేవలం డెకరేషన్‌కే రూ. 2 లక్షల నుంచి రూ. 10 లక్షల వరకు ఖర్చు చేస్తున్నారు. అలాగే, క్యాటరింగ్ రంగంలోనూ ఆర్డర్లు భారీగా పెరిగాయి.
వంటవాళ్లు, సర్వర్లు, క్లీనింగ్ సిబ్బంది, టెంట్లు ఏర్పాటు చేసే కార్మికులకు దినసరి ఉపాధి లభిస్తోంది. ఫొటోగ్రఫీ, వీడియో, డ్రోన్ షూటింగ్, మేకప్, మెహందీ వంటి సేవలకు డిమాండ్ విపరీతంగా పెరిగింది. గిఫ్ట్ షాపులు, బ్యూటీ పార్లర్లు, టైలర్లు, వాహనాల అద్దెదారులు ఇలా ప్రతి చిన్న వ్యాపారికి ఈ సీజన్ ద్వారా అదనపు ఆదాయం సమకూరనుంది.
ఈ రోజుల్లో మంచి ముహుర్తాలు
- ఆగస్ట్: 16,17, 20, 21, 22, 23, 26, 27, 28, 29, 30
- సెప్టెంబర్: 3, 4, 5 , 8,10,11,13,14
నెలరోజులు మంచి ముహుర్తాలు ఉన్నయ్
ఈ నెల 13 నుంచి శ్రావణ మాసం స్టార్ట్ కానుంది. వచ్చే నెల 11 వరకు ఈ మాసం కొనసాగనుంది. వినాయక చవితి వరకు మంచి ముహుర్తాలు ఉన్నాయి. తెలుగు రాష్ర్టాల్లో పెద్ద ఎత్తున పెళ్లిళ్లు జరగనున్నాయి. తెలుగు ఇండ్లలో శ్రావణ మాసాన్ని మంచి రోజులుగా భావిస్తారు. పెళ్లిళ్లే కాకుండా ఎంగేజ్ మెంట్, గృహ ప్రవేశాలు, పూజలు, కొత్త వ్యాపారాలు స్టార్ట్ చేయటం, కొత్త ఇండ్ల నిర్మాణం ఇలా ఎన్నో స్టార్ట్ చేస్తున్నారు.
చంద్రశేఖర శర్మ, పురోహితుడు, జగిత్యాల
