- కాలం చెల్లిన మందులు, పోర్టబుల్ స్కానింగ్ మెషీన్ గుర్తింపు
హైదరాబాద్, వెలుగు: ప్రభుత్వ ఉద్యోగిగా ఉంటూ తన స్థానంలో మరో ప్రైవేట్ వ్యక్తిని పెట్టి డ్యూటీకి డుమ్మా కొట్టినందుకు ఇప్పటికే సస్పెండైన జోగిపేట ఏరియా హాస్పిటల్ డీసీఎస్ డాక్టర్ కె.రమేశ్ అక్రమాలుఅ మరోసారి బట్టబయలయ్యాయి. సంగారెడ్డి జిల్లా పోతిరెడ్డిపల్లిలోని ఆయన సొంత ఆస్పత్రి అయిన 'కేబీఆర్ లైఫ్ కేర్ హాస్పిటల్'పై వైద్యారోగ్య శాఖ అధికారులు నిర్వహించిన ఆకస్మిక తనిఖీల్లో విస్తుపోయే నిజాలు వెలుగుచూశాయి. ప్రభుత్వ డ్యూటీ సమయాల్లో డాక్టర్ రమేశ్ ఇక్కడ పేషెంట్లను చూస్తున్నట్లు కేస్ షీట్ల ద్వారా పక్కా ఆధారాలు లభించాయి. మరో ప్రభుత్వ మహిళా గైనకాలజిస్ట్ కూడా తన విధులకు ఎగనామం పెట్టి ఈ హాస్పిటల్ లో ఆపరేషన్లు చేస్తున్నట్లు రికార్డులు వెల్లడించాయి.
హాస్పిటల్ తనిఖీల్లో రోగుల ప్రాణాలకు ముప్పు కలిగించే అంశాలను కూడా అధికారులు గుర్తించారు. ల్యాబొరేటరీలో 75 శాతం రియాజెంట్లు, ఆపరేషన్ థియేటర్‌లో అనస్థీషియా మందులు కాలం చెల్లినవి ఉండటంతో వెంటనే ల్యాబ్, ఓటీలను సీజ్ చేశారు. ఓటీలో నిబంధనలకు విరుద్ధంగా ఉన్న మొబైల్ ఆల్ట్రాసౌండ్ మెషిన్ ను స్వాధీనం చేసుకుని, లింగ నిర్ధారణ పరీక్షల అనుమానంపై పీసీఎన్డీటీ చట్టం కింద కేసు నమోదు చేశారు. ప్రస్తుతం హాస్పిటల్ లోచికిత్స పొందుతున్న ఐదుగురు పేషెంట్లను 48 గంటల్లో డిశ్చార్జ్ చేయాలని, అప్పటి వరకు కొత్త అడ్మిషన్లు, సర్జరీలు చేయకూడదని డీఎంహెచ్‌వో ఆదేశించారు. పేషెంట్లు డిశ్చార్జ్ అయిన వెంటనే హాస్పిటల్ ను పూర్తిగా సీజ్ చేయనున్నట్లు అధికారులు స్పష్టం చేశారు.
