సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మొగడంపల్లి మండలం సత్వర్ గ్రామ శివారులోని ఎన్ హెచ్ 65 జాతీయ రహదారిపై అదుపుతప్పిన ట్యాంకర్ లారీ.. ఆటోను వెనుక నుండి వేగంగా ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న 12 మందిలో ఏడుగురు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. మృతి చెందిన వారిలో ఆరుగురు మహిళలు, ఒక పురుషుడు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.
మృతులు కర్ణాటక రాష్ట్రంలోని రాజగిరి ప్రాంతానికి చెందినవారిగా గుర్తించారు. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, క్షతగాత్రులను తక్షణమే చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. ప్రమాదం కారణంగా జాతీయ రహదారిపై భారీగా నిలిచిపోయిన ట్రాఫిక్‌ను పోలీసులు క్రమబద్ధీకరించి, రాకపోకలను పునరుద్ధరించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.
