కోయగూడెం 3, సత్తుపల్లి 3 బ్లాక్లపై సింగరేణి ఫోకస్

కోయగూడెం 3, సత్తుపల్లి 3 బ్లాక్లపై  సింగరేణి ఫోకస్
  • రెండు గనులను దక్కించుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు
  • గతంలో వేలం ద్వారా ప్రైవేట్ సంస్థలకు కేటాయించిన కేంద్రం
  • పనులు ప్రారంభించకపోవడంతో కాంట్రాక్టులు రద్దు
  • 0.5 శాతం ఎక్సెస్ ఇస్తామంటున్న సింగరేణి
  •     గనులను సింగరేణికి కేటాయించాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని కలిసిన 
  • కార్మిక సంఘాలు

హైదరాబాద్, వెలుగు : కేంద్ర ప్రభుత్వం 2022, 2024లో నిర్వహించిన వేలం ద్వారా ప్రైవేట్ సంస్థల​చేతుల్లోకి వెళ్లిన కోయగూడెం 3, సత్తుపల్లి 3 బొగ్గు బ్లాక్ లను దక్కించుకోవడంపై సింగరేణి ఫోకస్ చేసింది. 

గిరిజన చట్టాలు, భూసేకరణ సమస్య కారణంగా ఈ రెండు గనుల వద్ద ఇప్పటివరకు ఎలాంటి పనులు ప్రారంభించలేదు. ప్రైవేట్​ ఏజెన్సీలు, కేంద్ర ప్రభుత్వం మధ్య ఉన్న ఈ సమస్య కాస్తా కోర్టుల వరకు వెళ్లింది. ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న గనులను గిరిజనులకు గానీ, ప్రభుత్వ రంగ సంస్థలకు గానీ అప్పగించాలి.

 కానీ కేంద్రం రెండు గనులను ప్రైవేట్ సంస్థలకు అప్పగించింది. దీంతో ఆ గనులను తిరిగి సింగరేణికి అప్పగించాలన్న డిమాండ్లు పెరుగుతున్నాయి. మరోవైపు ప్రైవేట్​సంస్థలు దక్కించుకున్న టెండర్లపై ఎక్సెస్​చెల్లించేందుకు సైతం సింగరేణి ముందుకొస్తోంది. ఇదే విషయంపై సింగరేణి కార్మిక సంఘాల నేతలు ఇటీవల కేంద్ర బొగ్గు శాఖ మంత్రి జి.కిషన్​రెడ్డిని కలిసి వినతిపత్రాలు ఇవ్వగా.. ఆయన పరిశీలిస్తామన చెప్పడం ఆసక్తి కలిగించింది. 

దొరకని భూ సేకరణ అనుమతులు

కేంద్రం బొగ్గు గనుల కేటాయింపు కోసం 2015లో వేలం విధానాన్ని ప్రవేశపెట్టింది. దేశవ్యాప్తంగా బొగ్గు బ్లాకులను వేలం ద్వారా కేటాయిస్తోంది. ఈ క్రమంలో భద్రాద్రి జిల్లాలోని కోయగూడెం ఓసీ- 3, సత్తుపల్లి ఓసీ 3 బొగ్గు బ్లాక్​లను సైతం వేలం వేసింది. 

ఈ బ్లాక్​లు గిరిజన భూ బదలాయింపు నియంత్రణ చట్టం 1/70 యాక్ట్​ అమల్లో ఉన్న షెడ్యూల్డ్ ఏరియా పరిధిలో ఉన్నాయి. కోయగూడెం ఓసీ-3 బ్లాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను 2022లో ‘మెస్సర్స్ ఆరో కోల్ ప్రైవేట్ లిమిటెడ్‌‌‌‌‌‌‌‌’, సత్తుపల్లి ఓసీ 3 బ్లాక్​ను 2024లో శ్రీ అవంతికా కాంట్రాక్టర్స్ (ఐ) లిమిటెడ్ అనే ప్రైవేటు సంస్థలు దక్కించుకున్నాయి. 

ఆ తర్వాత రాష్ట్రంలో సర్కారు మారడం, కాంగ్రెస్​ప్రభుత్వం చట్ట ప్రకారం ముందుకుపోవడంతో ప్రైవేట్ ఏజెన్సీల ఆటలు సాగలేదు. చట్ట ప్రకారం భూసేకరణ జరపాలంటే పీసా యాక్ట్​ ప్రకారం గ్రామ సభల తీర్మానం అవసరం కావడంతో రాష్ట్ర ప్రభుత్వ సహకారం లేకుండా అక్కడ బొగ్గు తవ్వకాలు జరపడం, బొగ్గు రవాణా చేయడం అసాధ్యమని తేలడంతో ప్రైవేట్ సంస్థలు మిన్నకున్నాయి.

ఆర్డర్లను వెనక్కి.. కోర్టుకెక్కిన ప్రైవేట్​ సంస్థలు

కోయగూడెం, సత్తుపల్లి బ్లాక్​లకు సంబంధించి కేంద్ర బొగ్గు శాఖ ఆదేశాలను పట్టించుకోకపోవడంతో ఆ సంస్థలకు ఇచ్చిన ఆర్డర్లను కేంద్రం వెనక్కి తీసుకుంది. దీంతో టెండర్​బిడ్డింగ్​సమయంలో తమ సంస్థలు చెల్లించిన మొత్తాలను వెనక్కి ఇవ్వాలంటూ ప్రైవేట్​సంస్థలు కోర్టులను ఆశ్రయించాయి. కోయగూడెం ఓసీ 3 దక్కించుకున్న సంస్థ.. తాము ఫీజుల రూపంలో కేంద్రానికి చెల్లించిన డబ్బులు తిరిగి ఇస్తే కాంట్రాక్ట్, కోర్టు కేసు రద్దు చేసుకునేందుకు సిద్ధంగా ఉన్నామని చెబుతోందని సింగరేణి కార్మిక సంఘాల నేతలు చెబుతున్నారు. 

0.5 శాతం ఎక్సెస్​ ఇస్తామంటున్న సింగరేణి

కోర్టు వివాదాలకు తెరదించి, ఆ రెండు బ్లాక్ లను ప్రభుత్వ రంగ సంస్థ అయిన సింగరేణికి కేటాయించాలని సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పలుమార్లు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ‘

కోయగూడెం ఓసీ-3 బ్లాక్‌‌‌‌‌‌‌‌లో సుమారు 120,  సత్తుపల్లి ఓసీ 3లో 70 మిలియన్​ టన్నులు బొగ్గు నిల్వలు ఉన్నట్లు అంచనా. ఇప్పటికే గనికి సంబంధించిన మైనింగ్ ప్రణాళికలు సిద్ధంగా ఉండటం, ప్రజాభిప్రాయ సేకరణ పూర్తవడం, పర్యావరణ అనుమతుల ప్రక్రియ ముందుకు సాగటం, అవసరమైన మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉండటం వంటి అంశాలను పరిగణలోకి తీసుకోవాలి’ అని వారు కేంద్రాన్ని కోరారు.

 కేంద్రం నిర్వహించిన వేలంలో టెండర్​ దక్కించుకున్న ప్రైవేట్​ సంస్థలు చెల్లించే మొత్తానికి అదనంగా మరో 0.5 శాతం ఎక్సెస్​ఇస్తామని సింగరేణి తరపున రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి ఇప్పటికే విజ్ఞప్తి చేసింది.

రెండు గనుల ద్వారా రూ. 17 వేల కోట్ల ఆదాయం


ఈ రెండు బొగ్గు గనులు సింగరేణికి దక్కితే రూ.17 వేల కోట్ల ఆదాయం వస్తుంది. అలాగే 3,500 మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలతో పాటు సర్కారుకు పన్నుల రూపంలో ఏటా రూ.400 కోట్లు వచ్చే అవకాశం ఉంది.  ఈ క్రమంలోనే  ఈ గనులను ఎలాగైనా సింగరేణికి దక్కేలా చూసేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తోంది. 

గిరిజన చట్టాల ప్రకారం ఏజెన్సీ ఏరియాలోని బొగ్గు బ్లాక్​లను ప్రభుత్వ రంగ సంస్థలకు మాత్రమే కేటాయించాలి. కానీ  దీనికి విరుద్ధంగా కేంద్రం ఈ బొగ్గు గనులను వేలం వేసి ప్రైవేట్​ వ్యక్తులకు అప్పగించింది. ఈ క్రమంలో ఈ రెండు బొగ్గు బ్లాక్​లను సింగరేణికి కేటాయించేలా కేంద్రం చొరవ తీసుకోవాలని కార్మిక సంఘాలు కోరుతున్నాయి.