దైవ దర్శనానికి వెళ్లి వస్తుండగా వరదలో చిక్కుకున్న కారు

 దైవ దర్శనానికి వెళ్లి వస్తుండగా వరదలో చిక్కుకున్న కారు

ఖమ్మం జిల్లాలో తృటిలో పెను ప్రమాదం తప్పింది. ఏన్కూరు మండలం నాచారం సమీపంలో వరద ఉధృతికి ఓ కారు నీటిలో చిక్కుకుంది. ఆలయ దర్శనం ముగించుకుని ఖమ్మం తిరిగి వస్తుండగా.. నిర్మాణంలో ఉన్న బ్రిడ్జి పక్కన వేసిన తాత్కాలిక మట్టి రహదారిపైకి భారీగా వరద నీరు చేరింది. దీంతో అందులో కారు చిక్కుకుపోయింది.

ఈ ప్రమాద సమయంలో కారు నుంచి బయటకు వస్తున్న ఓ మహిళ వరద ఉధృతికి కొట్టుకుపోతుండగా.. అప్రమత్తమైన స్థానిక రైతులు ప్రాణాలకు తెగించి ఆమెను సురక్షితంగా కాపాడారు. అనంతరం ట్రాక్టర్ల సాయంతో వరదలో చిక్కుకున్న కారును కూడా సురక్షితంగా బయటకు తీశారు. స్థానికులు, రైతులు సకాలంలో స్పందించడంతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. ఇక, స్వల్ప గాయాలైన ఆ మహిళను కుటుంబ సభ్యులు ఏన్కూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి మెరుగైన వైద్యం అందించారు.