జొమాటో, బ్లింకిట్ పేరెంట్ కంపెనీ ఎటర్నల్ సంస్థ డెలివరీ భాగస్వాముల ఆర్థిక భద్రత కోసం కీలక అడుగు వేసింది. ఈ ఏడాది తమ ప్లాట్‌ఫారమ్‌లో పనిచేస్తున్న 2 లక్షల 10వేల మంది డెలివరీ పార్ట్‌నర్‌లకు ఆదాయపు పన్ను రిటర్న్‌ల ఫైలింగ్‌ను సులభతరం చేసింది. దీని ద్వారా సుమారు రూ.33 కోట్ల ఆదాయపు పన్ను రీఫండ్స్ పొందడంలో వారికి సహాయపడింది.
ఈ ఐటీఆర్ ఫైలింగ్ ప్రక్రియలో పాల్గొన్న వారిలో దాదాపు 75 శాతం మంది మొదటిసారిగా పన్ను రిటర్న్‌లు దాఖలు చేసినవారేనట. వర్తించే 1 శాతం TDS రేటు ప్రకారం.. ఐటీఆర్ ఫైల్ చేసిన ప్రతి డెలివరీ పార్ట్‌నర్‌కు సగటున సుమారు రూ.16వందలు రిఫండ్ రూపంలో లభించింది. ఎన్నో ఏళ్లుగా అన్‌ఆర్గనైజ్డ్ రంగంలో ఉన్న అనేక మందికి ఇది తొలి అధికారిక ఆర్థిక అనుభవమని.. ఇది వారికి లోన్స్ పొందటాన్ని మరింత సులభతరం చేసి భవిష్యత్తులో ఆర్థిక భద్రత కల్పించడమే తమ ప్రధాన ఉద్దేశమని జొమాటో సీఈఓ ఆదిత్య మంగ్లా తెలిపారు.
ఈ సేవలను థర్డ్ పార్టీ సర్వీస్ ప్రొవైడర్ ద్వారా చాలా తక్కువ ధరలో అందించారు. జొమాటో, బ్లింకిట్ డెలివరీ పార్ట్‌నర్ యాప్‌లోనే ప్రత్యేక చాట్‌బాట్ అనుసంధానించబడి ఉండటంతో ఈ ప్రక్రియ పూర్తిగా డిజిటల్‌గా, సులభంగా సాగింది. డెలివరీ భాగస్వాములు తమ వివరాలను వెరిఫై చేసుకుని, ఓటీపీ ద్వారా ఆథెంటికేట్ చేసి కేవలం కొద్ది నిమిషాల్లోనే ఐటీఆర్ సమర్పించారు. ఏవైనా సందేహాలుంటే వెంటనే సహాయం అందించడానికి చాట్‌బాట్‌తో పాటు ప్రత్యేకంగా హెల్ప్‌లైన్, కాల్ సదుపాయాన్ని కూడా అందుబాటులో ఉంచారు.
ALSO READ : ఒరాకిల్ లేఆఫ్స్‌లో షాకింగ్ నిజాలు
డెలివరీ పార్ట్‌నర్ల సంక్షేమం కోసం జొమాటో, బ్లింకిట్ సంస్థలు ఇలాంటి అనేక వినూత్న కార్యక్రమాలను అమలు చేస్తున్నాయి. ఇందులో భాగంగా ఓపీడీ కవర్, హెల్త్ అండ్ యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్, మెటర్నిటీ ఇన్సూరెన్స్, మహిళా డెలివరీ పార్ట్‌నర్ల కోసం పెయిడ్ పీరియడ్ సెలవులు వంటి సంక్షేమ ప్రయోజనాలు కల్పిస్తున్నారు. అలాగే ఫిక్స్‌డ్, రికరింగ్ డిపాజిట్లు, గిగ్ వేరియంట్ నేషనల్ పెన్షన్ స్కీమ్ వంటి ఆర్థిక సాధనాలను అందిస్తూ వారి భవిష్యత్తుకు భరోసా కల్పిస్తోంది ఎటర్నల్ సంస్థ.
