బిలియనీర్ గౌతమ్ అదానీకి అమెరికా కోర్టు షాకిచ్చింది. లంచం కేసుకు సంబంధించి కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసులో అదానీతో పాటు ఇతర నిందితులపై ఉన్న క్రిమినల్ ఆరోపణలను తక్షణమే కొట్టివేసేందుకు అమెరికా ఫెడరల్ జడ్జి నిరాకరించారు. ఈ కేసును ఎందుకు విత్ డ్రా చేసుకోవాలని న్యాయశాఖ భావిస్తున్నదో చెప్పాలని ఆదేశించింది.
బ్రూక్లిన్ లోని యూఎస్ డిస్ట్రిక్ట్ జడ్జి నికోలస్ గరాఫిస్ (జూన్ 26) శుక్రవారం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. మే 18న జస్టిస్ డిపార్ట్‌మెంట్ దాఖలు చేసిన పిటిషన్ చాలా క్లుప్తంగా, బలమైన కారణాలు లేకుండా ఉందని అభిప్రాయపడ్డారు. ఈ కేసును ఎందుకు డ్రాప్ చేయాలనుకుంటున్నారో సరైన ఆధారాలతో కూడిన నివేదికను జూలై 13 లోగా కోర్టుకు సమర్పించాలని ప్రాసిక్యూటర్లను ఆదేశించారు.
అదానీ, ఆయన మేనల్లుడు సాగర్ అదానీపై 2024లో అమెరికాలో నమోదైన కేసులో, ఇండియాలో సౌర విద్యుత్ ప్రాజెక్టుల ఆమోదానికి వందల మిలియన్ డాలర్ల లంచాలు ఇవ్వడానికి ప్రయత్నించినట్లు ఆరోపణలు ఉన్నాయి. అయితే, ఈ ఆరోపణలను అదానీ గ్రూప్ మొదటి నుంచీ ఖండిస్తూ వస్తోంది.
అయితే అమెరికాలో ట్రంప్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత న్యాయశాఖ వైఖరి మారింది. ఈ కేసుపై మరింత సమయం, నిధులను కేటాయించలేమని న్యాయ శాఖ పేర్కొంది. జూన్ 24న, అదానీ తరపు న్యాయవాదులు ఈ కేసు అమెరికా అధికార పరిధిలోకి రాదని, లంచం ఇచ్చినట్లు నిరూపించడానికి తగిన ఆధారాలు లేవని కోర్టుకు తెలిపారు.
అయితే, న్యాయమూర్తి తుది నిర్ణయం తీసుకునే ముందు ప్రభుత్వానికి పూర్తి వివరణ కావాలని స్పష్టంగా చెప్పారు. ఈ క్రిమినల్ కేసు ప్రక్రియ కొనసాగుతున్న సమయంలో, అదానీ గ్రూప్ సివిల్ వివాదాల పరిష్కారానికి అంగీకరించింది. ఇందులో భాగంగా, గౌతమ్ అదానీ 6 మిలియన్ డాలర్లు, సాగర్ అదానీ 12 మిలియన్ డాలర్ల మేర సివిల్ సెటిల్‌మెంట్ కింద చెల్లించడానికి ప్రతిపాదనలు చేసుకున్నారు.
అదే విధంగా అదానీ ఎంటర్‌ప్రైజెస్, ఇరాన్ నుంచి ద్రవీకృత పెట్రోలియం గ్యాస్ (ఎల్పీజీ) దిగుమతులకు సంబంధించి అమెరికా ఆంక్షలను ఉల్లంఘించారనే ఆరోపణల పరిష్కారానికి 275 మిలియన్ డాలర్లు చెల్లించడానికి అంగీకరించింది.
