UPIపై ఛార్జీలతో ప్రజలపై ప్రభావం ఉండవన్నది తప్పుడు లాజిక్.. మోడీ ప్రభుత్వానికి ఆర్థిక వేత్త సూచన

UPIపై ఛార్జీలతో ప్రజలపై ప్రభావం ఉండవన్నది తప్పుడు లాజిక్.. మోడీ ప్రభుత్వానికి ఆర్థిక వేత్త సూచన

భారత్‌లో డిజిటల్ పేమెంట్స్ కి కీలకంగా మారిన UPIపై ఛార్జీలు విధించే అంశం మరోసారి చర్చనీయాంశంగా మారింది. యూపీఐ లావాదేవీలపై మర్చంట్ డిస్కౌంట్ రేట్(MDR) విధించేలా ప్రభుత్వానికి వీలు కల్పించే ట్యాక్సేషన్ అండ్ అదర్ లాస్(అమెండ్‌మెంట్) బిల్లు-2026ను పార్లమెంట్ ఆమోదించింది. అయితే దీనివల్ల సాధారణ వినియోగదారులు ఎలాంటి ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. అయితే దీనికి ఉన్న మరో కోణం గురించి ప్రముఖ ఆర్థికవేత్త అజిత్ రాణాడే చేసిన వ్యాఖ్యలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.

మర్చంట్ డిస్కౌంట్ రేట్‌ను కేవలం వ్యాపారుల నుంచే వసూలు చేస్తామని చెప్పడంతో సామాన్య యూజర్లపై ఎలాంటి ప్రభావం ఉండదని భావించడం సరైన లాజిక్ కాదని రాణాడే పేర్కొన్నారు. వ్యాపారులు ఆ అదనపు ఖర్చును స్వయంగా భరించటం లేదంటే వస్తువులు, సేవల ధరలను పెంచడం ద్వారా చివరికి వినియోగదారులపై ఆ భారాన్ని మోపే అవకాశం ఉందని అన్నారు. అంటే యూపీఐ లావాదేవీ సమయంలో నేరుగా ఛార్జీ చెల్లించకపోయినా.. పరోక్షంగా వినియోగదారులు దాని ప్రభావాన్ని ఎదుర్కొంటారని దీనివెనుక లాజిక్ గురించి చెప్పుకొచ్చారు. అంటే జనానికి నొప్పి తెలియకుండా ఛార్జీ వసూలు జరుగుతుందన్నమాట. 

ప్రస్తుతం యూపీఐని ప్రజలు చిన్న పేమెంట్స్ కోసం ఎక్కువగా వాడుతున్నారు. టీకి రూ.20, ఆటోకు రూ.150 వంటి చెల్లింపుల్లో లావాదేవీ ఖర్చు గురించి వినియోగదారులు, వ్యాపారులు ఆలోచించకుండా చెల్లింపులు పూర్తవుతున్నాయి. యూపీఐపై జీరో MDR ఉండటం దాని సక్సెస్ కి ఒక కారణంగా రాణాడే పేర్కొన్నారు. 

అయితే యూపీఐ నిర్వహణకు భారీ ఖర్చులు అవుతున్నాయని రాణాడే అంగీకరించారు. బ్యాంకులు, పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్లు, NPCI సర్వర్లు, సైబర్ సెక్యూరిటీ, మోసాల గుర్తింపు, వివాదాల పరిష్కారం, సెటిల్‌మెంట్ వంటి అంశాలపై భారీగా ఖర్చు చేస్తున్నాయి. ఈ ఖర్చు ఏడాదికి సుమారు రూ.20 వేల కోట్ల వరకు ఉండొచ్చని పేర్కొన్నారు. ఈ మొత్తాన్ని కేవలం బ్యాంకులు, పేమెంట్ సంస్థలే నిరంతరం భరించడం కూడా సరైన విధానం కాదని అన్నారు.

దీనికి ప్రత్యామ్నాయంగా ప్రభుత్వం పారదర్శకమైన రీయింబర్స్‌మెంట్ విధానాన్ని తీసుకురావాలని రాణాడే సూచించారు. రిజర్వ్ బ్యాంక్ నుంచి కేంద్రానికి వచ్చే డివిడెండ్ ఉపయోగించి యూపీఐ నిర్వహణ ఖర్చులను భర్తీ చేయవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. 2025-26లో ఆర్‌బీఐ నుంచి కేంద్రానికి వచ్చిన డివిడెండ్ రూ.2లక్షల 86 వేల కోట్లుగా ఉందని, యూపీఐ వార్షిక నిర్వహణ వ్యయం అందులో చిన్న భాగమేనని ఆయన గుర్తుచేశారు.

UPI ఛార్జీలపై ప్రజల ఫీలింగ్ ఇది.. 

మెుత్తానికి ప్రజల నుంచి యూపీఐ ఛార్జీలు వసూలు చేసే ఆలోచన లేనప్పటికీ.. డబ్బు ముద్రించటానికి దానిని ఆర్థిక వ్యవస్థలో సర్క్యూలేట్ చేయటానికి, దేశంలో దొంగ నోట్లను అడ్డుకునేందుకు చేస్తున్న ఖర్చు మాదిరిగానే యూపీఐ పేమెంట్ వ్యవస్థకు అవుతున్న ఖర్చులను కేంద్ర ప్రభుత్వం భరించాలనే వాదన ప్రజల నుంచి సోషల్ మీడియాలో గట్టిగానే వినిపిస్తోంది. భౌతిక కరెన్సీ సర్క్యూలేషన్ వల్ల వచ్చే సమస్యలను పరిష్కారంగా పుట్టిన డిజిటల్ చెల్లింపుల సిస్టమ్ ప్రయోజనాలు ప్రజల కంటే ప్రభుత్వానికి ఎక్కువగా ఉపయోగపడిన సంగతి తెలిసిందే. పైగా డిజిటల్ పేమెంట్స్ రాకతో ఎక్కువగా మోసాలకు గురై ప్రజలే డబ్బు కోల్పోతున్నారు. అందుకే కొందరు మళ్లీ కరెన్సీ నోట్లను వాడటం తమను మోసగాళ్ల నుంచి రక్షిస్తుందనే ఆలోచనలో కూడా ఉన్నారు. చూడాలి ప్రజల అభిప్రాయాన్ని మోడీ సర్కార్ ఎంత వరకూ పరిగణలోకి తీసుకుంటుంది అన్నది.