కాన్పూర్‌లో ఓ మహిళకు ఊహించని షాక్ ఎదురైంది. దాదాపు 17 ఏళ్లుగా తెరవకుండా ఉన్న తన SBI లాకర్‌ను ఇటీవల ఓపెన్ చేయటంతో అందులోని విలువైన వస్తువులే మాయమైనట్లు గమనించి షాక్ అయ్యింది. 2003లో తన పెళ్లి నగలతో పాటు ఫ్యామిలీ గోల్డ్ ఆభరణాలు, ఇతర విలువైన వస్తువులను లాకర్‌లో భద్రపరిచినట్లు మహిళ చెబుతున్నట్లు సమాచారం. వాటి విలువ సుమారు రూ.50 లక్షలు ఉంటుందని పేర్కొంటున్నారు. భర్త మరణం తర్వాత కుమార్తె వద్దకు వెళ్లి ఉంటున్న ఆమె.. జూలై 2026లో తన లాకర్‌ను పరిశీలించేందుకు బ్యాంకుకు వెళ్లడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.
బ్యాంకు శాఖకు వెళ్లిన సమయంలో మొదట మహిళకు మరో షాక్ ఎదురైనట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పోస్టులో పేర్కొన్నారు. తనకు లాకర్ ఉందని ఆమె చెప్పినప్పటికీ.. లాకర్ మేనేజర్ మాత్రం ఆ బ్రాంచ్‌లో ఆమె పేరుతో ఎలాంటి లాకర్ లేదని చెప్పినట్లు ఆరోపణలు వచ్చాయి. అయితే కొన్ని రోజుల తర్వాత లాకర్ నంబర్ 23ను గుర్తించారట. దాన్ని తెరిచి చూడగా పూర్తిగా ఖాళీగా ఉండటంతో మహిళ ఆందోళనకు గురైనట్లు తెలుస్తోంది. తాను ఏళ్ల క్రితం భద్రపరిచిన బంగారు నగలు, విలువైన వస్తువులు కనిపించకపోవడంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది.
►ALSO READ | డిజిటల్ చెల్లింపుల్లోకి ఆపిల్ పే ఎంట్రీ.. భారత్‌లో లాంచ్ ఎప్పుడంటే?
ఈ ఘటనలో మరింత అనుమానాలకు తావిస్తున్న అంశం బ్యాంకు రికార్డులేనని చెబుతున్నారు. లాకర్ నంబర్ 23ను 2020లో రెండుసార్లు యాక్సెస్ చేసినట్లు రికార్డుల్లో ఉన్నట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పోస్టు పేర్కొంది. అయితే ఆ సమయంలో లాకర్‌ను ఎవరు తెరిచారు? మహిళకు తెలియకుండా లాకర్‌ను ఎలా యాక్సెస్ చేశారు? అందులో ఉన్న వస్తువులు ఎప్పుడు మాయమయ్యాయి? అనే ప్రశ్నలు ఇప్పుడు తలెత్తుతున్నాయి. ఆ సొత్తును బ్యాంకు నుంచి మాయం చేయటంలో సిబ్బంది పాత్ర ఉందా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
🚨 She checked her SBI bank locker after 17 years. It was Completely empty !
— Vara Tweets 🪷 (@2Varalakshmi) August 10, 2026
A Kanpur woman trusted her SBI bank with everything her wedding jewelry, her family's gold... ₹50 LAKH worth, locked away since 2003 !
Her husband died. She moved in with her daughter. The bank kept… pic.twitter.com/7eLhFGf5Nf
ఈ ఘటనపై కాన్పూర్‌లోని స్వరూప్ నగర్ పోలీసులు SBI బ్రాంచ్ మేనేజర్‌తో పాటు మరికొందరు బ్యాంకు సిబ్బందిపై కేసు నమోదు చేసినట్లు సమాచారం. లాకర్ యాక్సెస్ రికార్డులు, బ్యాంకు డాక్యుమెంట్లు, సిబ్బంది పాత్ర తదితర అంశాలపై దర్యాప్తు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతానికి ఈ లాకర్ ఇష్యూపై స్టేట్ బ్యాంక్ అధికారికంగా స్పందించలేదు.
సాధారణంగా బ్యాంకు లాకర్లలో తమ విలువైన వస్తువులు భద్రంగా ఉంటాయని వినియోగదారులు నమ్ముతుంటారు. అయితే ఈ ఘటన వెలుగులోకి రావడంతో లాకర్‌ను ఏళ్ల తరబడి తెరవకుండా వదిలేయడం ఎంతవరకు సేఫ్ అనే చర్చ మొదలైంది. ముఖ్యంగా లాకర్‌ను చివరిసారిగా ఎప్పుడు తెరిచారు. యాక్సెస్ వివరాలు సరిగ్గా నమోదయ్యాయా.. వార్షిక లాకర్ ఫీజులు చెల్లించబడుతున్నాయా వంటి అంశాలను వినియోగదారులు ఎప్పటికప్పుడు పరిశీలించుకోవాల్సిన అవసరాన్ని ఈ ఘటన గుర్తుచేస్తోంది. ప్రస్తుతం వైరల్ అవుతున్న ఈ ఘటనలో అసలు ఏం జరిగిందనే దానిపై పోలీసుల దర్యాప్తు పూర్తయిన తర్వాతే పూర్తి నిజానిజాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.
