డిజిటల్ చెల్లింపుల్లోకి ఆపిల్ పే ఎంట్రీ.. భారత్‌లో లాంచ్ ఎప్పుడంటే?

డిజిటల్ చెల్లింపుల్లోకి ఆపిల్ పే ఎంట్రీ.. భారత్‌లో లాంచ్ ఎప్పుడంటే?

భారత డిజిటల్ పేమెంట్స్ మార్కెట్‌లోకి అడుగుపెట్టేందుకు ఆపిల్ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ప్రముఖ టెక్ కంపెనీ ఆపిల్ తన పేమెంట్ సర్వీస్ ‘ఆపిల్ పే’ను ఈ ఏడాది అక్టోబర్‌ నాటికి భారత్‌లో అందుబాటులోకి తీసుకురావచ్చని సమాచారం. అయితే ఈ విషయంపై ఇప్పటి వరకూ ఆపిల్ అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. లాంచ్ డేట్, ఫీచర్లు, అందుబాటులో ఉండే సేవలపై కూడా కంపెనీ నుంచి స్పష్టత రావాల్సి ఉంది.

భారత్‌లో ఆపిల్ పేను ప్రారంభించే ప్రక్రియలో భాగంగా కంపెనీ ఇప్పటికే కొన్ని ఆర్థిక సంస్థలు, బ్యాంకులతో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. తొలిదశలో వీసా, మాస్టర్‌కార్డ్ వంటి నెట్‌వర్క్‌లకు చెందిన క్రెడిట్ కార్డులకు ఆపిల్ పేలో సపోర్ట్ లభించే అవకాశం ఉంది. అర్హత ఉన్న కార్డులను యూజర్లు ఆపిల్ వాలెట్‌లో యాడ్ చేసుకుని, NFC ఫీచర్ ఉన్న పాయింట్ ఆఫ్ సేల్ టెర్మినల్స్ వద్ద ఐఫోన్, ఐప్యాడ్ ద్వారా కాంటాక్ట్‌లెస్ పేమెంట్స్ చేసేందుకు వీలు దొరకనుంది. 

అయితే ప్రారంభ దశలో యూపీఐ పేమెంట్స్ సర్వీసులు అందుబాటులో ఉండకపోవచ్చని తెలుస్తోంది. భారత్‌లో యూపీఐ ఆధారిత సేవలను అందించాలంటే నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) అనుమతితో పాటు స్పాన్సర్ బ్యాంక్ అవసరం. ఈ కారణంగా తొలుత కార్డు బేస్డ్ పేమెంట్స్‌కే ఆపిల్ పరిమితం కావచ్చని తెలుస్తోంది. 

ఆపిల్ పే ద్వారా జరిగే ప్రతి లావాదేవీపై బ్యాంకుల నుంచి 15 నుంచి 20 బేసిస్ పాయింట్ల ఫీజును ఆపిల్ కోరుతున్నట్లు సమాచారం. అయితే కొన్ని బ్యాంకులు 10 బేసిస్ పాయింట్లకే పరిమితం చేయాలని కోరుతున్నాయట. ఈ ఫీజు కస్టమర్లు, వ్యాపారులపై అదనపు ఛార్జీగా కాకుండా.. బ్యాంకులకు లభించే ఇంటర్‌చేంజ్ ఆదాయం నుంచి చెల్లించే విధంగా చర్చలు జరుగుతున్నట్లు సమాచారం.

ALSO READ : లంచం కేసులో అదానీకి భారీ ఊరట.. 

భారత్‌లో ఆపిల్ పే ఎంట్రీ ప్రీమియం క్రెడిట్ కార్డు మార్కెట్‌పై ప్రభావం చూపే అవకాశం ఉంది. దేశంలో యూపీఐ వినియోగం విస్తృతంగా ఉన్నప్పటికీ.. క్రెడిట్ కార్డు లావాదేవీలు కూడా 10 నుంచి 15 శాతం మేర పెరుగుతున్నాయని సమాచారం. పైన్ ల్యాబ్స్ సీఈఓ అమ్రిష్ రావు కూడా ఆపిల్ పే 2026 చివరి నాటికి భారత్‌లోకి వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నట్లు నివేదికలు చెబుతున్నాయి. అయితే దీనిపై క్లారిటీ కావాలంటే ఫైనల్ డెసిషన్, లాంచ్ తేదీపై ఆపిల్ అధికారిక ప్రకటన కోసం వేచి చూడాల్సిందే.