ఉదయం పూట బ్రేక్‌ఫాస్ట్‌లో కేవలం టీ, బిస్కెట్లు మాత్రమే తిని హడావుడిగా ఆఫీసు/పనులకు వెళ్తున్నారా ? అలా అయితే రోజంతా శరీరం అలసిపోయినట్లు, నీరసంగా ఉండటానికి అదే కారణం. ఇలా సరైన బ్రేక్‌ఫాస్ట్ తీసుకోకపోతే కొద్దిసేపటికే మళ్లీ ఆకలేస్తుంది.
అదే ఉదయాన్నే ప్రోటీన్లు ఉండే ఫుడ్ తింటే.. కడుపు నిండుగా ఉండటమే కాకుండా రోజంతా కావాల్సిన శక్తి దొరుకుతుంది. అంతేకాదు, ఇది బరువు అదుపులో ఉండటానికి, కండరాలు గట్టిపడటానికి, జీర్ణవ్యవస్థ బాగా పనిచేయడానికి చక్కగా సహాయపడుతుంది. అందుకే, టీ, బిస్కెట్లకు బదులుగా రోజంతా ఉత్సాహంగా ఉండేందుకు తీసుకోవాల్సిన 8 ఆరోగ్యకరమైన హై-ప్రోటీన్ అల్పాహారాలు ఏంటో ఇప్పుడు చూద్దాం!
1. పనీర్ బుర్జీ లేదా పరాఠా
పనీర్‌లో శరీరానికి కావాల్సిన నాణ్యమైన ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉంటాయి. ఉదయం పూట పనీర్ బుర్జీ లేదా పనీర్ పరాఠా తింటే రోజంతా శక్తి అందడంతో పాటు కండరాలు బలపడతాయి. దీన్ని పెరుగుతో తింటే జీర్ణక్రియ కూడా మెరుగుపడుతుంది.
2. ఎగ్ బుర్జీ లేదా వెజ్ ఆమ్లెట్
గుడ్లలో సంపూర్ణ ప్రోటీన్ లభిస్తుంది. ఉదయం పూట సింపుల్ గా కూరగాయలు వేసి చేసిన వెజిటబుల్ ఆమ్లెట్ లేదా ఎగ్ బుర్జీ తింటే చాలా మంచిది. బరువు తగ్గాలనుకునే వారికి, జిమ్‌కి వెళ్లే వారికి ఇది అద్భుతమైన అప్షన్.
3. పెసరపప్పు చీలా (మూంగ్ దాల్ చీలా)
పెసరపప్పులో మొక్కల ఆధారిత ప్రోటీన్ ఎక్కువ మొత్తంలో ఉంటుంది. ఈ చీలా తేలికగా జీర్ణమవడమే కాకుండా, కడుపు నిండుగా ఉండేలా చేస్తుంది. రుచి కోసం దీనిని పుదీనా చట్నీతో కలిపి తినవచ్చు.
4. మొలకల సలాడ్ (స్ప్రౌట్స్ సలాడ్)
మొలకెత్తిన పెసలు, శనగలు, వేరుశెనగలలో ప్రోటీన్, ఫైబర్ చాలా ఉంటాయి. వీటికి కొద్దిగా నిమ్మరసం, టమోటా ముక్కలు, మసాలాలు కలుపుకొని తింటే ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది.
5. గ్రీక్ యోగర్ట్ & సీడ్స్
సాధారణ పెరుగు కంటే గ్రీక్ పెరుగులో ప్రోటీన్ డబుల్ ఉంటుంది. దీన్ని మరింత ఆరోగ్యకరంగా మార్చుకోవడానికి ఇందులో చియా గింజలు, అవిసె గింజలు లేదా డ్రై ఫ్రూట్స్ కలుపుకొని తినవచ్చు.
6. పాలలో ఓట్స్
ఓట్స్‌లో ఫైబర్, ప్రోటీన్లు రెండూ సమృద్ధిగా ఉంటాయి. ఉదయం పూట పాలలో ఉడికించిన ఓట్స్ తీసుకుంటే రోజంతా అలసట లేకుండా చురుగ్గా పనిచేసుకోవచ్చు.
7. శనగపిండి చీలా లేదా టోస్ట్
శనగపిండిలో కూడా ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది. కొన్ని కూరగాయలు వేసి చేసిన శనగపిండి చీలా లేదా టోస్ట్ పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఇష్టపడే రుచికరమైన, ఆరోగ్యకరమైన అల్పాహారం.
8. హై-ప్రోటీన్ స్మూతీ
ఉదయం పూట ఆఫీసుకు వెళ్లే తొందరలో ఉండి వంట చేసుకోవడానికి సమయం లేకపోతే ఇది బెస్ట్ ఆప్షన్. పాలు, అరటిపండు, పీనట్ బటర్, కొన్ని గింజలను మిక్సీ పట్టుకుని హై-ప్రోటీన్ స్మూతీలా చేసుకుని తాగితే ఇన్స్టంట్ శక్తి వస్తుంది.
