ఫేక్ పోస్ట్‎తో అడ్డంగా బుక్కైన భజ్జీ.. బీజేపీపై ఆప్ ఎదురుదాడి

ఫేక్ పోస్ట్‎తో అడ్డంగా బుక్కైన భజ్జీ.. బీజేపీపై ఆప్ ఎదురుదాడి

చండీఘర్: భారత మాజీ క్రికెటర్, బీజేపీ రాజ్య సభ ఎంపీ హర్భజన్ సింగ్ చేసిన ఓ పోస్ట్ బీజేపీ, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) మధ్య మాటల యుద్ధానికి తెరలేపింది. ఆప్ నేతృత్వంలోని పంజాబ్‎లో డ్రగ్స్ వాడకం విపరీతంగా పెరిగిపోయిందని.. మత్తు పదార్థాలు తీసుకుని యువత జాంబీల్లా మారిపోతున్నారంటూ సోషల్ మీడియాలో భజ్జీ ఓ వీడియో పోస్ట్ చేశారు. ఈ వీడియోలో ఇద్దరు యువకులు డ్రగ్స్ మత్తులో జాంబీల్లా స్టిక్ అయిపోయారు. దీనిపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేసిన భజ్జీ.. పంజాబ్ యువత మరింత మెరుగైన జీవితానికి అర్హులని పేర్కొన్నారు. డ్రగ్స్ వినియోగాన్ని కట్టడి చేయడంలో ఆప్ సర్కార్ పూర్తిగా విఫలమైందన్నారు. మత్తు పదార్థాల వినియోగంపై ఇకనైనా పంజాబ్ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. 

అడ్డంగా బుక్కైన భజ్జీ..

పంజాబ్ యువత డ్రగ్స్ మత్తులో చిత్తు అవుతున్నారంటూ హర్భజన్ సింగ్ ఎక్స్ (ట్విట్టర్)లో షేర్ చేసిన వీడియో పంజాబ్ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపింది. దీనిపై అధికార బీజేపీ, ప్రతిపక్ష బీజేపీ మధ్య మాటల యుద్ధం నడిచింది. ఈ క్రమంలో భజ్జీ షేర్ చేసిన వీడియోను పోలీసులు ఫ్యాక్ట్ చెక్ చేయగా షాకింగ్ విషయం బయటపడింది. హర్భజన్ పోస్ట్ చేసిన వీడియో పంజాబ్‎ది కాదని.. రాజస్థాన్‎లోని శ్రీగంగా నగర్‎దిగా తేలింది. దీంతో బీజేపీపై ఆప్ ఎదురు దాడి మొదలుపెట్టింది.

భజ్జీపై మంత్రి బల్జిత్ కౌర్ ఫైర్:

పంజాబ్‎లో డ్రగ్స్ అంటూ హర్భజన్ సింగ్ తప్పుడు ప్రచారం చేయడంతో మంత్రి డాక్టర్ బల్జిత్ కౌర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజస్థాన్‌లోని శ్రీ గంగానగర్‌కు చెందిన వీడియోను పంజాబ్ సంఘటనగా హర్భజన్ తప్పుడు వీడియో షేర్ చేశాడని మండిపడ్డారు. ఆయన తన పార్టీ పెద్దలను ప్రసన్నం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. బీజేపీ తన స్వార్థ రాజకీయాల కోసం పంజాబ్ ప్రతిష్టను నాశనం చేయడానికి సిద్ధంగా ఉందని ఆరోపించారు.