తిరుమల ఘాట్ రోడ్డులో అదుపుతప్పి రక్షణగోడను ఢీకొన్న కారు... నలుగురికి గాయాలు..

తిరుమల ఘాట్ రోడ్డులో అదుపుతప్పి రక్షణగోడను ఢీకొన్న కారు... నలుగురికి గాయాలు..

తిరుమలలో ఘోర ప్రమాదం జరిగింది. మొదటి ఘాట్ రోడ్డులో కారు అదుపుతప్పి రక్షణగోడను ఢీకొనడంతో నలుగురు భక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. మంగళవారం ( ఆగస్టు 11 ) జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి... మొదటి ఘాట్ రోడ్డులోని వినాయక స్వామి గుడి దగ్గర జరిగింది ఈ ప్రమాదం. తిరుమల నుండి తిరుపతికి వస్తున్న కారు అదుపుతప్పి రక్షణ గోడను ఢీకొనడంతో ప్రమాదం జరిగింది.

ఈ ఘటనలో నలుగురు భక్తులకు గాయాలయ్యాయి.ప్రమాదం జరిగిన సమయంలో ఘాట్ రోడ్డులో ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు, విజిలెన్స్ సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు.

అతివేగమే ప్రమాదానికి కారణమని భావిస్తున్నారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనలో ప్రాణనష్టమేమి జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

ఇటీవల కాలంలో ఘాట్ రోడ్డుపై తరచుగా ప్రమాదాలు జరుగుతున్నాయి. ఘాట్ రోడ్డుపై వాహనం నడిపే విషయంలో నిర్లక్ష్యంతోపాటు ఎలా నడపాలి.. ఎంత స్పీడ్ వెళ్లాలి.. మలుపుల దగ్గర వాహనాన్ని ఎలా కంట్రోల్ చేయాలి.. ఎంత స్పీడ్ లో వెళ్లాలి అనే విషయాలపై సరైన అవగాహన ఉండటం లేదు. దీనికితోడు కొత్త కొత్త కార్లు వచ్చాయి. ఆటోమేటిక్ తోపాటు ఎలక్ట్రానిక్ మానిటరింగ్ వ్యవస్థలు ఉన్న కార్లు ప్రమాదాలకు గురవుతున్నాయి. 

గతంలో తిరుమల కొండకు వ్యక్తిగత వాహనాల రాక తక్కువగా ఉండేది. ఇటీవల కాలంలో వీటి సంఖ్యలో గణనీయంగా పెరిగింది. చాలా మంది కొత్త డ్రైవర్లు.. ఘాట్ రోడ్డులో వాహనం నడిపే విషయంలో నిర్లక్ష్యంతోపాటు అశ్రద్ధంగా ఉండటం.. రూల్స్ తెలియకపోవటం కూడా ప్రమాదాలకు కారణం అవుతుందనే ప్రచారం ఉంది.మలుపుల దగ్గర వాహనాలను ఎలా కట్ చేయాలి.. స్పీడ్ లిమిట్ ఎంత ఉండాలి అనేది అవగాహన లేకపోవటం వల్ల ఇటీవల తరచు ప్రమాదాలు జరుగుతున్నాయి.