హైదరాబాద్: దళితుడైన స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌ను అధ్యక్షా అనాల్సి వస్తుందనే కేసీఆర్ అసెంబ్లీకి రావడం లేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. దళిత బిడ్డలు నడిచిన నేలను శుద్ధి చేయించిన కేసీఆర్‌ను తెలంగాణ సమాజం వదలిపెట్టదని హెచ్చరించారు. బుధవారం (సెప్టెంబర్ 30) సీఎం రేవంత్ రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు.
అనంతరం బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. ‘‘కరీంనగర్ ప్రజలు కేసీఆర్‌ను గుండెల్లో పెట్టుకున్నారు. 2024, 2006, 2008లో కేసీఆర్‌ను గెలిపిస్తే కరీంగనర్ ప్రజలను మోసం చేసి పాలమూరు పారిపోయారు. 2009లో పాలమూరు ప్రజలు పార్లమెంటుకు పంపిస్తే.. తెలంగాణ ఏర్పడిన తర్వాత పాలమూరు ప్రజలను మోసం చేసి గజ్వేల్ వెళ్లిపోయిండు. కరీంనగర్ ప్రజలు మానేరులో పాతిపెడతారనే కేసీఆర్ పాలమూరు పారిపోయిండు’’ అని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
కాళేశ్వరం కట్టి లక్ష కోట్లు కొల్లగొట్టిర్రు:
కేసీఆర్ కుటుంబం తెలంగాణ ఉద్యమాన్ని అడ్డం పెట్టుకుని వేల కోట్లు సంపాదించిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కాళేశ్వరం కట్టి కేసీఆర్ లక్ష కోట్లు కొల్లగొట్టారని ఆరోపించారు. మానేరు ఇసుక కొల్లగొట్టి కేసీఆర్ బంధువులు రవీందర్ రావు, సంతోష్ రావు, కేటీఆర్ కోట్లు సంపాదించారన్నారు.
►ALSO READ | కేటీఆర్.. నా గురించి నీకు తెల్వదు.. ఫామ్‌హౌస్‌లో పడుకున్న మీ అయ్యని అడుగు: సీఎం రేవంత్
కేసీఆర్ ఫ్యామిలీ పదేండ్లలో వేల కోట్ల ఆస్తులు సంపాదించి.. వందల ఎకరాల ఫాంహౌస్‌లు నిర్మించుకున్నారని ఆరోపణలు చేశారు. తెలంగాణ ఉద్యమం, సిరిసిల్ల ప్రజల ఓట్లను కేసీఆర్ ఫ్యామిలీ సొమ్ముగా మార్చుకుందన్నారు. వేల కోట్లు సంపాదించి విలాసవంతమైన జీవితం గడుపుతున్నారని విమర్శించారు. ఎన్ని బాత్ రూములు, చిప్పలు కడిగితే అన్ని కోట్లు వస్తాయని ప్రశ్నించారు.
