రోడ్డుపై కోళ్లను గుంపులుగా వచ్చి ఎత్తుకెళ్లారు: గాయపడ్డ లారీ డ్రైవర్‎ను ఎవరూ పట్టించుకోలేదు

రోడ్డుపై కోళ్లను గుంపులుగా వచ్చి ఎత్తుకెళ్లారు: గాయపడ్డ లారీ డ్రైవర్‎ను ఎవరూ పట్టించుకోలేదు

అది ప్రధాన రహదారి.. నిత్యం ట్రాఫిక్ రద్దీ.. అలాంటి రోడ్డుపై లారీ యాక్సిడెంట్.. ఎవరైనా ఏం చేస్తారు.. లారీలో మనుషులు ఉన్నారా లేదా.. డ్రైవర్ పరిస్థితి ఏంటీ.. క్లీనర్ ఎలా ఉన్నాడు అని చూస్తారు.. ఇక్కడ మాత్రం సీన్ రివర్స్.. యాక్సిడెంట్ అయిన లారీ నుంచి కోళ్లు రోడ్డుపై పడ్డాయి. అంతే చుట్టుపక్కల అందరూ ఎగబడ్డారు. కోళ్లు ఎత్తుకెళ్లారు. అంతేకాదు.. ఆ రోడ్డుపై వెళుతున్న వాహనదారులు కొందరు.. తమ కార్లు, బైక్స్ ఆపి.. రోడ్డుపై పడిన కోళ్లను ఎత్తుకెళ్లారు.. కొద్ది మంది మానవత్వం ఉన్నోళ్లు మాత్రం.. ఇదేమీ విడ్డూరం.. చోద్యం.. డ్రైవర్ ఎలా ఉన్నాడు.. లారీ క్లీనర్ పరిస్థితి ఏంటీ అని ఆలోచన చేయకుండా.. సంచుల్లో.. గోతాల్లో కోళ్లు ఎత్తుకెళుతున్నారు అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఇంతకీ ఈ ఘటన ఎక్కడ జరిగింది అంటే..

తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం భాకరాపేట ఘాట్‌రోడ్డులో రోడ్డు ప్రమాదం జరిగింది. కోళ్ల లోడ్‎తో వెళ్తోన్న లారీ అదుపుతప్పి బోల్తా పడింది. భాకరాపేట నుంచి తిరుపతి వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. లారీ బోల్తా పడటంతో అందులో ఉన్న కోళ్లు రోడ్డుపై చెల్లాచెదురుగా పడిపోయాయి. దీంతో సమీప గ్రామస్తులు, అటుగా వెళ్తున్న వాహనదారులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకుని రోడ్డుపై పడిపోయిన కోళ్లను ఎత్తుకెళ్లారు. కానీ ప్రమాదానికి గురైన లారీ డ్రైవర్‎ను ఎవరూ పట్టించుకోలేదు. 

కనీస మానవత్వం చూపించకుండా కోళ్ల కోసం పోటీ పడ్డారు తప్పితే.. అయ్యో అని లారీ డ్రైవర్‎పై కనికరం చూపించలేదు. ఎట్టకేలకు కొందరు మానవత్వం ఉన్నవారు పోలీసులకు సమాచారం అందించి గాయపడ్డ డ్రైవర్‎ను ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని సహయక చర్యలు చేపట్టారు. ఘటన స్థలాన్ని పరిశీలించి ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీశారు. ఘాట్‌రోడ్డులో ప్రయాణించేటప్పుడు జాగ్రత్తగా వెళ్లాలని వాహనదారులకు సూచించారు.