మెమరీ కార్డ్ ఆర్డర్ చేస్తే కొత్తిమీర ఫ్రీగా పంపిన స్విగ్గీ ఇన్‌స్టామార్ట్! నెట్టింట వైరల్

మెమరీ కార్డ్ ఆర్డర్ చేస్తే కొత్తిమీర ఫ్రీగా పంపిన స్విగ్గీ ఇన్‌స్టామార్ట్! నెట్టింట వైరల్

మన దేశంలో ఇంటి పక్కన ఉండే కూరగాయల కొట్టులో కొనేటప్పుడు కొత్తిమీర, పచ్చిమిర్చి కాస్త ఫ్రీగా ఇవ్వడం చాలా ఏళ్లుగా కొనసాగుతున్న సంప్రదాయం. కస్టమర్ ఎంత సరుకు కొనుగోలు చేసినా చివర్లో “కొత్తిమీర కాస్త వేయండి” అని అడగడం.. వ్యాపారి కూడా చిన్న కట్టను ఉచితంగా ఇవ్వడం సాధారణమే. అయితే ఈ సంప్రదాయం ఇప్పుడు క్విక్ కామర్స్‌లోనూ విస్తరిస్తోంది. కూరగాయలు కాదు.. ఏకంగా మెమరీ కార్డ్ ఆర్డర్ చేసిన ఓ కస్టమర్‌కు స్విగ్గీ ఇన్‌స్టామార్ట్ నుంచి కొత్తిమీర ఫ్రీగా రావడం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఎస్‌డీ కార్డ్ ఆర్డర్.. పార్సెల్‌లో కొత్తిమీర
బెంగళూరుకు చెందిన వెంచర్ క్యాపిటలిస్ట్ రితేష్ బంగ్లానీ ఇటీవల స్విగ్గీ ఇన్‌స్టామార్ట్‌లో ఒక ఎస్‌డీ కార్డ్ ఆర్డర్ చేశారు. ఆర్డర్ డెలివరీ అయిన తర్వాత ప్యాకెట్‌ను తెరిచి చూసిన ఆయనకు ఊహించని సర్‌ప్రైజ్ ఎదురైంది. మెమరీ కార్డ్‌తో పాటు ఒక కట్ట కొత్తిమీర కూడా అందులో ఉంది. దీంతో ఆశ్చర్యపోయిన ఆయన ఈ విషయాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నారు. “ఇండియన్ క్విక్ కామర్స్ చాలా వైల్డ్‌గా ఉంది. నేను ఎస్‌డీ కార్డ్ ఆర్డర్ చేశాను.. దానితో పాటు కొంత కొత్తిమీర ఫ్రీగా పంపారు” అంటూ పోస్టు చేశారు. తన ఆర్డర్‌కు సంబంధించిన స్క్రీన్‌షాట్‌ను కూడా షేర్ చేశారు.

సోషల్ మీడియాలో జోకులే జోకులు
ఈ డెలివరీ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు తమదైన శైలిలో స్పందించారు. ఇది నిజమేనా అంటూ కొందరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తే.. మరికొందరు కిరాణా, కూరగాయల దుకాణాల్లోని పాత సంప్రదాయాన్ని క్విక్ కామర్స్ సంస్థలు కూడా ఫాలో అవుతున్నాయంటూ సరదాగా కామెంట్లు చేశారు. పేటీఎం వ్యవస్థాపకుడు విజయ్ శేఖర్ శర్మ కూడా ఈ పోస్టుపై స్పందిస్తూ.. “ఇది నిజం కాదని చెప్పండి.. లేదంటే నేను నవ్వుతూ పడిపోతా” అనే అర్థంలో కామెంట్ చేశారు. 

ఐఫోన్‌తో కూడా కొత్తిమీర వచ్చిందట
రితేష్ బంగ్లానీకి మాత్రమే ఇలా జరగలేదని వెల్లడైంది. ఎక్స్ యూజర్ వినయ్ కేసరి కూడా గత మే నెలలో క్విక్ కామర్స్ యాప్ ద్వారా ఐఫోన్ ఆర్డర్ చేసినప్పుడు తనకు ఫ్రీగా కొత్తిమీర అందిందని తెలిపారు. ఇందుకు సంబంధించిన ఫొటోను కూడా బంగ్లానీ పోస్టు కింద షేర్ చేశారు. ఇంటి పక్క ఉండే దుకాణాల్లో దశాబ్దాలుగా కొనసాగుతున్న ఫ్రీ కొత్తిమీర సంప్రదాయం 2024లో క్విక్ కామర్స్ ప్రపంచంలోనూ చర్చనీయాంశమైంది. ముంబైకి చెందిన వ్యాపారవేత్త అంకిత్ సావంత్ తన తల్లి బ్లింకిట్‌లో కూరగాయలు ఆర్డర్ చేసినప్పుడు కొత్తిమీరకు ప్రత్యేకంగా ఛార్జ్ చేయడాన్ని చూసి ఆశ్చర్యపోయారని ఎక్స్‌లో పోస్టు చేశారు. కూరగాయల ఆర్డర్‌పై నిర్దిష్ట విలువ దాటితే కొత్తిమీరను ఉచితంగా ఇవ్వాలని ఆమె సూచించగా.. బ్లింకిట్ సీఈఓ అల్బిందర్ ధిండ్సా “Will do” అంటూ అప్పట్లో స్పందించారు. అప్పటి నుంచి అన్ని ఎలిజిబుల్ ఆర్డర్లకు 100 గ్రాముల ఉచితంగా కొత్తిమీరను యాడ్ చేసుకునే అవకాశం అందుబాటులోకి తెచ్చింది కంపెనీ.