సర్కార్ స్కూళ్లపై కాక్రోజ్ జనతా పార్టీ దేశవ్యాప్త ఉద్యమం ...

సర్కార్ స్కూళ్లపై కాక్రోజ్ జనతా పార్టీ దేశవ్యాప్త ఉద్యమం ...

గ్రామాల్లో ప్రభుత్వ స్కూళ్లను బాగుచేయడం కోసం 'కాక్రోచ్ జనతా పార్టీ' (CJP) ఒక సరికొత్త దేశవ్యాప్త ఉద్యమానికి పిలుపునిచ్చింది. ఈ మేరకు ఆ పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే సోమవారం (ఆగస్టు 10, 2026) ఒక ప్రకటన విడుదల చేశారు. ఆగస్టు 15 (స్వాతంత్ర దినోత్సవం) నుంచి ఈ ప్రచారాన్ని ప్రారంభిస్తున్నట్లు తెలిపారు.

 దేశానికి స్వాతంత్రం వచ్చి 80 ఏళ్లు అవుతున్నా.. గ్రామాల్లోని ప్రభుత్వ స్కూళ్లను  ఎవరూ పట్టించుకోవడం లేదని అభిజీత్  దీప్కే ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో కొత్త పార్లమెంట్లు, పెద్ద పెద్ద బిల్డింగ్‌లు కట్టుకుంటున్నప్పుడు, గ్రామీణ పిల్లల కోసం మంచి బడులను ఎందుకు నిర్మించలేకపోతున్నామని ఆయన ప్రశ్నించారు.

  గ్రామాల్లోని ప్రభుత్వ బడులను బాధ్యతగా తీసుకుని అభివృద్ధి చేయాలని సర్పంచ్‌లకు ఆయన పిలుపునిచ్చారు. మహారాష్ట్రలోని తన స్వగ్రామం హింగోలిలో అక్కడి సర్పంచ్‌ను కలవడం ద్వారా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నట్లు చెప్పారు.

బడులను బాగు చేసిన సర్పంచ్‌లను CJP బహిరంగంగా అభినందిస్తుంది. స్కూళ్ల  అభివృద్ధికి ముందు, ఆ తర్వాత తీసిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి వారికి మంచి గుర్తింపు తెస్తామన్నారు. దీన్ని 'సర్పంచ్ ఛాలెంజ్'గా అభివర్ణించారు.

 ప్రభుత్వ బడుల్లో చదువుతున్న పిల్లల తల్లిదండ్రులు స్వయంగా స్కూళ్లకు వెళ్లి అక్కడ కరెంట్, తాగునీరు, మరుగుదొడ్లు, మధ్యాహ్న భోజనం సరిగ్గా అందుతున్నాయో లేదో పరిశీలించాలని కోరారు.

 స్కూళ్లలో ఏవైనా సౌకర్యాలు లేకపోతే తల్లిదండ్రులు వాటిని వీడియో తీయాలని, పిల్లల చదువు బాగుండేలా చూసే హక్కు అందరికీ ఉందని ఆయన గుర్తుచేశారు. త్వరలోనే CJP సోషల్ మీడియా పేజీల్లో ఒక 'ఆడిట్ ఫారమ్'ను అందుబాటులో ఉంచుతామని, అందులో నింపిన వివరాలు, వీడియోలను contact@cockroachjantaparty.org కు మెయిల్ చేయవచ్చని తెలిపారు.

 పెద్ద నగరాల్లోని పిల్లలతో సమానంగా గ్రామాల్లోని రైతులు, కూలీల పిల్లలకు కూడా మంచి వసతులు అందాలన్నదే ఈ ప్రచారం ముఖ్య  ఉద్దేశమని సీజేపీ స్పష్టం చేసింది.

 ఇదివరకు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద NEET పరీక్షల పేపర్ లీకేజీలకు వ్యతిరేకంగా 36 రోజుల పాటు సీజేపీ ఆధ్వర్యంలో పెద్ద ఉద్యమం జరిగిన విషయం తెలిసిందే. అయితే, మేము ఎన్నికల రాజకీయాల్లోకి వెళ్లకుండా ఒక బలమైన యువజన ఉద్యమంగానే కొనసాగుతామని స్పష్టం చేసింది. ఈ ప్రచారం కోసం “క్యా బోల్తీ పబ్లిక్?” అనే నినాదాన్ని కూడా ఖరారు చేసింది.