సాఫ్ట్‌వేర్ జాబ్ పోయింది.. ఊళ్లో సూపర్ మార్కెట్ పెట్టి రోజూ రూ.50వేలు సంపాదిస్తున్న కుర్రోడు

సాఫ్ట్‌వేర్ జాబ్ పోయింది.. ఊళ్లో సూపర్ మార్కెట్ పెట్టి రోజూ రూ.50వేలు సంపాదిస్తున్న కుర్రోడు

సాధారణంగా సాఫ్ట్‌వేర్ ఉద్యోగం పోయిందంటే ఏ టెక్కీ అయినా ఏం చేస్తాడు? రెజ్యూమ్ అప్‌డేట్ చేసి, లింక్డ్‌ఇన్‌లో ఓపెన్ టు వర్క్ అని పెట్టి, మరో కంపెనీ ఇంటర్వ్యూల కోసం రాత్రింబవళ్లు కోడింగ్ ప్రాక్టీస్ చేస్తాడు. కానీ ఈ శ్రీలంక టెక్కీ థింకింగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్. లేఆఫ్స్‌లో జాబ్ ఊడిపోతే ఏమాత్రం కుంగిపోకుండా.. తన సొంత ఊరిలోనే బిజినెస్ సామ్రాజ్యాన్ని స్థాపించి అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు సమీత సులక్కన.

సమీత ఒక సాఫ్ట్‌వేర్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్. అందరిలాగే టెక్ ఇండస్ట్రీలో సెటిల్ అవ్వాలని కలలు కన్నాడు. కంపెనీలో జరిగిన సడన్ లేఆఫ్స్ వల్ల ఉద్యోగం కోల్పోయి ఒక్కసారిగా రోడ్డున పడ్డాడు. భవిష్యత్తుపై తీవ్ర అనిశ్చితి నెలకొన్న ఆ కష్టకాలంలో.. అతడు మరో సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం వెయిట్ చేస్తూ కూర్చోలేదు. తన ఊరిలో ఎలాంటి వ్యాపార అవకాశాలు ఉన్నాయో రీసెర్చ్ చేయడం మొదలుపెట్టాడు. ఆ సమయంలో తన గ్రామంలో స్థానిక ప్రజల అవసరాలు తీర్చడానికి ఒక్క 'మినీ సూపర్‌మార్కెట్' కూడా లేదనే విషయాన్ని గమనించాడు. అంతే ఆ లోటునే ఒక క్రేజీ బిజినెస్ ఐడియాగా మార్చుకున్నాడు.

ఓ వైపు కోడింగ్‌పై ప్యాషన్ ఉన్నా, సాఫ్ట్‌వేర్ బ్యాక్‌గ్రౌండ్‌ను తన బిజినెస్‌కు ప్లస్ పాయింట్‌గా మార్చుకున్నాడు సమీత. సాధారణ కిరాణా కొట్టులా కాకుండా.. టెక్నాలజీని వాడుకుని కస్టమర్ ఎక్స్‌పీరియన్స్‌ను పెంచాలనుకున్నాడు. అందుకోసం తనే స్వయంగా ఒక సింపుల్ ఆన్‌లైన్ ఆర్డరింగ్ సిస్టమ్‌ను డెవలప్ చేశాడు. క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్‌తో ఊరి ప్రజలు ఇంట్లో కూర్చునే ఆర్డర్ చేసుకునేలా సౌకర్యం కల్పించాడు. ఈ డిజిటల్ ఐడియా సూపర్ హిట్ అయింది. కేవలం మూడు నెలల్లోనే ఈ బిజినెస్ ఊహించని స్థాయికి చేరింది. ప్రస్తుతం రోజుకు రూ.50వేలకు పైగా టర్నోవర్‌తో దూసుకుపోతోంది ఈ టెక్కీ బిజినెస్.

తన సక్సెస్ స్టోరీని సమీత లింక్డ్‌ఇన్‌లో షేర్ చేయడంతో నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు. సమస్యలు వచ్చినప్పుడు పానిక్ అవ్వకండి.. పరిస్థితులకు తగ్గట్టుగా మారి మొదటి అడుగు వేయండి విజయం మీదే అంటూ తోటి టెక్కీలకు అతడు ఇస్తున్న సలహాలు తెగ వైరల్ అవుతున్నాయి. త్వరలోనే ఈ స్టోర్‌తో పాటు ప్యూర్ వాటర్ డిస్ట్రిబ్యూషన్ బిజినెస్‌ను కూడా స్టార్ట్ చేయబోతున్నాడు. జీవితం విసిరిన సవాలును సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ రీరైట్ చేసిన విధానం నిజంగానే హాట్ టాపిక్ అయింది నెట్టింట ప్రస్తుతం.