అదరగొట్టిన బ్యాంకులు ఐసీఐసీఐ.. క్యూ2 లాభం రూ.14,843 కోట్లు

అదరగొట్టిన బ్యాంకులు ఐసీఐసీఐ.. క్యూ2 లాభం  రూ.14,843 కోట్లు

ముంబై:   ఐసీఐసీఐ బ్యాంక్ రిజల్ట్స్‌ అంచనాలను మించాయి. ఈ ఏడాది సెప్టెంబర్ క్వార్టర్‌‌ (క్యూ2) లో  బ్యాంక్ స్టాండలోన్ నికర లాభం ఏడాది లెక్కన 20.1 శాతం వృద్ధి చెంది రూ.14,843 కోట్లకు చేరింది.  మార్కెట్ నిపుణులు అంచనా వేసిన రూ.14,280 కోట్ల కంటే ఇది 3.9 శాతం ఎక్కువ. 

నికర వడ్డీ ఆదాయం (ఎన్‌ఐఐ) 17.7 శాతం పెరిగి రూ.25,339 కోట్లకు చేరగా, రుణాలు, అసెట్ క్వాలిటీ మెరుగుపడ్డాయి.   పన్నులు, వడ్డీలకు ముందు లెక్కించే ఆపరేటింగ్ లాభం 21.8 శాతం పెరిగి రూ.20,805 కోట్లకు చేరగా, ఫీజుల ద్వారా ఆదాయం 20.1 శాతం వృద్ధితో రూ.7,795 కోట్లుగా నమోదైంది.


37 శాతం పెరిగిన యాక్సిస్ లాభం

యాక్సిస్ బ్యాంక్‌ నికర లాభం క్యూ2 లో ఏడాది లెక్కన 37.6 శాతం పెరిగి రూ.7,003.3 కోట్లకు పెరిగింది. నికర వడ్డీ ఆదాయం 11.8 వృద్ధి చెంది రూ.15,371.4 కోట్లకు చేరింది.

హెచ్‌డీఎఫ్‌సీ లాభం  రూ.19,510 కోట్లు

 మరో ప్రైవేట్ బ్యాంక్ హెచ్‌డీఎఫ్‌సీ కూడా తమ క్యూ2 ఫలితాలను శనివారం ప్రకటించింది.  బ్యాంక్ స్టాండలోన్ నికర లాభం ఏడాది ప్రాతిపదికన 4.7 శాతం వృద్ధితో రూ.19,510 కోట్లకు చేరగా,  నికర వడ్డీ ఆదాయం  9.7 శాతం పెరిగి రూ.34,619.2 కోట్లకు ఎగిశాయి. రుణాలు, డిపాజిట్లు రెండంకెల వృద్ధి సాధించాయి. 

మొత్తం రుణాలు 16.3శాతం పెరిగి రూ.32.19 లక్షల కోట్లకు, డిపాజిట్లు 18.8శాతం వృద్ధితో రూ.33.27 లక్షల కోట్లకు చేరాయి. అసెట్ క్వాలిటీ మరింత మెరుగైంది.  స్థూల ఎన్‌పీఏ  రేషియో కిందటేడాది సెప్టెంబర్ క్వార్టర్‌‌లోని 1.17శాతం నుంచి 1.11శాతానికి తగ్గగా, నికర ఎన్‌పీఏ రేషియో 0.37శాతం వద్ద ఉంది. ప్రొవిజన్లు రూ.3,574 కోట్లకు పెరిగాయి.  తమ డిప్యూటీ ఎండీ కైజాద్ భరూచా ఈ ఏడాది డిసెంబర్ 31 న పదవీ నుంచి తప్పుకుంటారని, ఆయన ప్లేస్‌లో లిలీ వదేరా జాయిన్ అవుతారని బ్యాంక్ తెలిపింది.